కాంట్రాక్ట్ కోసం హోదాను అమ్మేశాడు

()చంద్రబాబు కేంద్రానికి అమ్ముడుపోయాడు
()పోలవరం కాంట్రాక్ట్ కోసం హోదాను పణంగా పెట్టాడు
()ఓటుకు కోట్లు కోసం ఏపీ జలాలను తెలంగాణకు తాకట్టుపెట్టాడు
()మట్టి పనులు చేసి రూ.1800 కోట్లు దోపిడీ చేశారు
()ఇప్పుడు మళ్లీ రూ.1400 కోట్లు పెంచి అవినీతికి తెరలేపారు
()చంద్రబాబుపై నిప్పులు చెరిగిన బొత్స సత్యనారాయణ

హైదరాబాద్ః పోలవరం కాంట్రాక్ట్ కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రానికి అమ్మేశారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రత్యేకహోదా రాకపోతే ఏమైపోతామోనని రాష్ట్ర ప్రజలంతా ఆందోళన చెందుతుంటే...బాబు మాత్రం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ల కోసమా బాబు ప్రజలు నిన్ను ఐదేళ్లు ఎన్నుకుంది అని కడిగిపారేశారు. హోదా ఇవ్వడం లేదని ఓపక్క  కేంద్రం చెబుతుంటే...ప్యాకేజీని స్వాగతిస్తున్నాం, ప్రధానికి థాంక్స్ అని ముఖ్యమంత్రి ఆనందంగా చెప్పడమేంటో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలు, అవినీతి కోసం బీజేపీకి అమ్ముడుపోయి రాష్ట్రాన్ని ఏవిధంగా తాకట్టుపెడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలని బొత్స సూచించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  

కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను కాంట్రాక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు....చట్టంలో పెట్టిన అంశాల్ని, రాజ్యసభ సాక్షిగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని బాబు ఏవిధంగా పణంగా పెట్టారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి విభజన చట్టంలోని  షెడ్యూలో 90లో దాన్ని చేర్చారని బొత్స పేర్కొన్నారు. టైమ్ బాండ్ లో దీన్ని నిర్మించే బాధ్యతను తామే తీసుకుంటామని కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయాన్నిబొత్స గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు పోలవరంలో దోపిడీ కోసం కేంద్రంతో బేరం పెట్టుకొని... ఏపీకి సంజీవని లాంటి హోదాను కాలరాశారని నిప్పులు చెరిగారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం మీద కాకుండా కాంట్రాక్ట్ మీద ఇంట్రస్ట్ ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈనెల 7న చెప్పిన మరునాడే... రూ. 1400 కోట్లు అంచనా వ్యయం పెంచి చంద్రబాబు జీవో విడుదల చేశారని  బొత్స చెప్పారు.  హోదా వస్తుంది. తెలుగుదేశం వ్యవహారాలు చూస్తున్న బీజేపీ మంత్రి  వెంకయ్యనాయుడు చూస్తున్నారని హడావిడి చేశారని...చివరకు ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని దుయ్యబట్టారు.  పోలవరం కాంట్రాక్ట్ ను స్టేట్ కిస్తే దానికి టెండర్ లేకుండా చేసి... బాబు తనకు సంబంధిచిన తాబేదారుకు సబ్ కాంట్రాక్ట్ లు ఇప్పిచ్చుకొనే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రే స్వయంగా సబ్ కాంట్రాక్ట్ లు డిసైడ్ చేసి ఇవ్వడం చోద్యంగా ఉందన్నారు. అధికారులు గాకుండా సబ్ కాంట్రాక్ట్ లు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారంటే రాష్ట్రాన్ని ఏవిధంగా దోపిడీ చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. 

ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు ఏపీకి దక్కాల్సిన నీటి జలాలను తెలంగాణకు తాకట్టుపెట్టారు. హైదరాబాద్ నుంచి పారిపోయారు. ఇప్పుడు పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చినందుకు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రధానికి థాంక్స్ చెబుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి అమ్మేసి చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోయాడని బొత్స విరుచుకుపడ్డారు. హోదా సంజీవని కాకపోతే 15 ఏళ్లు కావాలని బాబు ఆనాడు ఎందుకు అడిగారని నిలదీశారు. ఆనాడు హోదా మంచిదైంది..ఇవాళ కాకుండా పోయిందా అని బాబును ప్రశ్నించారు.  తాబేదారులకు, ఎలక్షన్ లో సంచుల మూటలు మోసిన వ్యక్తులకు దోచిపెట్టడం కోసం బాబు అవినీతి కార్యక్రమాలకు తెరలేపారని ఆగ్రహించారు.

చట్టంలో పెట్టిన అంశాలను ఎందుకు నీరుగారుస్తున్నారు. మెయిన్ డ్యాం కట్టాల్సిన అవసరం లేదని ఓ పత్రికలో వచ్చింది. రాష్ట్రంలో మీరు ప్రజలే. మీ ఆలోచన ఏంటి. రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారు. కేంద్రం ప్రాజెక్ట్ ను రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. పోలవరం అథారిటీని కాదని చెప్పి రూ.1800 కోట్లు మీరే మట్టి పనులు చేసి  దోపిడీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం దుర్మార్గం. బహుళార్థ ప్రయోజనాలున్న పోలవరం పూర్తి కావాలని తాము ముందు నుంచి కోరుతున్నాం. రాజధాని,   పోలవరం ఇలా ప్రతీ దాంట్లో దోపిడీ చేస్తున్నారు. ఇదేమిటని  ప్రశ్నిస్తే వైయస్సార్సీపీ అడ్డుకుంటుందని అబాండాలు వేస్తున్నారు. ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై బొత్స ధ్వజమెత్తారు. 

రూ. 1600 ఎకరాల్ని స్విస్ ఛాలెంజ్ లో టెండర్ పిలిచినప్పుడు ఏపీ ప్రబుత్వానికి 42 శాతం...సింగపూర్ కంపెనీకి 58 శాతం కట్టబెట్టారు. పెట్టుబడులు చూస్తే కేవలం రూ. 350 కోట్లు సింగపూర్ కంపెనీ. ఏపీ సర్కార్ మాత్రం 12వేల కోట్లు ఇన్వాల్స్ మెంట్ .  ఇన్ ఫ్రాస్ట్రక్టర్ అంతా ప్రభుత్వమే భరిస్తుందని మీరిచ్చిన టెండర్ లోనే చెప్పారు. సర్వం దోపిడీయే. స్విస్ చాలెంజ్ ను కోర్టులు ఆపితే వైయస్సార్సీపీ వ్యతిరేకమంటారు. బాబు మీరు చేస్తున్న అవినీతిని ప్రజల పక్షాన అడిగితే తప్పా. దోపిడీని అడ్డుకుంటే తప్పా..?. ప్రధానికి థాంక్స్ చెప్పాక ఇంకెక్కడ ఉంది హోదా. కోట్ల రూపాయలకు అర్థరాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు. దోపిడీ కోసమాబాబు ప్రజలను నిన్ను ఎన్నుకుంది. టీడీపీ అవినీతి పనులను తీవ్రంగా ఖండిస్తున్నాం.  రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని బొత్స కోరారు. 


Back to Top