ప్రైవేటీక‌ర‌ణ వద్ద‌న్నందుకు ప్ర‌జ‌ల‌పై చంద్రబాబు క‌క్ష‌

కోటి సంత‌కాలు చేసిన ప్ర‌జాభిప్రాయాన్ని లెక్క చేయ‌డం లేదు 

క‌మీష‌న్ల కోసం ఎంత‌కైనా దిగ‌జారడానికి ఆయ‌న సిద్ధం 

చంద్ర‌బాబు తీరుపై మండిప‌డిన మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌ రెడ్డి 

నెల్లూరు లోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ 
మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి 

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గుర్తించి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావ‌డం లేదు

కానీ చంద్రబాబు మాత్రం మూర్ఖంగా ముందుకెళ్తున్నాడు

వ‌యొబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామంటూ స‌రికొత్త ఆఫ‌ర్లు

క‌మీష‌న్ల కోసం ప్ర‌జా సంద‌ప‌ను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర  

ప్ర‌జాభిప్రాయాల‌ను ధిక్క‌రిస్తే మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌దు

ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా హెచ్చ‌రించిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి  

నెల్లూరు:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కోటి సంత‌కాలు చేసిన ప్ర‌జ‌ల‌పై సీఎం చంద్ర‌బాబు క‌క్ష పెంచుకున్నాడ‌ని, అందుకే ప్ర‌జాభిప్రాయాన్ని కూడా లెక్క చేయ‌కుండా త‌న కుట్ర‌ల‌కు మ‌రింత ప‌దును పెడుతున్నాడ‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీఅధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. నెల్లూరు లోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ నిర్వ‌హించిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మంలో ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పాల్గొని త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌డంతో ప్రైవేట్ సంస్థ‌లు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గుర్తించి ముందుకురావ‌డం లేద‌ని వివ‌రించారు. ఇప్ప‌టికైనా ప్రైవేటీక‌ర‌ణ‌పై వెన‌క్కి తగ్గాల్సిందిపోయి మెడిక‌ల్ కాలేజీల‌ను ద‌క్కించుకున్న ప్రైవేట్ సంస్థ‌లకు వ‌యొబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తాన‌ని స‌రికొత్త ఆఫర్లు ప్ర‌క‌టిస్తూ ప్ర‌జాభిప్రాయం అంటే త‌న‌కు లెక్క‌లేద‌ని సందేశం పంపుతున్నాడని కాకాణి ధ్వ‌జ‌మెత్తాడు. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌జా వైద్య‌రంగానికి ఉరి బిగించ‌డమేన‌ని తమ సంత‌కాల ద్వారా ప్ర‌జ‌లు స్ప‌ష్టం చేసినా క‌మీష‌న్ల కోసం చంద్రబాబు ఎంత‌కైనా దిగ‌జార‌డానికి సిద్ధ‌ప‌డిపోయాడ‌ని ఆరోపించారు. మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కి మంచి పేరొస్తుంద‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు మెడిక‌ల్ కాలేజీలను పూర్తి చేయ‌కుండా వ‌దిలేశాడ‌ని.. వేత‌ల‌నాల రూపంలో ప్రైవేటుకి రెండేళ్ల‌లో రూ. 1400 కోట్లు చెల్లించే బ‌దులు ఆ డ‌బ్బుతో మెడిక‌ల్ కాలేజీలు క‌ట్టొచ్చు క‌దా అని ప్ర‌శ్నించారు. వాజ్‌పేయి విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో త‌న జీవిత‌కాల‌మంతా హుందాగా రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని చెప్పిన చంద్ర‌బాబు మాట‌ల‌పై కాకాణి ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఒక్కో  ఎన్నిక‌కి ఒక్కో పార్టీతో జ‌ట్టు క‌ట్టే చంద్ర‌బాబు.. జీవిత‌మంతా చిల్ల‌ర రాజ‌కీయాలే చేశాడ‌ని దుయ్య‌బ‌ట్టాడు. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకి లేద‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.    
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

● ప్ర‌జాభిప్రాయాన్నే చంద్రబాబు స‌వాల్ చేస్తున్నాడు 

మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న దుర‌హంకార నిర్ణ‌యంపై రాష్ట్ర ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. 
వైయ‌స్ఆర్‌సీపీ నిర్వ‌హించిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మంలో స్వ‌చ్ఛందంగా పాల్గొని సంత‌కాలు చేశారు. అన్ని పార్టీల‌కు సంబంధించిన ప్ర‌జ‌లు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సంత‌కాలు చేశారు. ఈ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణని గ‌వ‌ర్న‌ర్‌కి నివేదించ‌డం జ‌రిగింది. అయినా ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాత్రం ప్రైవేటీక‌ర‌ణ నుంచి వెన‌క్కి త‌గ్గ‌కుండా నియంత‌లా వ్య‌వ‌హరిస్తున్నాడు. కోటి మందికిపైగా ప్ర‌జ‌లు సంత‌కాలు చేస్తే త‌న నిర్ణ‌యం పై పున‌రాలోచ‌న చేయాల‌న్న క‌నీసం జ్ఞానం లేకుండా పోయింది. అది చాల‌ద‌న్న‌ట్టు త‌న కుట్ర‌కు మ‌రింత ప‌దును పెడుతున్నాడు. మొద‌ట ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌నాల‌ను, భూములను ఎక‌రం వంద రూపాయల‌కే క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత రెండేళ్ల‌పాటు జీత‌భ‌త్యాల‌క‌య్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వమే చెల్లిస్తుంద‌ని చెప్పాడు. కానీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో ప్రైవేట్ సంస్ధ‌లు ముందుకు రావ‌డం లేదు. కానీ దీనిపై త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోకుండా న‌ష్టం వ‌స్తే వ‌యొబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఆ న‌ష్టాన్ని కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందంటూ ప్ర‌జ‌ల సొమ్మును ప్రైవేటుకు దోచిపెట్టేలా మ‌రో ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యం ప్ర‌క‌టించాడు. ఇదంతా చూస్తుంటే ప్ర‌జ‌ల అభీష్టానికే చంద్ర‌బాబు స‌వాల్ విసురుతున్నట్టుంది. ఓటేసిన ప్ర‌జ‌లు ఏం చెప్పినా నాకు అన‌వ‌స‌రం. నేను చేసేది చేసేదే అన్న‌ట్టు.. ప్ర‌జ‌లు వ‌ద్దంటున్నా ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో వెనక్కి తగ్గ‌డం లేదు. కమీష‌న్ల కోసం ఎంత‌కైనా దిగ‌జార‌డానికి సిద్ధ‌మ‌న్న సంకేతాలు పంపుతున్నాడు. ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్ద‌న్న ప్ర‌జ‌ల‌పై క‌క్ష పెంచుకున్నాడు. మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం వైద్య రంగాన్ని ఉరితీయ‌డ‌మేన‌ని ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో ఖండిస్తున్నా.. ఉరి తీయ‌డానికైనా సిద్ధ‌మే అన్న‌ట్టుగా చంద్ర‌బాబు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

● వైయ‌స్ జ‌గ‌న్‌కి మంచి పేరొస్తుంద‌నే ఈ కుట్ర‌

చంద్ర‌బాబు రాష్ట్రానికి సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా పనిచేసినా ఏనాడూ ఒక్క మెడిక‌ల్ కాలేజీనైనా నిర్మించాల‌నే ఆలోచ‌న చేయలేదు. కానీ 
మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు ఐదేళ్ల‌లోనే 17 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీల‌ను పూర్తి చేయ‌డాన్ని చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నాడు. మెడిక‌ల్ కాలేజీల పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేస్తే ఆయ‌న‌కు మంచి పేరొస్తుంద‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు ప్రైవేటీక‌రిస్తున్నాడు. దాని కోసం ఎన్ని పాపాలు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. అందుకే ప్ర‌జా వైద్య‌రంగానికి ఉరి తాడు బిగించడానికి కూడా సిద్ధ‌ప‌డ్డాడు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేయ‌డం ద్వారా వ‌చ్చే క‌మీష‌న్ల కోసం అడ్డ‌దారులు తొక్కుతున్నాడు. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న‌కు అర్థ‌మైంది కాబ‌ట్టే అధికారంలో ఉన్న కాలంలో వీలైనంత దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ప‌నిలో పనిగా వైద్యరంగంలో జ‌గ‌న్ మార్క్ పాల‌న‌ను క‌నిపించ‌కుండా చేయాల‌న్న‌దే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌న్న త‌న ల‌క్ష్యాన్ని ఎలాగైనా నెర‌వేర్చుకోవ‌డం కోసం పార్ల‌మెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక‌ను కూడా  ఎల్లో మీడియాలో వ‌క్రీక‌రించ‌డానికి చంద్ర‌బాబు ఏమాత్రం వెనుకాడ‌లేదు. 

● ఆ డ‌బ్బుతో మెడిక‌ల్ కాలేజీలు క‌ట్టొచ్చు క‌దా

ఒక్కో మెడిక‌ల్ కాలేజీకి జీతాల రూపంలో రెండేళ్ల‌లో సుమారు రూ. 140 కోట్లు.. ప‌ది మెడిక‌ల్ కాలేజీల‌కు రూ. 1400 కోట్ల‌తోపాటు వ‌యొబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన సీఎం చంద్ర‌బాబు ఆ డ‌బ్బుతో మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయ‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు? ఇంత అయాచిత ల‌బ్ధి ప్రైవేటు వ్యక్తుల‌కు చేకూర్చాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌హ‌త‌హ‌లాడుతున్నాడంటే.. వారితో కుదుర్చుకున్న డీల్ ఏంటి? ఆ డీల్ ద్వారా చంద్ర‌బాబుకి వ‌చ్చే ప్ర‌యోజ‌న‌మెంత అనేది ప్ర‌జ‌లే చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. దేశంలో ఎక్క‌డైనా ప్ర‌భుత్వ రంగంలో క‌ట్టిన మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌డం జ‌రిగిందా?  దాని వ‌ల‌న ప్ర‌జ‌ల‌కు ఏం ఉప‌యోగం లేక‌పోయినా ఎక్క‌డా లేని సాంప్ర‌దాయాన్ని ఏపీకి ఎందుకు తీసుకొస్తున్న‌ట్టు? ప్రైవేట్ వ్య‌క్తులు ఎవ‌రైనా ఆదాయం లేకుండా వ్యాపారాలు చేస్తారా? అలాంటి ప్రైవేట్ వ్య‌క్తుల కోసం వ‌కాల్తా పుచ్చుకుని చంద్ర‌బాబు మాట్లాడటం సిగ్గుచేటు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఫీజుల పేరుతో ప్రైవేట్ ఆస్ప‌త్రులు రోగుల్ని దోచుకున్న దారుణాలు చూసి కూడా అలాంటి వారికి వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం వెనుక చంద్ర‌బాబు ఉద్దేశం ఏంటి?  ఆ రోజున ప్రాణాల‌కు తెగించి సేవ‌లందించిన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టాల‌నుకోవ‌డం దిక్కుమాలిన నిర్ణ‌యం. ప్ర‌జా వ్య‌తిరేక  నిర్ణ‌యాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించ‌దు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఆరోగ్య‌శ్రీని నిర్వీర్యం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో అమ‌లైన విలేజ్ క్లీనిక్‌లు, ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానాన్ని తీసేశారు. 108, 104 అంబులెన్స్‌లు రోడ్ల‌పై క‌నిపించ‌డం లేదు. జీరో వేకెన్సీ పాల‌సీ తీసుకొచ్చి ఆస్ప‌త్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చేశారు. వీట‌న్నింటికీ తిలోద‌కాలిచ్చి ప్రైవేటు ప‌రం చేయ‌డం ద్వారా వైద్య‌రంగాన్ని ఉద్ధ‌రిస్తానంటే చంద్రబాబుని ప్ర‌జ‌లు ఎలా న‌మ్ముతారు? ఇప్పటికైనా ప్రైవేటీక‌ర‌ణ‌పై చంద్ర‌బాబు ఆత్మ‌ప‌రీశీల‌న చేసుకోవాలి.

● దిగజారుడు రాజ‌కీయాల‌కు కేరాఫ్ చంద్ర‌బాబు 

వాజ్‌పేయి విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ త‌న జీవిత‌కాలమంతా హుందాగా రాజ‌కీయాలు చేశానిని, ఏనాడూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌లేద‌ని గొప్పలు చెప్పుకున్నాడు. 2004 లో చంద్ర‌బాబు కార‌ణంగా వాజ్‌పేయి ఆరు నెల‌ల ముందే ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి అధికారాన్ని కోల్పోయిన మాట వాస్త‌వం కాదా?  చంద్ర‌బాబు స్వార్థం కార‌ణంగానే దేశంలో ఆ రోజున వాజ్‌పేయి ప్ర‌భుత్వం ఓడిపోయింది. 2004 లో ఓడిపోయాక 2009 ఎన్నిక‌ల్లో బీజేపీని వ‌దిలి ఇత‌ర పార్టీల‌తో జ‌త‌క‌ట్టిన చంద్ర‌బాబు చేసింది చిల్ల‌ర రాజ‌కీయాలు కావా? అధికారం కోసం ఒక్కో ఎన్నిక‌కు ఒక్కో పార్టీతో జ‌ట్టుక‌ట్ట‌డం వ‌ర్క‌వుట్ కాక‌పోతే వ‌దిలిపెట్ట‌డం చిల్ల‌ర రాజ‌కీయాలు కాదా?  మోడీ ఆంధ్రాకి వ‌స్తే అరెస్ట్ చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు 2014లో ఆయ‌న‌తో క‌లిసి జ‌త‌క‌ట్టాడు. ఆ తర్వాత 2019 ఎన్నిక‌ల కోసం ఆయ‌న్ని అన‌రాని మాట‌ల‌న్నాడు. ఆ పార్టీకి దూరంగా జ‌రిగి పోటీ చేశాడు. 2024 లో మ‌ళ్లీ అదికారం కోసం మోడీ భ‌జ‌న మొద‌లుపెట్టాడు. ఇవ‌న్నీ అవ‌కాశ‌వాద చిల్ల‌ర రాజ‌కీయాలు కావా? చ‌ంద్ర‌బాబు రెండు నాల్క‌ల ధోర‌ణి, రెండు క‌ళ్ల సిద్ధాంతం దేశంలో ఎవ‌రికీ ఉండ‌దు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లోనూ సొంతంగానే పోటీ చేసిన వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకు లేదు. అధికారం కోసం వైయ‌స్ జ‌గ‌న్ గారు ఏ రోజూ దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయ‌లేదని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్పష్టంచేశారు.

Back to Top