ముక్కలు చేసిన పాపం ఆ మూడు పార్టీలదే

అమలాపురం :

‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పార్లమెంట్ గేట్లు మూ‌సేసి, మీడియా కళ్లు కప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి బీజేపీ నేతలు బాకాలూదితే, చంద్రబాబు ఎంపీలు ఓట్లు వేశారని విమర్శించారు. విభజన వద్దన్న ఎంపీలను పిడిగుద్దులు గుద్దారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ మూడు పార్టీలు విభజనతో తమకు సంబంధమేమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నాయని నిప్పలు చెరిగారు. విభజనకు అనుకూలంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ లేఖ ఇచ్చినట్టు గోబె‌ల్సు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి షర్మిల శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, కొత్తపేట నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరులో ‘వైయస్ఆర్ జనభేరి’ సభలు నిర్వహించారు.

ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున, ఒక తండ్రిలా ఆలోచించి ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని వై‌యస్ఆర్‌సీపీ లేఖలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. జీఓఎం సమావేశంలో రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసిందన్నారు. తరువాత సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు చేసిందని చెప్పారు. అయినా గోబెల్సు ప్రచారం చేస్తున్నారంటే వీరి బుర్రల్లో ఉన్నది మెదడా? లేక తాటిమట్టా? అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

‘రాష్ట్ర విభజన గురించి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని సోనియాగాంధీ చెబుతున్నారు. ఏం ఆలోచించి మీరు రాష్ట్రాన్ని విభజించారు? అధికారం కోసం ఆలోచించారా? నీ కొడుకు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టడం కోసమా? రాష్ట్రాన్ని కాంగ్రె‌స్ పార్టీ ఏ ప్రాతిపదికన విభజించింది? దానికి బీజేపీ ఏ ప్రాతిపదికన మద్దతు ఇచ్చింది?’ చెప్పాలని‌ శ్రీమతి షర్మిల డిమాండ్ చేశారు.

‌తెలంగాణ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి నాడు శాసనసభలో మాట్లాడినట్టు సోనియా‌ గాంధీ గుంటూరు సభలో చెప్పడాన్ని శ్రీమతి షర్మిల తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ముంటే నాటి అసెంబ్లీ రికార్డులను బయటపెట్టాలని‌ ఆమె సవా‌ల్ చేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఇప్పుడు వచ్చి సీమాంధ్రకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీలివ్వడం చూస్తుంటే... చేతులతో మనిషిని చంపేసి శవంపై పడి ఏడ్చినట్టుగా ఉందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

Back to Top