ముంపు బాధితులకు విజయమ్మ పరామర్శ

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆదివారం నుంచి పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వరద ముంపు ప్రాంతాల్లో‌ ఆమె పర్యటిస్తారు. ఆదివారం కృష్ణా, సోమవారం పశ్చిమ గోదావరి, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలకు శ్రీమతి విజయమ్మ వెళతారు.

బాధితులకు అండగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి భావించినప్పటికీ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్‌ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించలేకపోతున్నారని పార్టీ కార్యాలయం ఆదివారం హైదరాబాద్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

వరద ముంపునకు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే శ్రీమతి విజయమ్మ పర్యటించారు. బాధితులు, రైతుల కష్టాలు తెలుసుకుని, వారి ఆదుకోవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్కు‌ ఆమె లేఖ కూడా రాశారు. ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలో సుమారు 29 మంది మరణించగా, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Back to Top