నెల్లూరు: సోమవారం జరిగే ఎన్నికల్లో గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్లు నీచ స్థాయికి తీసుకువచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైయస్ఆర్‌సీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ గెలవాలని చూస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్, కడప, విజయవాడల నుంచి దొంగతనాలు, హత్యలు చేయడంలో.. అసాంఘీక కార్యకలాపాలు చేయడంలో ఆరితేరిన వారిని తీసుకువచ్చి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంచారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎన్నికల సమయంలో బయటి వ్యక్తులు ఇక్కడ ఉండేందుకు లేదని చెప్పారు. అయినా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా జిల్లా కలెక్టర్, ఎస్పీ భాద్యులు అవుతారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటల తరువాత ఫిర్యాదు చేస్తాం.. టీడీపీ నేతలు తీసుకు వచ్చిన వందలాది రౌడీలు ఎక్కడ ఉన్నారో ఆధారాలతో సహా ఇస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. నేర ప్రవృత్తి, సహచరులను వెన్నుపోటు పొడిచే స్వభావం కలిగిన చంద్రబాబు ఈ రోజు పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడని విజయసాయి రెడ్డి తెలిపారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో.. అక్కడ సేనా అనే పేరుతో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి తగువు పెట్టేందుకు చెప్పడం లేదు.. జనసేన కార్యకర్తలు అప్రమత్తం కండి.. చంద్రబాబు ఎలా జనసేనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో.. జనసేన కూడా టీడీపీకి తగిన విధంగా బుద్ది చెప్పాలని విజయసాయి రెడ్డి కోరారు.