వైయస్ఆర్ వలెనే జగ‌న్ భరోసాగా ఉంటారు

హైదరాబాద్, 19 నవంబర్ 2013:

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు‌ ఏ విధంగా భరోసా ఇచ్చేవారో జగన్‌బాబు కూడా అలాగే చేస్తారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చెప్పారు. పార్టీ సమైక్య నినాదంతో వెళ్తుందని, ప్రతి కార్యక్రమాన్నీ అందుకు అనుగుణంగా చేసుకోవాలని కోరారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్‌ పంక్షన్‌ హాలులో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

‘రాష్ట్రాన్నెవరూ విడదీయలేరని నా మనస్సాక్షి చెబుతోంది. వైయస్ కూడా ఇదే చెప్పేవారు. రాష్ట్రం బలంగా ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సాధ్యమనేవారు. మనమంతా కలిసుంటామని తెలంగాణ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, మిగులు జలాలపై కట్టిన ప్రాజెక్టులు, పరిశ్రమలను జగ‌న్ తీసుకొస్తారు.‌ నన్ను నల్లగొండలో నిన్నఆపగలిగారు గానీ ఎప్పుడూ ఆపుతారా? ప్రజలు కష్టాల్లో ఉంటే నేను, జగన్ తప్పకుండా వస్తాం. అండగా ఉంటాం' అన్నారు.

'వై‌యస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఈ నాలుగేళ్లూ ప్రజల పక్షాన మనం చేసిన పోరాటాలు గానీ, దీక్షలు గానీ ఏ పార్టీ కూడా చేయలేదు. జగ‌న్ ఉన్నప్పుడు కూడా ఓదార్పు యాత్రలు చేస్తూ అనేక రకమైన దీక్షలు చేశారు. ఆయన లేనప్పుడు నేను, షర్మిల, మీరంతా కలిసి పార్టీని నిలబెట్టుకున్నాం. 2009 ఎన్నికల్లో 180 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని వైయస్ భావించారు. 156 మాత్రమే గెలిచామని చాలా బాధపడ్డారు. మనం ఈ నాలుగేళ్లు చేసింది ఒకెత్తు. ఇప్పుడు చేయబోయేది ‌మరొక ఎత్తు. ఇప్పుడు అంతిమ సమయానికి వచ్చేశాం. కాబట్టి మరింత ఎక్కువ బాధ్యతతో ఎన్నికలొచ్చే దాకా సైనికులుగా పని చేయండి. మీకిచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చాలి. మహిళా, యువజన వంటి అనుబంధ విభాగాలన్నీ బాగా చేయాలి’ అని నాయకులకు శ్రీమతి విజయమ్మ సూచించారు.

Back to Top