తాడేపల్లి: ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే మొహర్రం పర్వదినం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశాన్ని విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన మహోన్నత బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల కూడా మొహర్రమేనని గుర్తు చేసిన వైయస్ జగన్, ఈ పవిత్ర సంతాప దినాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు మొహర్రం వేడుకలు అద్దం పట్టాలని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహనంతో ముందుకు సాగాలని ఆయన తన సందేశంలో కోరారు. మహా త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినమే మొహర్రం ‘ఆషురా’ వైయస్ జగన్ ట్వీట్ సత్యం, న్యాయం కోసం తన ప్రాణాలను అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి మహా త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినమే మొహర్రం ‘ఆషురా’ అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చూపిన త్యాగం, ధర్మనిరతి, మానవతా విలువలు యుగయుగాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ పవిత్ర సందర్భంగా ముస్లిం సోదరులు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారు చూపిన శాంతి, త్యాగం, మానవతా మార్గాన్ని అనుసరిస్తూ ప్రేమ, కరుణ, సోదరభావంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైయస్ జగన్ ట్వీట్ చేశారు. మొహర్రం సందేశం సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.