మూగబోయిన నారా వారి ‌స్వరం!

విజయవాడ :

టిడిపి అధ్యక్షుడి స్వరం మూగబోయిందని, అందుకే ఆ పార్టీ పిల్లనేతల హడావుడి ఎక్కువైందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబా‌ద్‌లో పయ్యావుల కేశవ్, విజయవాడలో దేవినేని ఉమ వ్యాఖ్యలపై సోమవారంనాడు సామినేని ఘాటుగా ప్రతిస్పందించారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా తాను సమైక్యవాదినని చెప్పి తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పదవులకు రాజీనామా చేయించారన్నారు. అంతే కాకుండా రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో పదేపదే తాను సమైక్యవాదినని చెప్పిన సంగతి ప్రతి పిల్లవాడికీ తెలిసినా టిడిపి పిల్లనాయకులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య నినాదంతో ఈ నెల 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్న సంగతి లోకమంతా తెలిసినా టిడిపి పిల్లనేతలకు తెలియలేదంటే వారికి కంటి చూపుతో పాటు నోటి మాట కూడా పడిపోయినట్లు ఉందన్నారు.

చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నుంచి సమైక్య లేఖ తీసుకోండి :
టిడిపికి నిజంగా సమైక్యంపై చిత్తశుద్ధి ఉంటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు లేఖ ఇస్తానని, హైదరాబాద్‌లో సమైక్య సభ నిర్వహిస్తామని హామీ ఇస్తూ చంద్రబాబుతో ప్రకటన చేయిస్తారా అని ఉదయభాను నిలదీశారు. సమైక్య రాష్ట్రం కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్ని పార్టీలతోనూ కలిసి పయనిస్తానని, అందుకు అందరూ సహకరించాలని చేసిన విజ్ఞప్తిని టిడిపి ఎందుకు తిరస్కరిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి వారు నిజంగా సమైక్యవాదులే అయితే శ్రీ జగన్ చేసిన సూచన‌కు సానుకూలంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top