ఈ పాలకులకు మనసనేది ఉందా?


అమలాపురం (తూ.గో.జిల్లా),

26 నవంబర్ 2013: ఇటీవలి వరుస తుపానుల వల్ల నష్టపోయిన రైతుల మొత్తం రుణాలను మాఫీ చేయాలని, వడ్డీ లేకుండా కొత్త రుణాలు అందించాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుల రుణాలను రద్దు చేయకుంటే తాము అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామని ఉద్ఘాటించారు. నష్టపోయిన పంటలు ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు పరిహారం అందించాలన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. పంట నష్టంపై కేంద్రానికి తాను లేఖ రాస్తానని, అన్నదాతలకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. హెలెన్ తుపాన్‌ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని అవిడి, ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు, ఎన్. చిన్నపాలెం గ్రామాలలో నేలకొరిగిన వరి పంటలను, అరటి తోటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకుని వారి కష్టాలు విన్నారు. తుపాను, అకాల వర్షాల కారణంగా వరి పంట నాశనమైన పొలాల బురదలోకి దిగి మరీ పరిశీలించిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి అనంతరం రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

‌ఐదు ఎకరాలు పంట నీటిపాలైందని ఓ వృద్ధ రైతు శ్రీ వైయస్ జగ‌న్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌కు తమ కష్టాలు, నష్టాలు చెప్పుకుని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రైతుల కష్టాలను స్వయంగా విన్న శ్రీ జగన్‌ స్పందిస్తూ.. ఈ పాలకులకు అసలు మనసు అనేది ఉందా? అని నిలదీశారు. 'మానవతా దృక్పథంతో రైతులను ఆదుకునే వారే కరవయ్యారు.. ఢిల్లీ రాజకీయాలపై చూపెడుతున్న శ్రద్ధ, అన్నదాతలపై చూపడం లేదు..’ అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల కష్టాలను ఇప్పటికే కేంద్రానికి తాము తెలియజేశామని చెప్పారు. ఒక్క నెలలోనే రెండు తుపానులు వచ్చాయని, మరో తుపాను వస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నదన్నారు. గత ఏడాది నీలం తుపానులో నష్టపోయిన అన్నదాతలకు ఇప్పటికి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని దుయ్యబట్టారు. కోల్పోయిన పంటకు 75 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అని అందరూ ప్రశ్నించాలన్నారు. హెలెన్‌ తుపాను బీభత్సం సృష్టించి ఐదు రోజులైపోయినా ఇంత వరకూ ఏ అధికారీ వచ్చి నష్టాన్ని చూసి పోలేదని దుయ్యబట్టారు. ఒక కేజీ బియ్యం కూడా బాధితులకు ఇవ్వలేదన్నారు. చివరికి బాధితులు చీకట్లో మగ్గిపోతున్నా ఒక్క లీటర్‌ కిరోసిన్‌ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఎకరానికి వేలకు వేలు పెట్టుబడి పెట్టిన‌ పంటలు తుపానులో ధ్వంసమైపోయాయని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. నేలకు ఒరిగిపోయిన వరి పొలంలో ధాన్యపు గింజలు మొలకలెత్తాయని, కుళ్ళిపోయాయని విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని వైయస్ఆర్‌సీపీ తరఫున‌ ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఎక్కువ పరిహారం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రైతుల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు.

కొత్తపేట మండలం వెలిశెట్టివారిపాలెం, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి, చెయ్యేరులలో రైతులతో మాట్లాడారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతును పట్టించుకోని రాష్ర్టం పరిస్థితి అధోగతే. వరుస విపత్తులతో రైతులు రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. ఇటీవలే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలిశా. జరిగిన నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లా. ప్రధానమంత్రికి కూడా నష్టంపై చెబుతాం. మీకు అండగా నేనుంటా. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మీ తరఫున పోరాడుతుంది’ అని అన్నారు.

‘రైతులు ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేశారు. ఇప్పుడు పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. చేతికి అందే ధాన్యం మొలక వచ్చేసింది. వీరిని ఎవరు ఆదుకుంటారు? కేవలం నెల రోజుల్లో రెండు తుపాన్లు వచ్చాయి. మరో తుపాను ముంచుకొస్తుందంటున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నార'ని దుయ్యబట్టారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ ఉన్నప్పుడు నష్టపరిహారం రూపంలో ఒక దారి చూపించేవారని ఈ  ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోయారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నాయని రైతులు విలపించారు. హెలెన్ తుపా‌ను దెబ్బకు విరిగిపడిపోయిన అరటి చెట్లను.. గెలలను వారు శ్రీ జగ‌న్ కు చూపించారు.

బురదలో దిగి పంటను పరిశీలించిన జగన్ :
శ్రీ జగన్మోహన్‌రెడ్డి పర్యటనలో అడుగడుగునా రైతులు తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు. తమకు జరిగిన నష్టాన్ని చెబుతూ రైతులు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి శ్రీ జగన్ చలించిపోయారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరుగున్నేపల్లిలో మోకాలి లోతు బురదలో దిగి.. దెబ్బతిన్న వరిపంటను శ్రీ జగన్ పరిశీలించారు.‌ అప్పులు చేసి రూ. 80 వేలు పంటకు పెట్టుబడి పెడితే తుపానుకు అంతా నాశనమైపోయిందని కన్నీరుమున్నీరైన కౌలు రైతు మట్ల పట్టాభిరామారావును శ్రీ జగన్‌ గుండెలకు హత్తుకుని ఓదార్చారు. గాలిదేవర పేరయ్య నాయుడు అనే రైతు పురుగుమందు డబ్బా చేత్తో పట్టుకుని ‘మాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు’ అని వాపోయాడు. పంట కోసం ఇల్లు, వాకిలితో పాటు భార్య పుస్తెలు కూడా తాకట్టు పెట్టానని, ఇప్పుడు వర్షాలతో పంటంతా పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్ ఆ రైతును ఓదా‌ర్చారు.

‘వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.వెయ్యి పింఛను ఇచ్చే ఫైలుపై మొదటి సంతకం చేస్తాను. వృద్ధులకు రూ.750 పింఛను ఇస్తాం’ అని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. కోనసీమలో పలుచోట్ల పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం శ్రీ జగన్.. ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ కాట్రేనికోన మండల సేవాద‌ళ్ కన్వీన‌ర్ గిడ్డి దివాక‌ర్ కుటుంబాన్ని పరామర్శించారు.
‌అనంతరం కాట్రేనికోన సెంటర్‌లో మాట్లాడాలంటూ మత్స్యకారులు శ్రీ జగన్‌ను పట్టుబట్టారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ‘నాలుగు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి రైతుకు, ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. బోట్లు కొట్టుకుపోయినా.. పంటలు నాశనమైనా.. వలలు పోయినా పట్టించుకునే నాథుడే లేడు’ అని విమర్శించారు.

Back to Top