ప్రజాసమస్యలు పట్టని సర్కారిది

మండపేట : ప్రజాసమస్యలు పట్టని విధంగా పనిచేస్తూ పేదవర్గాల వారిని ప్రభుత్వం ఇబ్బందులు పాల్జేస్తోందని వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు విమర్శించారు. ఒక్కరోజు మాత్రమే ఫించన్లు పంపిణీ అంటూ మండలంలోని అర్తమూరులో దండోరా వేయించడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక కామత్‌ ఆర్కెడ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక్క రోజు మాత్రమే సామాజిక ఫించన్లు పంపిణీ చేస్తామంటూ మండలంలోని అర్తమూరులో పంచాయతీ అధికారులు దండోరా వేయించడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. వేలిముద్రలు పనిచేయకపోయిన వారు, ఆన్‌లైన్‌ సరిగా పనిచేయపోయినా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏదైనా పనిపై ఊరువెళ్లిన వారు ఫించన్‌ సొమ్ములను నష్టపోవాల్సి వస్తుందన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదవర్గాల వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నారన్నారు. గతంలో మాదిరి మూడు రోజులు పాటు ఫించన్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలని పాపారాయుడు డిమాండ్‌ చేశారు.

Back to Top