వైయస్ లాంటి మంచి జననాయకుడు జగన్‌


శ్రీకాకుళం :

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అంటే రాష్ట్ర ప్రజలందరికీ ఓ నమ్మకం, బలమైన విశ్వాసం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభా స్థానంలో బరిలో ఉన్న శ్రీమతి వైయస్‌ విజయమ్మ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తిగా ఆయన రాష్ట్రంలో ఐదేళ్ల మూడు నెలల పాటు సువర్ణపాలన అందించారన్నారు. మనిషిని మనిషిలా చూశారు కాబట్టే అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, పూండి, పాతపట్నం, ఆమదాలవలసల్లో నిర్వహించిన వైయస్‌ఆర్ జనభేరి సభల్లో ‌ప్రసంగించారు. ప్రతి చోటా వేలాది మంది జనం శ్రీమతి విజయమ్మకు సాదరంగా స్వాగతం పలికారు.

'రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతలా అభివృద్ధి, సంక్షేమంతో కూడిన పాలన అందించి దివంగత మహానేత వైయస్ఆర్ అందరివాడయ్యారు. మళ్లీ ఆయన పాలన రావాలంటే ఆయన‌ లాంటి మంచి నేతను ఎన్నుకోవాలి. జనం కోసం జగన్‌బాబు గత నాలుగున్నరేళ్లుగా ఇంటికి దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉంటూ మీ గుండె చప్పుడు తెలుసుకున్నాడు. అలాంటి నాయకుడే ప్రస్తుతం మన రాష్ట్రానికి కావాలి. రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి. రాష్ట్ర విభజన కష్టాలను తొలగించాలి. కొత్త రాజధాని నిర్మించుకోవాలి. ఇదంతా జగన్‌బాబుతోనే సాధ్యం..’ అని శ్రీమతి వైయస్‌ విజయమ్మ చెప్పారు.

శ్రీమతి విజయమ్మ ప్రచార కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థులు నర్తు రామారావు, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణ, తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Back to Top