నాలుగు రోజుల దీక్షతో నీరసించిన జగన్

హైదరాబాద్, 8 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దని.. సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్య దీక్ష మంగళవారానికి నాలుగవ రోజుకు చేరింది. గడిచిన నాలుగు రోజులుగా ఆయన ఆహారం తీసుకోకపోవడంతో కాస్త నీరసపడినట్లు వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్సు ఎక్కించాలని డాక్టర్లు సూచించగా శ్రీ జగన్ ‌వైద్యుల సూచనను సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్ష కొనసాగుతోంది.

శ్రీ జగన్‌ను చూసేందుకు వెల్లువెత్తిన ప్రజలు:
సమైక్య దీక్ష చేస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు సోమవారంనాడు అభిమానులు రాష్ట్రం నలు మూలల నుంచీ మేళతాళాలతో తరలివచ్చారు. దీనితో శ్రీ జగన్ క్యాంపు కార్యాలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. వృద్ధులు, మహిళలు, యువ‌తీ యువకులు, విద్యార్థులు శిబిరానికి తరలివచ్చి ‘జై సమైక్యాంధ్ర.. జై జగన్.. వైయస్ఆర్ అమ‌ర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ శ్రీ జగన్‌ను కలిసి ఆయనతో కరచాలనం చేయాలని గంటల తరబడి వేచి ఉన్నారు. కొంత నీరసించినట్లు కనిపించినప్పటికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన వద్దకు వచ్చిన వారందరినీ ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు.

చంటిపిల్లలను తీసుకుని వచ్చిన తల్లుల నుంచి పిల్లలను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడినపుడు వారు ఆనందంతో పరవశులయ్యారు. పలువురు వృద్ధ మహిళలైతే దీక్షలో కూర్చున్న శ్రీ జగన్‌ను చూసి చలించిపోయి విలపించారు. కొందరు మహిళలు ఆయనకు రక్షలు కట్టగా, మరి కొందరు పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో తెచ్చిన తాడును ఆయన చేతికి కట్టారు. కుత్బుల్లాపూర్ నుంచి ఓ బాలిక తెలుగుతల్లి వేషధారణతో, మరికొందరు బాలలు గాంధీతాత‌, పలువురు జాతీయ నేతల వేషధారణతో వచ్చి శ్రీ జగన్‌ను కలుసుకున్నారు.

ముస్లిం యువకులు ఆయనకు దట్టీలు కట్టారు. ముస్లిం మహిళలూ శ్రీ జగన్‌ దీక్షా శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఓ జంట తమ కుమారుడికి 'వైయస్ఆర్‌' అనే అక్షరాలతో అక్షరాభ్యాసం చేయించాలని కోరారు. సమైక్యాంధ్ర అడ్వొకేట్ల జెఎసి నాయకులు శ్రీ జగన్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్న ప్రముఖుల్లో పినతండ్రి వైయస్ వివేకానందరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమా‌ర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బి.గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి రాజేష్, వై.బాలనాగిరెడ్డి, జోగి రమేష్, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎన్టీఆర్ ‌టిడిపి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ, బి.జనక్ ప్రసాద్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మ‌న్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు, పార్టీ డాక్టర్ల విభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభార‌త్‌రెడ్డి, వైయస్ఆర్‌ టిఎఫ్ రాష్ట్ర కన్వీన‌ర్ ఓబుళపతి, మాజీ మంత్రి దివంగత కోటగిరి విద్యాధ‌ర్‌రావు కుమారుడు శ్రీధర్ ఉన్నారు.

జగన్ దీక్షకు‌ అనంతలో వెల్లువెత్తిన మద్దతు:
కాగా, రాష్ట్ర విభజనను నిరసిస్తూ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సమైక్య దీక్షకు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఆయన దీక్షకు సంఘీభావంగా కళ్యాణదుర్గంలో ఎల్ఎమ్ మోహ‌న్రెడ్డి చే‌స్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాలుగవ రోజుకు చేరింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చే‌స్తున్నారు. జిల్లాలోని కదిరి, ఒడిసి తదితర ప్రాంతాల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులు దీక్షలు చేస్తున్నారు.

Back to Top