ఉగాది పర్వదినం వేళ కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 10 వేల పోస్టులతో సరిపెట్టడం నిరుద్యోగులను వంచించడమేనని మండిపడ్డారు. కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... యువగళం డిక్లరేషన్ పేరుతో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారని,ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని నిలదీశారు. 22 నెలల పాలనలో 1.72 లక్షల మంది ఉద్యోగులను తొలగించి, ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదమన్న కన్నబాబు... ఇది జాబ్ క్యాలెండర్ కాదు.. 'దగా క్యాలెండర్' అని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ హయాంలో కేవలం 6 నెలల్లోనే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, ఐదేళ్లలో మొత్తం 6.31 లక్షల ఉద్యోగ నియామకాలు చేపడితే... చంద్రబాబు ప్రభుత్వం రాగానే 2.66 లక్షల మంది వాలంటీర్లను, వేలాది మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రోడ్డున పడేసిందని ఆక్షేపించారు. 2024 మార్చిలో 11.79 లక్షలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య.. 2025 డిసెంబర్ నాటికి 10.07 లక్షలకు పడిపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఒక్కరికీ లబ్ది చేకూర్చకుండానే .. ఆడబిడ్డ నిధిని పీ -4కు, నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్‌మెంట్‌కు టై అప్ చేసి అమలు చేశామని చెప్పుకుంటూ.. ఇంకా సూపర్ 6 అమలు కాలేదని విమర్శించే వారి నాలుక మందమని మాట్లాడటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - జాబ్ కాలెండర్ పేరుతో పచ్చి మోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ప్రజల ఆశలను కూడా కూటమి పాలకులు వమ్ము చేసారు. చెప్పిన మాట ఆచరించడం చంద్రబాబు చరిత్రలో లేదు. 2024 లో అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్... అప్పటి వైయస్.జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, ఉద్యోగ కల్పన చేయడం లేదన్నట్టు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే.. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు యువగళం డిక్లరేషన్ పేరుతో భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఆ రకంగా ప్రచారం చేసి ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ లో జాబ్ కేలండర్ ఊసే లేకుండా పోయింది. ప్రతి ఏటా జనవరి 1న ఇస్తామని చెప్పినవాళ్లు అసలు ఉద్యోగ కల్పన అనే అంశాన్నే పూర్తిగా మర్చిపోయారు. పెట్టుబడులు తెస్తున్నాం, ఉద్యోగాలు కల్పనలో మమ్నల్ని మించిన వారు లేరని వాళ్ల భుజాలు వాళ్లే చరుచుకోవడం అలవాటుగా మారింది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు గట్టిగా నిలదీయడంతో పాటు నిరుద్యోగులు గట్టిగా నినదించడంతో 2025 జనవరిలో జాబ్ కాలెండర్ ఇస్తామని ప్రచారం చేశారు, కానీ ఇవ్వలేదు. మరలా 2026లో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు పెరగడంతో చివరకు ఉగాది నాడు సుమారు 10వేల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఈ జాబ్ కేలండర్ ప్రకటన కూడా నిరుద్యోగులను పచ్చి దగా చేయడమే. మీరు చెప్పిన ప్రకారం ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలివ్వాలి. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దానితో పోల్చి చూస్తే మీరు ప్రకటించిన 10వేల ఉద్యోగాలు నామమాత్రమే. ఇప్పటికీ ఉగాది సభలో వైయస్.జగన్ నే విమర్శిస్తూ... ఆడిపోసుకుంటూ పండగపూట కూడా పాత పాటే పాడుతున్నారు. రూ.2.70 లక్షల కోట్లుకు పైగా పేదలకు అందించి వైయస్.జగన్ చరిత్ర సృష్టించి పండగనాడు పేదలకు ఇబ్బంది పడకుండా చూశారు. కానీ చంద్రబాబుకి మాత్రం వాళ్లింట్లో జరిగితేనే పండగ... పేదవాడి పండగతో సంబంధం లేదు. ఆయనకి అధికారం ఉంటేనే పండగ ఉన్నట్లు వైయస్.జగన్ ని విమర్శిస్తున్నాడు. - లక్షల్లో తొలగింపు - వేలల్లో నియామక ప్రకటనలు.. జాబ్ క్యాలెండర్ పేరుతో 10 వేల ఉద్యోగాలు ప్రకటించిన ప్రభుత్వం దాన్ని వాటిని కూడా 4 దఫాలుగా అక్టోబరు వరకు 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వీళ్ల ఉద్యోగ కల్పన చూస్తే... అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య 1.72 లక్షలు. తగ్గిన ఉద్యోగాలతో పోల్చితే మీరు ఇస్తున్న 10వేల ఉద్యోగాలు ఏ మూలకూ సరిపోతాయి. వైయస్.జగన్ హాయంలో 2024 మార్చి నాటికి రాష్ట్రంలో 11.79 లక్షల ఉద్యోగులు ఉంటే.. చంద్రబాబు పాలనలో 2025 డిసెంబరు నాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలకు పడిపోయింది. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్దికశాఖ విడుదల చేసిన ద్రవ్యవిధానపత్రం ద్వారా తేలిన లెక్కలు. అంటే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.72 లక్షల ఉద్యోగాలు ఎగరగొట్టారు. ఇంటి వద్దకే ప్రజా పాలన, పౌరసేవలను అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ హాయంలో 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమిస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాళ్లందరి ఉద్యోగాలను తొలగించాడు. ఇవి కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించారు. వైయస్.జగన్ హయాంలో 96,675 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే... గత డిసెంబరు నాటికి 87,681 మందికి చేరింది. అంటే బాబు హయాంలో 9 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించారు. ఇవి కాకుండా జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు, మున్సిపాల్టీలలో, ఫీల్డి అసిస్టెంట్స్ వరకు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ ఉద్యోగులను తొలగించారు. ఈ విధంగా లక్షల్లో ఉద్యోగులను తొలగించి.. వేలల్లో నోటిఫికేషన్ జారీ చేసి పండగ చేసుకోమనడం అత్యంత దుర్మార్గం. - నోటిఫికేషన్ల జారీ లోనూ మోసమే... 2025-26లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన రెండు రిక్రూట్ మెంట్లు, ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్ల నియామకాలు రెండూ వైయస్.జగన్ హాయంలో శ్రీకారం చుట్టినవే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్లు నిలిపివేసి.. వాటిలో మార్పులు చేశామని చెప్పి.. రీ నోటిఫికేషన్ చేసి ఆ పోస్టులు తామే తీసామని చంద్రబాబు ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది. మరోవైపు 2.66 లక్షల మంది వాలంటీర్లు, ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేస్తున్న10 వేల మంది సిబ్బందిని, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఏపీ ఎండీసీలో నియమించిన సిబ్బందితో సహా వైయస్.జగన్ హాయంలో నియమించి వారితో పాటు గతంలో నుంచి పనిచేస్తున్న వారిని కూడా కక్షపూరితంగా తొలగించారు. ఇవాళ వాళ్లందరూ కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. బ్రతుకు తెరువు లేని పరిస్థితి. రాష్ట్రంలోని వివిధ సంఘాలు, విద్యావంతుల అంచనా ప్రకారం సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం చదువుతున్నారు. ఇప్పుడు కేవలం 750 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. ఇటీవల డీజీపీ మాట్లాడుతూ 11 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం 2778 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహిళా శిశుసంక్షేమం కింద 243 పోస్టులకు ఆర్దిక శాఖ అనుమతిచ్చినా ఇప్పటి వరకు ఆ పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. - ఉద్యోగ కల్పనలో వీక్ - ప్రచారంలో మాత్రం ఫీక్... గతంలో లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు రెండు వేల వరకు ఖాలీలు ఉన్నాయని చెప్పారు. వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టులు 20వేలు, ఉపాధ్యాయులు 25 వేలు ఖాలీలున్నాయని.. మీరే చెప్పి ఇవాళ ఈ ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇప్పటికే మీ జాబ్ క్యాలెండర్ హామీకి 2 సంవత్సరాలు మంగళం పాడారు. ఇది మూడో సంవత్సరం ఇప్పుడు 10వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా రెండేళ్లు మరో రెండు నోటిఫికేషన్లు కలుపుకుంటే మీరు గట్టిగా 30 వేల కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదు. కానీ దీనికి మీరు చేసే ప్రచారం, మిమ్మల్ని మోస్తున్న ఎల్లో మీడియా బిల్డప్ చూస్తుంటే దేశంలోనే అత్యధిక ఉద్యోగాలిచ్చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ పైబర్ నెట్ లోనే 2వేల మంది ఉద్యోగాలను తొలగించారు. అంతే కాకుండా దశాబ్దాల గా ఉన్న ఉపాధి హామీ పథకం లో ... 2360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్ధాక్షణ్యంగా తొలగించారు. బెదిరించి, బలవంతం చేసి, కొన్ని చోట్ల వేధింపులకు ఆత్మహత్య చేసుకుంటే.. వారి స్ధానంలో మీకు కావాల్సిన వారిని నియమించుకుంటున్నారు. ఇంటికే రేషన్ అందించే కార్యక్రమంలో భాగంగా 9260 మంది ని మొబైల్ డిస్పెన్షరీ యూనిట్స్ ని ఏర్పాటు చేస్తే.. వారందరినీ తొలగించి వారికీ మంగళం పాడారు. ఇప్పుడు మీరిచ్చే 5-10 కేజీల బియ్యం కోసం సంచులు పట్టుకుని, పనులు మానుకుని లైన్లలో నిలబెడుతున్నారు. వైయస్.జగన్ హాయంలో ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని అడ్డమైన పనులకీ వినియోగిస్తున్నారు. - చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు శాపం... మరోవైపు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులకు మొత్తం జీతాలు అందకుండా మధ్యలో దళారులు తింటున్నారని.. వైయస్.జగన్ హయాంలో ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే నేరుగా వారికి జీతాలిచ్చే కార్యక్రమం చేస్తే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేశారు. దళారీ వ్యవస్థను తీసివేస్తూ.. వైయస్.జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే... మరలా దళారులకు మేలు జరిగేలా ఆప్కాస్ ని రద్దు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు శాపం. - వైయస్.జగన్ హయాంలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలు... వైయస్.జగన్ హయాంలో 2019-24 మధ్య 6,31,310 ఉద్యోగాలను కల్పించారు. 2019లో అధికారంలోకివచ్చిన 6 నెలల్లోనే 1.34 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా సింగిల్ నోటిఫికేషన్లో చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ నియామకాలు చేపట్టారు. 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను గతంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టిన చరిత్ర లేదు. ఒక్క తప్పిదం లేకుండా, అత్యంత పారదర్శకంగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నియమించిన వైయస్.జగన్ గొప్పా? అధికారం చేపట్టి మూడేళ్లు గడిచిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు గొప్పా? ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. - ఆర్టీసీ ప్రభుత్వ విలీనం - చరిత్రలో గొప్ప నిర్ణయం ఆర్జీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఎవరైనా తీసుకున్నారా? అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 58 వేల మంది ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘతన వైయస్.జగన్ కే దక్కుతుంది. ఆప్కాస్ ద్వారానే 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఇవి కాకుండా బోధానాసుపత్రుల్లో, పీహెచ్ సీలు, సీహెస్ సీలతో పాటు కోవిడ్ కోసం ప్రత్యేక నియమాకాలు చేపట్టి... వైద్య ఆరోగ్య రంగంలో భారీ నియమకాలు చేపట్టిన చరిత్ర కూడా వైయస్.జగన్ కే దక్కుతుంది. పవిత్రమైన చట్ట సభలో కూడా చంద్రబాబు ప్రభుత్వం నిజాలు చెప్పడం లేదు. - ఉద్యోగ కల్పనపైనా బాబు పచ్చి అబద్దాలు... కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు కావస్తోంది. సీఎం చంద్రబాబు శాసనసభ సాక్షిగా 6,28,320 మంది ప్రభుత్వ ఉద్యోగులని చెప్పారు. అదే ప్రభుత్వం శాసనమండలిలో మాత్రం 5,72,380 మంది అని చెప్పారు. ఏ లెక్క కరెక్టె? ఉదయం లేచి చూస్తే మీ అనుకూల పత్రికల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతారు. జనవరి 26న ఎన్టీటీవీకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 18 నెలల కాలంలో దాదాపు రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాను. ఆ మొత్తం 23 లక్షల ఉద్యోగాలు తెచ్చిందని మాట్లాడుతున్నారు. ఉన్న ఉద్యోగాలనే మీ హాయంలో తొలగించి, నిర్మాణ రంగం కుదేలైతే, దినసరి కూలీకి వెళ్లే భవన నిర్మాణ కార్మికులకూ పనిలేకుండా పోతే.. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పుకుంటారు బాబూ? - 2024 ఉగాది సాక్షిగా వాలంటీర్లకు దగా... 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు.. ఉగాది సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ ఉగాది పండగ సందర్భంగా వాలంటీర్లకు తీపి కబురు చెబుతున్నాను.ఉగాది పూజ చేసిన తర్వాత ఈ విషయం మాట్లాడుతున్నాను. మీలో ఏ ఒక్కరినీ తీసేయబోము. మీకు ఇప్పుడిస్తున్న దానికంటే ఇంకా బాగా మెరుగ్గా, రూ.5వేల నుంచి రూ.10 వేలు పెంచి గౌరవ వేతనం ఇస్తాం. మా కూటమి ఈ హామీ ఇస్తుందని 2024 ఉగాదిలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించాడు? ఎవడిచ్చాడు జీవో, ఉంటే చూపించండి అని అడుగుతారు. వాలంటీర్ల వల్లే 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యాయని ఈ కూటమి నేతలే మాట్లాడతారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఏకంగా ఒక వ్యవస్థనే గాలికి వదిలేశారు. - సూపర్ 6 సూపర్ 7 పేరుతో పచ్చి మోసం... సూపర్ 6, సూపర్ 7 ఎక్కడా చంద్రబాబు అని అడిగితే... ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ-4 కు టై అఫ్ చేశామని, నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్ మెంట్ కి టై అప్ చేశాం కాబట్టి ఇచ్చినట్టు భావించండి అని చెబుతున్నాడు. ఒకవేళ ఇచ్చినట్లు ఎవరైనా భావించకపోతే వారి నాలుక మందం అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. రాష్ట్రంలో 18-59 ఏళ్ల మధ్యలో ఉన్న స్త్రీమూర్తులకు ఎవరికైనా ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అందుతుందా? రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగుల్లో ఒక్కరికైనా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగభృతి ఇచ్చారా? ఈ రెండూ సూపర్ సిక్స్ హామీలే కదా? ఈ రెండింటిలో ఒక్క పథకాన్నైనా అమలు చేశారా? ఇది మోసం కాదా? - ఐదేళ్ల వైయస్.జగన్ హయాంలో 40 లక్షల ఉద్యోగాలు.. 2019లో హామీ ఇవ్వకపోయినా వైయస్.జగన్ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలును, వాలంటీర్లను నియమించారు. ఇవి కాకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ లెక్కిస్తే... వైయస్.జగన్ హయాంలో 6,31,310 ఉద్యోగ నియమకాలు చేపట్టారు. 2023-24 సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ సెక్టార్ లో 1.02 లక్షల ఉద్యోగాలిచ్చాం. ఎం ఎస్ ఎం ఈ సెక్టార్ లో 32,79,970 ఉద్యోగాలు కలుపుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 40 లక్షల ఉద్యోగాలిచ్చినట్లు ఆధార్ నెంబర్లతో సహా చెబుతాం. ఆర్టీఐ ప్రకారం తీసుకున్న మరో సమాచారం చూస్తే.. 2014-19 మధ్య రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ, అతి భారీ పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.50,708 కోట్లు మాత్రమే రాగా.. వాటి ద్వారా 84,333 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇది వైయస్సార్సీపీ హాయంలో వైయస్.జగన్ పాలనా కాలంతో పోల్చి చూస్తే... 2019-24 మధ్య కాలంలో రూ.69,799 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటైతే రెండేళ్ల పాటు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా... వాటి ద్వారా 90,230 ఉద్యోగాల కల్పన జరిగింది. అంటే వైయస్.జగన్ చేసిన అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పెట్టుబడులు నిజాలు.. గడప దాటేలోగా చంద్రబాబు చేసిన అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేశాయి. చివరకు రైతుల పాసుపుస్తకాల మీద ఫోటో వస్తే.. మీ భూముల లాక్కుంటారన్నంత దుర్మార్గ ప్రచారానికి కూడా తెరతీశారు. - ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన సీఎం చంద్రబాబు... దేశంలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరంటే చంద్రబాబు పేరు, దేశంలోనే మొదటి పది అత్యధిక సంపద ఉన్న మంత్రుల్లో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మరో మంత్రి నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. మీరు పదే పదే సంపద సృష్టిస్తామని చెబుతున్న మాటలకు అర్ధం మీ సంపదా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. - గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు.. శెనగ రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. మార్కె ఫెడ్ అరకొరగా కొనుగోలు చేస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. పంట దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీ ప్లాంటులు అందుబాటులో లేని పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయ రంగం గురించి కనీసం సమీక్ష చేసి పరిస్థితిని అదుపు చేసే నాధుడే లేడు. గుంటూరు, పల్నాడు ప్రాంతంలో గతేడాది పొగాకు ధరలు పడిపోయాయి. హెడ్ డీ బర్లీ పొగాకు సాగు నిషేధించారు. దీంతో రైతులు శెనగ పంట వేస్తే.. సాధారణ విస్తీర్ణం 8 లక్షలు కాగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కనీసం రైతులకు బోనస్ లేదు, మార్కెట్ జోక్యం లేదు. అదే వైయస్.జగన్ పాలనలో గత ప్రభుత్వ కాలంలో నష్టపోయిన రైతులకు రూ.100 కోట్ల వరకు పరిహారం చెల్లించిన మాట వాస్తవం కాదా? మీ హయాంలో మీరు పండించే రైతుని, వినియోగదారుడిని ఇద్దరికీ గాలికి వదిలేశారు. మీ పచ్చ పత్రికల్లోనే కేవలం 15 రోజుల్లోనే కేజీకి వంటనూనెలు రూ.40 వరకు సరాసరి పెరిగిందని వార్త వస్తే... దీనికీ యుద్ధానికి లింకు పెడుతున్నారు. గల్ఫ్ లో జరుగుతున్న పరిణామాలకు, వంట నూనెలకు ఏమిటి సంబంధం? అంటే వినియోగదారులనీ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రజావ్యతిరేక విధానాన్ని బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా... వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఉద్యమబాట పడతామని కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.