చంద్రబాబు నీతి కబుర్లు చెప్పడం సిగ్గుచేటు


కాకినాడ:

తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన మొత్తం కుంభకోణాలమయం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభా స్థానం అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ విమర్శించారు. ఏలేరు, నకిలీ స్టాంపులు, ఐఎంజీ భూములు, ఎమ్మార్‌కు భూములు... ఇలా చంద్రబాబు నాయుడి పాలనలో అడుగుకో కుంభకోణం జరిగిందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను ఆయన అడ్డగోలుగా అమ్మేశారని శ్రీమతి విజయమ్మ అన్నారు. నిజాం షుగర్సు, పాలేరు షుగర్సు తదితర సహకార చక్కెర మిల్లు‌లు, స్పిన్నింగ్ మిల్లులను తెలుగు తమ్ముళ్లకు ధారాదత్తం చేశారని దుయ్యబట్టారు. తన హెరిటేజ్ సంస్థ కోసం ప్రభుత్వ డైరీలను మూత వేయించారు. ఇలా ఆయన తొమ్మిదేళ్ల పాలన పీడకలగా సాగిందని తూర్పారపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తూర్పుగోదావరి జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పర్యటించిన శ్రీమతి విజయమ్మ పెరుమాళ్లపురం, ప్రత్తిపాడు, గోకవరంలలో జరిగిన వైయస్ఆర్‌ జనభేరి సభల్లో ప్రసంగించారు.

అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఇప్పుడు చంద్రబాబు నీతి కబుర్లు చెబుతున్నారని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో దర్యాప్తునకు అంగీకరించే‌ ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని సవాల్‌ చేశారు. గతంలో తాను వెలగబెట్టిన తొమ్మిదేళ్ల పాలన మళ్ళీ తెస్తానని చెప్పి ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే ధైర్యం ఉందా? అని చంద్రబాబు నాయుడుపై శ్రీమతి విజయమ్మ విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలోని 65 ప్రభుత్వ రంగ సంస్థలను నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, రామోజీరావు, సీఎం రమేష్, మురళీమోహన్, సత్యం రామలింగరాజు వంటి డబ్బున్నవారికి కట్టబెట్టి, 26వేల మంది ఉద్యోగులను, ఏడు లక్షల మంది కార్మికులను వీధిన పడేశారని చంద్రబాబుపై శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఆయనను మళ్లీ అధికారంలోకి రానిస్తే రాష్ట్రాన్ని స్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తారని ప్రజలను హెచ్చరించారు.

‌మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తెచ్చేందుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జనభేరిలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన‌ శ్రీమతి విజయమ్మకు మెట్టవాసులు బ్రహ్మరథం పట్టారు. సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ సెగ్మెంట్ల బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులు సుబ్బారావు, దాడిశెట్టి రాజా ఆమె వెంట ఉన్నారు.

Back to Top