మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో చంద్రబాబు కొత్త పాట

అధికారం అండతో పెండింగ్ కేసుల తారుమారు

సుప్రీంకోర్టులో పెండింగ్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్

పెండింగ్ లో ఉండగా కేసు ఎలా మూసివేస్తారు?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు 

కాకినాడ క్యాంప్ ఆఫీస్ లో  మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు 

కోర్టుల్లో చంద్రబాబు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి 

చంద్రబాబులా ఇతరులూ చేస్తే సామాన్యుల పరిస్ధితేంటి ?

చిత్రమైన పద్ధతుల్లో చంద్రబాబు స్కాంలు

స్కిల్ స్కాంలో ఈడీ హెచ్చరికలూ బేఖాతరు

ఈడీకీ సీఐడీ ఆధారాలు లేవని చెప్తుందా ?

ప్రభుత్వాలు మారితే వాస్తవాలు మారతాయా?

ప్రెస్ మీట్ లో నిలదీసిన కన్నబాబు.

కాకినాడ: అధికారం అండగా చేసుకుని సీఎం చంద్రబాబు తనమీద కేసుల్ని తారుమారు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బెయిల్ పై ఉన్న కేసుల్ని చంద్రబాబు తీయించుకుంటే.. దానికి  సీఐడీ ఓ టూల్ గా ఎలా పనిచేస్తోందని  ప్రశ్నించారు. అసలు ఈ కొత్త ప్రక్రియలు, విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్ధలో సరైనవేనా అని నిలదీశారు. ఆరోజు సీఐడీ అధికారులు ఆధారాలతో సహా చంద్రబాబును నిందితుడిగా నిలబెట్టి, దుర్మార్గమైన అవినీతి అని కేసు పెట్టి, అరెస్టు చేస్తే.. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు.  కేసుల్ని  తారుమారు చేస్తూ మూసేయడాన్ని తప్పు పట్టారు. ఇప్పటికీ చంద్రబాబు బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఆ కేసు మూసేసేందుకు సీఐడీ ఎలా ముందుకు కదులుతోందని కన్నబాబు ప్రశ్నించారు. ప్రెస్ మీట్ లో ఆయన  ఇంకా ఏమన్నారంటే..

● చంద్రబాబులా ఇతరులూ చేస్తే సామాన్యుల పరిస్ధితేంటి ?

నిజంగా కేసుల్లో తప్పుంటే కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందాలే కానీ ఇలా అడ్డదారుల్ని చంద్రబాబు ఎంచుకోకూడదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎండీ అజయ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎండీగా పనిచేసిన బంగార్రాజును బెదిరించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పించి తీయించుకుంటున్నారు. ఇప్పటికే అధికారుల్ని బెదిరించి చంద్రబాబుపై కేసుల్ని తీయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విధానం దేశంలో ఇతర ప్రజా ప్రతినిధులు, అత్యున్నత స్ధాయిలో ఉన్న నాయకులూ అమలు చేస్తే సామాన్యుల పరిస్ధితేంటి, చట్టాల పరిస్దితేంటి అని అడుగుతున్నాం. 

● చిత్రమైన పద్ధతుల్లో చంద్రబాబు స్కాంలు

చంద్రబాబు హయాంలో జరిగిన స్కాంలలో చిత్రమైన పద్ధతుల్ని అవలంభిస్తారు. అయినా ఈ స్కాంలలో షెల్ కంపెనీలు సహా అన్ని ఆధారాలు దొరికాయి. ఇప్పుడు అధికారుల్ని బెదిరించి కొత్త సాక్ష్యాలు, వాంగ్మూలాల నమోదుతో నీరుగారుస్తున్నారు. అప్పట్లో జీఎస్టీ ఈడీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి, ఆస్తుల జప్తు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు ఈ అధికారులు ఆధారాలు లేవని చెప్తారా?, ఇదేమీ చిన్న కేసు కాదు. చాలా నేర్పరితనంతో చేసిన స్కాం ఇది. ఏపీ ఫైబర్ నెట్ లోనూ 300 కోట్లకు పైగా కొట్టేశారు. లిక్కర్ స్కాం ప్రివిలేజ్ ఫీజు కింద రూ.5200 కోట్ల స్కాం జరిగింది. ఇవన్నీ చూసి చివరికి ఎన్ని చేసినా దొరకని ఈ ప్రభుత్వ పెద్దలు స్కిల్ స్కాంలో మాత్రం దొరికారు. ఇది పాతాళభైరవిలా, అలీబాబా దొంగల స్కాంలా కనిపిస్తుంది.

● స్కిల్ స్కాంలో జరిగిందిదీ..

అప్పట్లో చంద్రబాబు జూన్ లో అధికారంలోకి వచ్చి ప్రమాణస్వీకారం చేస్తే రెండు నెలలకు ఆయన వద్దకు ఓ ప్రతిపాదన వచ్చింది. సీమెన్స్ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కర్ అనే వ్యక్తులకు ఇల్లెందుల రమేశ్ అనే తెలంగాణ వ్యక్తి చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పించాడు. అక్కడ వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  రూ. 3356 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా సీమెన్స్ ఇస్తుంది, 10 శాతం ప్రభుత్వం ఇస్తే చాలని చెప్పారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇలా ఇచ్చేవాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రభుత్వం ఆహ్వానించాలి. అలా చేయకుండా వీళ్లు ఇచ్చిన ప్రాజెక్టు వ్యయాన్ని డీపీఆర్ గా పరిగణించి, ఇంకెవరినీ పిలవకుండా నేరుగా వాళ్లకు కేటాయించారు. ఇందులో అవినీతి లేకపోతే 10 శాతం మేం పెడతాం కాబట్టి, మిగతా 90  శాతం ఎలా ఇస్తారని అడగాలి. కానీ ఏమీ అడక్కుండా ఓకే చేశారు. ముందూ వెనుకా చూడకుండా రూ. 371 కోట్లు చంద్రబాబు రిలీజ్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. ఈ  రూ.371 కోట్లలో రూ. 56 కోట్లు పెట్టి సాఫ్ట్ వేర్ కొని, మిగిలిన రూ. 331 కోట్లు మింగేశారు. దీనిపై 2018 లో పూణే నుంచి ఒక వ్యక్తి స్కిల్ డెవల్మెంట్ లో స్కాం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. అయినా దాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతే కాదు ఇందులో భాగమైన సీమెన్స్, డిజిటెక్ కంపెనీలు ఈ మొత్తాన్ని షెల్ కంపెనీలకు బదిలీ చేశాయి. అక్కడితో ఆగకుండా తాము కట్టిన జీఎస్టీ మొత్తం వెనక్కి ఇప్పించాలని పిటిషన్ వేశాయి. దీంతో ఈడీకి అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈడీ అధికారులు షాకయ్యారు. దర్యాప్తు జరిపి చంద్రబాబు అధికారం కోల్పోయే ముందు ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు.  

● ఈడీ హెచ్చరించినా పట్టించుకోలేదు

ఇందులో 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న మరో రూ.67 కోట్లు, మార్చి 31న రూ.34.25 కోట్లు ఇలా మొత్తం 371 కోట్లు ఐదు దఫాలుగా సీమెన్స్, డిజిటెక్ నుంచి డబ్బులు విడుదల చేయించారు. వీళ్లు సృష్టించిన కంపెనీలు డొల్ల అని ఈడీ రాసినా పట్టించుకోలేదంటే మీరు ఈ స్కాంలో భాగస్వాములనేగా ?, ఇలా విడుదలైన డబ్బు పీపీఎస్పీ స్కిల్కర్, ఏసీఐ అనే రెండు కంపెనీలకు బదిలీ చేశారు. ఇందులో స్కిల్కర్ కు రూ.238.29 కోట్లు, ఏసీఐ షెల్ కంపెనీకి రూ.58 కోట్లు బదిలీ చేశారు. ఏసీఐ, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ప్యాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్ వెబ్, పోలారిస్, కెడెన్ ఇలా షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు బదిలీ చేశారు. ఇది జరుగుతుండగానే సుమన్ బోస్, వికాస్  ఖాన్విల్కర్ ఈమెయిల్స్ ను ఈడీ పరిశీలిస్తుంటే వారు డిలీట్ చేసేశారు. అప్పుడు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరు వాడారు కానీ డబ్బులు వాళ్లకు రాలేదని తెలిసింది. సీమెన్స్ పరిశీలిస్తే హైదరాబాద్ కు రెండు టికెట్లు పంపినట్లు గుర్తించారు. అప్పుడు చంద్రబాబు పీఏ దగ్గరికి వచ్చింది. అలాగే టీడీపీ ఆఫీసు అకౌంట్లోకి డబ్బులు వెళ్లినట్లు ఈడీ, సీఐడీ తేల్చారు. అలాగే వీటి సూత్రధారి చంద్రబాబే అని తెలియడంతో సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు రిమాండ్ ఇచ్చింది. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు వెళ్లడం, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వడం జరిగాయి.

● ప్రభుత్వాలు మారితే వాస్తవాలు మారతాయా?

నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరుదాటి వచ్చేస్తుందనే సామెత చందంగా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది కాబట్టి ఏ తప్పూ చేయలేదనే ప్రచారం జరిగి ఆయన అధికారంలోకి కూడా వచ్చేశారు. చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఈ కేసు వెనక్కి తీసుకునేందుకు కుట్ర చేశారు. ప్రభుత్వం మారితే వాస్తవాలు అవాస్తవాలు అయిపోతాయా? ఇవాళ మాకున్న సమాచారం మేరకు ఇప్పుడున్న సీఐడీ డైరెక్షన్ చేస్తున్నా, మూలకథ, చంద్రబాబును నడిపించే లాయర్ ఒకరు ఉన్నారు.  ఇవాళ పోలీసులు, న్యాయశాఖలో అధికారులు ఆయన చెప్పుచేతల్లోనే ఉన్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు తనకు క్లీన్ చిట్లు ఇచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ శాఖలనే కాదు ప్రభుత్వ ధనాన్నికూడా వాడుతున్నారని అర్థమవుతోంది. 

● ఈడీకీ సీఐడీ ఇదే చెప్తుందా ?

గతంలో తునిలో రైలు తగులపెట్టిన కేసు  రైల్వే కోర్టు కొట్టేస్తే చంద్రబాబు ప్రభుత్వంలో దాన్ని తిరగతోడేందుకు ఇప్పుడు జీవో ఇచ్చారు. ఓవైపు మీ కేసులు కొట్టేసుకుంటూ, తుని కేసును రీఓపెన్ చేయిస్తున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ను ఎవరు సృష్టించారు. రాజకీయంగా పట్టు ఉంది కాబట్టి, కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి కేసులు తీయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీకున్న మీడియా పవర్ తో చేస్తున్న దుర్మార్గమైన పద్ధతులు తప్ప ఇందులో ఏమైనా ఉందా ?, మంచి ప్రభుత్వం అంటున్న వారు నిజాయితీగా నిలబడి కోర్టులో ఫైట్ చేయాలి. లేకపోతే కేసును లోతైన దర్యాప్తు చేసి మీ తప్పు లేదని నిరూపించుకోవాలి. మీ చర్యల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ సంకేతం ఇస్తున్నారో ప్రజలు అర్దం చేసుకుంటున్నారని కన్నబాబు స్పష్టం చేశారు. సీఐడీ సాయంతో కేసులు కొట్టించేసుకున్నా... ఇదే విషయం పై ఈడీకి ఏం సమాధానం చెప్తారని కన్నబాబు నిలదీశారు.

Back to Top