బాబు కల్లబొల్లి హామీలు విని మోసపోవద్దు

పార్వతీపురం (విజయనగరం జిల్లా), శ్రీకాకుళం :

రాష్ట్రాన్ని అంతలా అభివృద్ధి చేస్తాం.. ఇంతలా చేస్తామంటూ టీడీపీ ఇస్తున్న కల్లబొల్లి హామీలు నమ్మ మోసపోవద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభా నియోజకవర్గం అభ్యర్థిని శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఓటర్లను హెచ్చరించారు. కోట్లాది ఉద్యోగాలు సృష్టించి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబు నాయుడిని అసలే నమ్మొద్దని ఆమె అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే హామీలన్నీ అమలు సాధ్యమైనవి, అందుబాటులో ఉండేవే అని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం వైయస్‌ కుటుంబానికి విశ్వసనీయత ఉందన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోని (2004 - 09) సక్షేమ రాష్ట్రాని మళ్ళీ తెచ్చుకోవాలంటే.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్‌ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారంనాడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలలో ప్రసంగించారు. పాలకొండ, రాజాంలలో భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు. ఒక్క అడుగు కూడా కదపకుండా శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతమూ అత్యంత శ్రద్ధగా విన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ గొప్పగా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయించారని, లాభాలతో నడుస్తున్న ఎన్నో సంస్థలను అడ్డగోలుగా తన బినామీలకు పప్పుబెల్లాల్లా అమ్మేశారని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఫలితంగా 26 వేల మంది ప్రభుత్వోద్యోగులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేక వీధిన పడ్డారని ఆమె ఆరోపించారు. తొమ్మిదేళ్ళు సీఎంగా అధికారం వెలగబెట్టినప్పడు పింఛన్లు, ఉద్యోగుల సంక్షేమం చంద్రబాబు నాయుడి ఎజెండాలో లేని అంశాలని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. ఎంతసేపూ హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, అయితే ఆయన చంటోడిగా ఉన్నప్పుడే ఆ నగరం దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఐదవ స్థానంలో ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తానే మార్చానని బడాయి పోతున్న బాబు మాటలు శుద్ధ పెద్ద అబద్ధమని, ఆయన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పదవిలోంచి దిగిపోయే సమయానికి నగరం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారిపోయిన వైనాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో 81 వేల మందికి ఐటీ ఉద్యోగాలు లభిస్తే.. మహానేత వైయస్ఆర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ సంఖ్య 2.5 లక్షలకు పెరిగిందని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.

చంద్రబాబు హయాం అంతా కుంభకోణాలమయమే అని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఏలేరు కుంభకోణం, మద్యం, నకిలీ స్టాంపులు, తెల్గీ, స్కాలర్‌షిప్‌ల కుంభకో ణం, ఐఎంజీ, ఎల్ అం‌డ్ టీ, రహేజా తదితర కుంభకోణాలకు చంద్రబాబు పాల్పడ్డా‌డన్నారు. పనికి ఆహార పథకం, ఇంకుడుగుంతలు, నీరు-మీరు పథకాలను చంద్రబాబు వదల్లేదన్నారు. తుపాను నిధులను దిగమింగేశాడన్నారు. సుమారు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

అలాంటి అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడికి మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిని,‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎక్కడ ఉందని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. 'చంద్రబాబూ నువ్వు ఏ తప్పూ చేయలేదు  అనుకుంటే, నీకంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?’ అని శ్రీమతి విజయమ్మ సవాల్‌ చేశారు.

Back to Top