ఢిల్లీకి వినిపించేలా 'శంఖారావం': కొణతాల

హైదరాబాద్ 25 అక్టోబర్ 2013:

ఢిల్లీ పీఠం కదిలేలా తమ పార్టీ సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ  స్పష్టం చేశారు. కోట్లమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విభజించడానికే మొగ్గుచూపుతోందని విమర్శించారు. నవంబర్ 15న బిల్లు  పంపుతామని దిగ్విజయ్ సింగ్ అంటున్నారని చెప్పారు. కానీ ఏమాత్రం పునరాలోచన చేసే వైఖరి కనిపించట్లేదని  మండిపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ విభజనకు సహకరిస్తున్నాయి తప్ప అడ్డుకోవట్లేదు కాబట్టే సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరముందన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు కొణతాల చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు. ఇక తమ పార్టీ ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలేవీ రాలేదని, అలాంటిది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన సభ కాబట్టి, అన్ని ఆటంకాలు తొలగించుకుని యథావిధిగా నిర్వహిస్తామన్న నమ్మకం తమకుందని పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను పార్టీ నాయకుడు తలశిల రఘురాం శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. ఇప్పటికే బ్యారికేడ్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. స్టేడియం బయట ఉన్న వారికి కూడా నిరాశ కలగకుండా బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నట్లు రఘురాం చెప్పారు.

Back to Top