సాగర్ నీటి కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ధర్నా

జగ్గయ్యపేట‌ (కృష్ణాజిల్లా) : పంటలకు సాగునీరు అందించలేకపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే అధికారం నుంచి తప్పుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను డిమాండ్‌ చేశారు. అన్నదాతను ఆదుకోలేని ఈ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటే అని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జో‌న్-2 కింద వేలాది ఎకరాల్లో సాగవుతున్న ఆరుతడి పంటలకు తక్షణం సాగునీరు విడుదల చేయాలని‌ ఆయన కోరారు. సాగర్ జలాల విడుదల కోసం సోమవారం స్థానిక ఎ‌న్ఎస్పీ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నాలుగు గంటల‌ పాటు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాను ఉద్దేశించి భాను మాట్లాడుతూ, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు మండలాల రైతులు డివిఆర్ బ్రాంచ్ కెనా‌ల్ కింద వేలాది ఎకరాల్లో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. వారు నిత్యం సాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీరు విడుదలచేసి ఆదుకోవాల్సిన కిర‌ణ్ ‌ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రతిపక్ష టిడిపి కూడా రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ స‌ర్‌చార్జీల పేరుతో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను నరకయాతన పెడుతోందని ఉదయభాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనతో నడ్డివిరిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విద్యు‌త్ సరఫరా సక్రమంగా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. స్థానిక డిఇఇ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
Back to Top