సర్‌చార్జీలతో ప్రజాధనం దోపిడీ:షర్మిల

కొత్తూరు తండా, (మహబూబ్ నగర్ జిల్లా): విద్యుత్తు సర్‌చార్జీల పేరుతో రాష్ర్ట ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఆరోపించారు. రెండు బల్బులు ఉన్న ఇంటికి రెండు వేల రూపాయల మేరకు బిల్లు వేసి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమాన్నివిస్మరించడంలో కిరణ్ ప్రభుత్వం, చంద్రబాబు దొందు దొందేనని ఎద్దేవా చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. పెంచిన చార్జీలు చెల్లించలేమంటే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

తాళిబొట్లు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్నాం

     మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొత్తూరు తండాలో సోమవారం సాయంత్రం శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో పెంచిన చార్జీలు, పన్నులు పెను భారమయ్యాయని తండా వాసులు శ్రీమతి షర్మిల దృష్టికి తెచ్చారు. తాళిబొట్లు తాకట్టు పెట్టి వాటిని చెల్లిస్తున్నామన్నారు. రెండు బల్బులు ఉంటే రెండు వేల రూపాయల వరకు బిల్లు వేస్తున్నారన్నారు. కిలో బియ్యం ఇస్తూ నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

     ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల తండా వాసులనుద్దేశించి మాట్లాడారు. పాలకుల వేధింపులకు భయపడొద్ద ధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వం కేవలం 4-5 గంటలపాటు మాత్రమే కరెంటు సరఫరా చేస్తూ చార్జీలు మాత్రం విఫరీతంగా పెంచేసిందన్నారు. గ్యాస్ చార్జీలు, పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, ప్రజల కష్టాలు తీరుస్తారని హామీ ఇచ్చారు. మీకు ధైర్యం చెప్పమనే జగనన్న తనను పంపించారని అన్నారు.

Back to Top