రైతన్నలకు బంగారు భవితనిస్తా

నెల్లూరు :

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే ఐదు సంతకాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల దశ, దిశ మారుస్తానని, అక్కచెల్లెళ్ళు, రైతన్నలకు బంగారు భవితను అందిస్తానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ‘దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా.. ఆయన ఎక్కడ ఉన్నారని అడిగితే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల వైపు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని నినదిస్తారు. ఆ మహానేత నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత. ఆ రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ మీకు అందిస్తా' అన్నారు. ఎయస్ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు, ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలాల్లో శనివారం జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’ ఎన్నికల ప్రచార‌ంలో మాట్లాడారు.

‘మన తలరాతలు మార్చే ఎన్నికలు మరో 20 రోజుల్లో రానున్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ ప్రజల కష్టాలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తానని అడ్డగోలు హామీలిస్తూ మీ ముందుకు ఆల్‌ఫ్రీ బాబుగా వస్తున్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్నారు. ఆయనపై చెప్పు‌లు వేయించి ఆయన మరణానికి కారకుడయ్యారు. ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనపడకుండా చే‌సిన చంద్రబాబు తర్వాత అవసరం కోసం ఎన్టీఆర్ ఫొటోలకు దండలేసి దండం పెడుతున్నారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యనిషేధం అన్నారు. తర్వాత ఈనాడు పత్రికలో రాతలు రాయించి ఊరూరా బెల్టుషాపులు పెట్టించారు. రూ.2కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచి రూ.5.25 చేశా‌రు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు, ఎన్నికల తర్వాత ప్రజలకూ వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర ఆయనది. నయవంచకుడు చంద్రబాబును నమ్మొద్దు. ఆయన చస్తే నిజాలు చెప్పరు. చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పి అదే నిజమని నమ్మించే రకం. ఆయన మీ ముందుకు వస్తే సీఎంగా తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఏం మేలు చేశావని నిలదీయండి’ అని ప్రజలకు శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం తాను రాష్ట్ర ప్రజల కోసం సంతకాలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి శ్రీ జగన్ సవివరంగా పేర్కొన్నారు.

Back to Top