అప్పుడు రాష్ట్రానికి మీరేం చేశారు?

తిరువూరు (కృష్ణాజిల్లా) :

బీజేపీ- టీడీపీ కలిసి స్వర్గాన్నే కిందికి దించేస్తామంటూ ఈ ఎన్నికల వేళ అబద్ధాలు చెబుతున్న మోడీ, చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేసి గెలిపిస్తే.. రాష్ట్ర భవితవ్యాన్ని మారుస్తామని హామీ ఇచ్చారు.  1999- 2004లో ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి తీసుకురాలేదేం అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీల అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనం అని తూర్పారపట్టారు. కృష్ణాజిల్లా తిరువూరులో శుక్రవారం నిర్వహించిన 'వైయస్ఆర్‌ జనభేరి' బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

'1999- 2004 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ నేతలు చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటే ఒక్క మేలు చెప్పగలరా? ఆ రోజు మీకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదా? పులిచింతల ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులు గుర్తుకు రాలేదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి కాబట్టి గుర్తొచ్చాయి’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు.

కాబోయే ప్రధానిని మనమే నిర్ణయిద్దాం :

‘రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని తిరుపతి సభలో నరేంద్రమోడీ అంటారు. చంద్రబాబుకు ఓటెయ్యండి.. గొప్పగా బాగుచేస్తారని చెప్పారు. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మన గ్యా‌స్‌లో మనకు వాటా ఇవ్వకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎంతవరకు న్యాయం?' అని నిలదీశారు. 'వీరికి మన మీద ప్రేమ లేదు. వీరికెవ్వరికి మన భాష రాదు.. ఆప్యాయత లేదు. వీరికి కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. అందు కోసం ఏ గడ్డి అయినా తింటారు. వీళ్లను ఎవరూ నమ్మొద్దు. 25 ఎంపీ సీట్లనూ మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దామా.. ఎల్లయ్యను చేద్దామా.. పుల్లయ్య ను చేద్దామా అన్నది అప్పుడు నిర్ణయం తీసుకుందాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మనకు నమ్మకం ఎవరిపైన వస్తుందో ఆ వ్యక్తిని ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం' అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

జగన్‌పై బురద జల్లడమే ఎజెండా :
'సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారు. బీజేపీ మద్దతు పలికింది. దానికి చంద్రబాబు నాయుడి ఎంపీల తోడు ఉన్నది కాబట్టే రాష్ట్రాన్ని విభజించగలిగారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే వరకు ఈ మాటలే అక్కడ చెబుతూ వచ్చారు. పెద్దమ్మ సోనియా గాంధీతో‌ పాటు చిన్నమ్మనైన తాను సహకరిస్తేనే రాష్ట్ర విభజన జరిగిందని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ అన్నారు. తాము సహాయం చేయకపోతే విభజన జరిగేది కాదని‌ నరేంద్ర‌ మోడీ నుంచి సుష్మాస్వరాజ్ దాకా తెలంగాణలో నిస్సిగ్గుగా అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా తానిచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పారు. ‘అడ్డంగా ఒక మనిషి కాలు నరికేసి... ఆయింట్‌మెంటు పెట్టడానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్నట్లు’గా ఉంది వీరందరి వ్యవహారం అని శ్రీ జగన్ నిప్పులు చెరిగారు. తిరుపతి సభలో మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు, వీళ్లతో పాటు చాలా మంది తోకలు అందరిదీ ఒకే లక్ష్యం.. జగన్‌పై బురద జల్లడం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ మాటలు వింటే గుండె బరువెక్కింది. నిజాయితీలేని మాటలు మాట్లాడారు. ఆ వేదిక మీద రాష్ట్రాన్ని విడగొట్టింది జగన్ అంటూ అభాండాలు వేయడానికి చూశారు’‌ అని ఆవేదన వ్యక్తంచేశారు.

 అబద్ధాల బాబు కావాలా? నేను కావాలా? :

అబద్ధాలు, వెన్నుపోట్లకు మారుపేరైన చంద్రబాబు నాయుడు కావాలో, విశ్వసనీయత, నిజాయితీ గల తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఎన్నికల్లో నాతో చంద్రబాబు పోటీ పడుతున్నారు. చంద్రబాబు గత చరిత్రను పరిశీలించండి. ఆయన భయానక పరిపాలనను గుర్తు తెచ్చుకోండి’ అని ఆయన సూచించారు.

‘విశ్వసనీయత, నిజాయితీ లేని చంద్రబాబు కావాలా?’ అని మైలవరం సభలో శ్రీ జగన్ ప్రశ్నించగా.. ప్రజలు ముక్తకంఠంతో ‘నో’ (వద్దు) అంటూ చేతులు పెకైత్తారు. చంద్రబాబుకు వినపడేలా చెప్పాలని‌ శ్రీ జగన్ అ‌నగానే సభా ప్రాంగణం మొత్తం ‘నో’ అంటూ నినదించింది. ‘విశ్వసనీయతకే మారుపేరుగా నిలబడిన నేను కావాలా?’ అని ఆయన అడిగినప్పుడు అందరూ ‘యస్’ అంటూ గళమెత్తి చాటారు. గట్టిగా చెప్పాలని మరోసారి శ్రీ జగన్  కోరగా మైలవరం మొత్తం మార్మోగిపోయింది.

తాజా ఫోటోలు

Back to Top