అధికారం అండతో చంద్రబాబు దుర్మార్గ పాలన

కేసులు పెట్టిన అధికారులతోనే రద్దు చేయిస్తారా ?

స్కిల్ స్కాంలో సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా బరితెగింపు

చంద్రబాబుతో పాటు సహకరించిన అధికారులను కోర్టుకీడుస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హెచ్చరిక 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 

 రాజ్యాంగ పాలనకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబు

 సిట్, పోలీసుల సాయంతో కేసులన్నీ మాఫీ

 సిట్ సేకరించిన అధారాలు వెనక్కి తీసుకుంటుందా ?

 సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ పై కౌంటర్ వేయలేదా ?

 చంద్రబాబు విచారణ తర్వాత నిర్దోషి కాలేదు

 కేసుల మాఫీలపై సుప్రీంకోర్టులో వైసీపీ పోరాటం

 ప్రెస్ మీట్ లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్ : రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన, నియంతను మించిన పాలన జరుగుతోందని, సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కొట్టేయించుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఇంగ్లీష్ న్యాయ నిపుణుడు విలియం బ్లాక్ స్టోన్ చెప్పినట్లు.. నియంత దేవుడి చేత  అధిష్టింపబడ్డాడని, ఎవరికీ జవాబుదారీ కాదని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారని అన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కాంలు, స్కీంలు గత ప్రభుత్వంలో కానీ, అంతకు ముందు కానీ ఎప్పుడూ జరగలేదని, వేల కోట్ల రూపాయల స్కాంలు బయటపడ్డాయని,  వీటిని మంచి ముహుర్తం చూసి కోర్టుల్లో మూయించేసుకుంటున్నారని పొన్నవోలు తెలిపారు. ప్రెస్ మీట్ లో పొన్నవోలు ఇంకా ఏమన్నారంటే..

● కేసులు పెట్టిన సిట్ తోనే వాటిని మూయిస్తున్నారు

ఏ పోలీసులు, సిట్ అధికారులు, సీఐడీ వారు అయితే ఈ కేసుల్ని పెట్టారో వారే ఇప్పుడు చంద్రబాబుపై ఏ కేసూ లేదు, ఆయన పునీతుడు, మంత్ర జలాలు చల్లుకున్నాడని ధృవీకరించే పరిస్ధితి ఉంది. చంద్రబాబు తనపై ప్రతీ కేసును కోర్టులో కొట్టేయించుకుంటున్నాడనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా 21.30 కోట్ల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుస్కాం, వందల కోట్ల అసైన్డ్ భూముల స్కాం, వేలకోట్లు ప్రభుత్వానికి నష్టం కలిగించిన మద్యం స్కాం కేసుల్ని ఉపసంహరించుకుంటున్నారు. ఈ కేసుల్ని పెట్టిన సిట్ తోనే చంద్రబాబు వాటిని వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించే వాళ్లు కూడా లేకుండా పోతే రాష్ట్రంలో  రాజ్యాంగం అమలవుతుందా లేదా అనిపిస్తోంది. 

● నవ్విపోదురు గాక అన్నట్లు సిట్ తీరు...

స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు 150 మంది సాక్షుల్ని విచారించిన సిట్, 18 మంది అధికారుల వాంగ్మూలం మెజిస్ట్రేట్ దగ్గర రికార్డు చేసిన సిట్.. 371 కోట్లు ఆంధ్రరాష్ట్ర ఖజానా నుంచి దాచుకున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ ఒక్క కేసులోనే 371 కోట్లు స్కాం చేసి దారి మళ్లించి రకరకాల వ్యక్తుల ద్వారా అంతిమ లబ్దిదారుకు చేర్చారు. చంద్రబాబు ఇదే కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. ఈ కేసులో చాలా సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టులో సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదా ?, చంద్రబాబును రిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే సిట్ అధికారులు ఆయనపై పెట్టిన అభియోగాలు రుజువు చేయలేదా ? కానీ ఇవాళ నవ్విపోదురు గాక అన్నట్లుగా సిట్ తాము సేకరించిన సాక్ష్యాల్ని పక్కనబెట్టి సాక్ష్యాలే లేవని చెప్తుంటే న్యాయవ్యవస్థ కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. 

● చంద్రబాబు కేసుల మాఫీపై సుప్రీంను ఆశ్రయిస్తాం

ఇది గ్రామాల్లో పిల్లలాడుకునా దొంగాపోలీసు ఆటలా ఉంది. చంద్రబాబు కేసుల్లో ఆయనే దర్యాప్తు అధికారి, న్యాయవ్యవస్థ, న్యాయనిర్ణేత, అలాగే దొంగగా కూడా మారారు. ఇలా అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేస్తుంటే న్యాయవ్యవస్థ చూడట్లేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నాం. ఈ ఆటలు అయితే సాగనివ్వం. ఇవాళ ఏదో నిర్ణయం వచ్చిందని సంతోష పడకండి. న్యాయస్థానాల్లో మీ ఆటలు కట్టిస్తాం.  సిట్ అధికారుల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీరు సేకరించిన, డిజిటల్ గా, మ్యాన్యువల్ గా భద్రపరిచిన సాక్ష్యాలు ఏమై పోయాయి, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 150 మంది విచారించిన సాక్షులు ఏమై పోయారు ? 18 మంది అధికారులు గౌరవ మెజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైంది ?, మద్యం, ఇసుక కేసుల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 53 రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నారు. అప్పుడు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా జైలుకు పంపారు, గౌరవ హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది కదా, సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కదా. మీ అధికారుల సాయంతో కేసుల్ని ఉపసంహరించుకుంటారా ? 

● అధికారులను కోర్టు ముందు నిలబెడతాం

చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా ఏదో ఒక రోజు కోర్టు ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది గుర్తుంచుకోండి, మిమ్మల్ని కూడా కచ్చితంగా ప్రశ్నిస్తాం, కోర్టు ముందు దోషులుగా నిలబెడతాం. ఈ దేశంలో ఓ రూల్ ఆఫ్ లా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క నెల రోజుల్లో  కేసులన్నీ కొట్టేయించుకుని, పోలీసులు, సీఐడీతో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రిఫర్ ఛార్జిషీట్ పైల్ చేయించి కేసులు కొట్టేస్తే అంతటితో ఇది ఆగదు, కచ్చితంగా మీపై ఉన్నత న్యాయస్దానాలకు వెళ్తాం. సాక్ష్యాలు ఉన్న కేసుల్లోనూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ రాశారంటే మీరు కూడా కచ్చితంగా తప్పు చేస్తున్నట్లే. ఒకరోజు కోర్టు ముందు మీ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరే సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలు పక్కనబెట్టి చంద్రబాబు పునీతుడని చెప్పడం గర్హనీయమైన చర్య. వైయ‌స్ఆర్‌సీపీ కచ్చితంగా వీటిని అడ్డుకుంటుంది. అధికారంలో ఉన్న వారు ఇలా తమ కేసుల్ని కొట్టేయించుకుంటే ఇక సామాన్యుడి పరిస్దితేంటి ? 

● ఈ దేశంలో రాజూ, పేదకూ ఒకటే న్యాయం

మీ అవినీతి చిట్టా విప్పితే ఇన్నర్ రింగ్ రోడ్డులో 21.30 కోట్లు స్కాం ఉందా లేదా?, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా ? ఈ కేసులో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కూడా జోక్యం చేసుకుని పలువురు ముద్దాయిల్ని జైలుకు పంపింది. సుప్రీంకోర్టు వద్ద కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. చంద్రబాబుపై సీఐడీ సిట్ వేసిన కౌంటర్ కూడా సుప్రీంకోర్టులో ఉండగా... సాక్ష్యాలు లేవని కేసులు కొట్టేయించుకోవడం దుర్మార్గమైన చర్య. ఇందుకు కారణమైన మీరు, వారికి సహకరించిన ఉద్యోగుల్ని కూడా కోర్టు ముందు దోషులుగా నిలబెడతాం.  కింగ్ కెన్ డూ నో రాంగ్ అనేది చంద్రబాబుకు వర్తించదు, మీరు నియంత కాదు, దేవుడి చేత నియమించిన రాజు కాదు. అది బ్రిటిష్ కామన్ లా లో నిబంధన మాత్రమే. ఈ దేశంలో పేద తప్పుచేసినా, రాజు తప్పుచేసినా రాజ్యాంగం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. మీకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలు, ప్రివిలేజ్ లు ఇవ్వలేదు. ఇక్కడ రాజూ, పేద కు ఒకటే న్యాయం. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ షరతుల్లో సాక్ష్యుల్ని ప్రభావితం చేయకూడదని ఉంది. దాన్ని ఉల్లంఘించినందుకు మీ బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది.

Back to Top