తెలంగాణలోనూ బలంగా వైయస్ఆర్‌సీపీ

'2009లో మధిరలో రూ.150 కోట్లతో‌ మహానేత డాక్టర్ వై‌యస్‌‌ఆర్‌అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఇక్కడి ఎమ్మెల్యే వెంకటనర్సయ్య ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని మించిన కమ్యూనిస్టు లేరని వైయస్ఆర్‌ను గొప్పగా పొగిడారు. దివంగత వైయస్‌ను మించిన గొప్ప కమ్యూనిస్టు ఎవరూ లేరు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు  అతీతంగా ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖరరెడ్డి స్థానం సంపాదించుకున్నారు.'

ఖమ్మం/నల్లగొండ:

ఇతర పార్టీల దిమ్మ తిరిగేలా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తెలంగాణలో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలైన తరువాత కూడా తాము తెలంగాణలో బలమైన శక్తిగా ఉంటామని ఆయన ధీమాగా చెప్పారు.  ‘వైయస్‌ఆర్‌ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోనూ, ఖమ్మం జిల్లా మధిర, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లోనూ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సభలకు పోటెత్తిన ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

‌‘తెలంగాణలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉండనే ఉండదని కొందరన్నారు. అందరి గూబ పగిలేలా.. అందరికీ అర్థమయ్యేలా తెలంగాణలో 98 అసెంబ్లీ, 11 పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాం. మన భాష రాని, మన దేశస్తురాలు కాని సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇక్కడ రాజకీయాలు చేస్తోంది. ఈ భాష తెలిసిన వాడిని, ఈ గడ్డ మీద పుట్టిన వాడిని. ఈ తెలంగాణ నాది. నేనెందుకు ఉండకూడదు తెలంగాణలో? దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి నాకింత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు’ అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

‘తెలంగాణ ప్రజలకు రాజకీయ అవగాహన ఎక్కువ. ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చే పార్టీకి కూడా 40 నుంచి 45 స్థానాలు మించవు. రానున్న రోజుల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తెలంగాణలో ‌ప్రధానమైన భూమిక పోషించబోతోంది’ అన్నారు. సీమాంధ్రలో తమిళనాడు తరహా ఫలితాలు వస్తాయని, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అంతా ఒకే పార్టీ.. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌కే ఓటేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో తన సోదరి శ్రీమతి షర్మిల తన తరఫున తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తారని, తెలంగాణపై ఆమె ఎక్కువ ధ్యాస పెడతార'ని చెప్పారు.

తెలంగాణను మర్చిపోను :
‘రాబోయే రోజుల్లో సీమాంధ్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా.. అయినా తెలంగాణను మాత్రం మర్చిపోను. రాష్ట్రాన్ని విడగొట్టినా.. తెలుగుజాతిని, తెలుగు ప్రజల మనసును విడగొట్టలేరు. ఇక్కడి వారికి ఏ కష్టం వచ్చినా అక్కడి వారు తోడుగా ఉంటారు.. అక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడి ప్రజలు తోడుగా ఉంటారు.. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణను విడిచిపెట్టేది లేదు. రాబోయే రోజుల్లో నా సోదరి శ్రీమతి షర్మిలతో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయిస్తా. ఓదార్పు యాత్రతో ఎవరూ వెళ్లని మారుమూల గ్రామాల్లో ప్రతి పేదవాడి దగ్గరకు, వారి గుడిసెలోకి వెళ్లి వారితో మాట్లాడినపుడు వారి తలంపులే మన తలంపులవుతాయి. ఆ పేద వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చాలన్న ఆలోచన మన మదిలో పరుగెత్తుతుంది. అప్పుడు మంచి రాజకీయ నాయకులు తయారవుతారు.. పేదల కష్టాలు అర్థం అవుతాయి. అందుకే శ్రీమతి షర్మిల చేత ఓదార్పు యాత్ర చేయిస్తా. ప్రతి పేదవాడి సమస్యలు తెలియాలంటే.. ప్రతీ రాజకీయ నేత ఓదార్పు కార్యక్రమం చేపట్టాలి' అన్నారు.

మేనిఫెస్టోకు స్ఫూర్తి ఓదార్పే :
'ఓదార్పు అన్న ఒక్క మాట కోసం ఎంతవరకైనా వెళ్లాను. ప్రతి ఇంటికీవెళ్లా. ప్రతి వారితో మాట్లాడా. ఏడెనిమిది వందల ఇళ్లకు వెళ్లా. వారిని చూసే, వారి కష్టాలు తెలుసుకునే మేనిఫెస్టోను రూపొందించా. అక్కా చెల్లెమ్మల కోసం, వారి పిల్లల చదువుల కోసం, అవ్వా తాతల కోసం, రైతుల కోసం, డ్వాక్రా మహిళల కోసం పథకాలు రూపొందించా. రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా. డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. సీమాంధ్రలో సీఎంగా అధికారంలోకి రాగానే ఐదు సంతకాలు పెడతానని ప్రతి సభలో చెబుతున్నా.. వీటితో పాటు మరో ఆరు కార్యక్రమాలు కలిసి 11 కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడి సీఎంతో కూడా ఇవే కార్యక్రమాలను చేయించేందుకు కృషి చేస్తా' అని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ వా‌ళ్ళొస్తే నిలదీయండి :
'మరో మూడు రోజుల తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మహానేత వైయస్‌ఆర్ పాలనను గుర్తు తెచ్చుకోండి. సీఎం అంటే ఇలా ఉండాలని దేశానికి చాటిచెప్పిన మహానేత. ఆయన మన మధ్య లేకున్నా, ప్రతి వ్యక్తీ ఆయన తమ గుండె లోతుల్లో ఉన్నాడని అంటున్నారు. వై‌యస్ఆర్ ఎప్పుడూ పేదవాడికి తోడూ నీడగా నిలిచారు. కులాలు, మతాలు, ప్రాంతాలని చూడలేదు. పేదవాడి గుండెల్లో స్థానం కోసమే చూశాడు. మహానేత అందించిన సువర్ణ పాలన కావాలంటే వై‌యస్‌ఆర్‌సీపీని ఆశీర్వదించండి. దివంగత ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఒక్క రేష‌న్‌కార్డు, ఒక్క పింఛన్, ఒక్క ఇల్లు ఇచ్చారా? అని ఎన్నికల కోసం ఓటడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్లని అడగండి. మీకెందుకు ఓటెయ్యాలని గట్టిగా ప్రశ్నించండి‌' అని శ్రీ వైయస్‌ జగన్ పిలుపునిచ్చారు.

కాంగె‌స్‌కు చరమ గీతం పాడండి :

'కాంగ్రెస్‌ పార్టీకి మనస్సాక్షి లేదు.. కావాల్సింది ఓట్లే. అందుకే రాష్ట్రం, దేశం తలదించుకునేలా కాంగ్రెస్ రాజకీయం చేసింది, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలి. వై‌యస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయం అన్న పదానికి అర్థం మారింది. రాజకీయాలు చదరంగంగా మారాయి. ఒకరిని తప్పిస్తే, ఒక పార్టీని లేకుండా చేస్తే, జైల్లో అక్రమంగా పెడితే ఓట్లు రాలుతాయేమోనని రాజకీయాలు చేశారు. ఓట్ల కోసం ఏ‌ గడ్డి అయినా తినడానికి ఇప్పటి రాజకీయ నాయకులు వెనుకాడటం లేదు. కాంగ్రెస్ పాలనను అంతమొందించి వై‌యస్ సువర్ణయుగం తెచ్చుకునేందుకు పోరాడాలి. విశ్వసనీయత, నిజాయితీ - కుళ్లు, కుతంత్రాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఓటేసే ముందు బాబు భయానక పాలన గుర్తు తెచ్చుకోండి :
తొమ్మిదేళ్ల తన భయానక పాలనలో ఏ ఒక్క రోజూ పేదల గురించి, రైతులు, వృద్ధులు, వితంతువుల గురించి, పేదల ఆరోగ్యం, వృద్ధుల పింఛన్ గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అడ్డగోలుగా అబద్ధాలాడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని‌ శ్రీ జగన్ విమర్శించారు. ఓటేసేందుకు వెళ్లే ముందు చంద్రబాబు భయానక పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన కోరారు. నిజాయితీ అనే పదానికి అర్థం తెలియని, విశ్వసనీయత లేని మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఎన్నికల మందు ఒక మాట, ఆ‌ తర్వాత ఒక మాట్లాడటం బాబుకు కొత్తేమీ కాదని అన్నారు.

Back to Top