బాబు నిక్కర్ల నాటికే భాగ్యనగరి అభివృద్ధి


విజయవాడ:

చంద్రబాబు నాయుడు నిక్కర్లు వేసుకున్న నాటికే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా తాను చేసిందే అని చంద్రబాబు నాయుడు చెబుతున్న కల్లబొల్లి మాటలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆయన నిక్కర్లు వేసుకున్న సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలో ఐద‌వ స్థానంలో ఉందన్నారు. 1956లోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల జాబితాలో హైదరాబాద్ ఉం‌దన్నారు. ‘వైయస్ఆర్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం‌ ఆమె కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని 22 గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.

రాష్ట్రంలో ఐటీ రంగం చంద్రబాబు రాక ముందు మూడవ స్థానంలో ఉండగా, ఆయన అదికారం చేపట్టిన తరువాత ఐదవ స్థానానికి పడిపోయిందని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. సాఫ్టువేర్ ఎగుమతులు చంద్రబాబు హయాంలో తొమ్మిది శాతం ఉంటే దివంగత‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 14 శాతానికి పెరిగిని వైనాన్ని ఆమె ప్రస్తావించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 50 వేల మందికి సాఫ్టువేర్‌లో ఉద్యోగాలు వస్తే వైయస్ఆర్‌ హయాంలో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని శ్రీమతి విజయమ్మ తెలిపారు. చంద్రబాబు నాయుడు తాను చేశానని చెబుతున్న అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఆమె ప్రశ్నించారు.

Back to Top