రాజన్న పథకాలపై మాదే హక్కు

గణపవరం (ప.గో.జిల్లా),

23 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలోని పథకాల గురించి సిఎం కిరణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి  శ్రీమతి షర్మిల గురువారం తీవ్రంగా ప్రతిస్పందించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలు మార్గదర్శకంగా ఉండాలనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలో ఆయన పథకాలను పెట్టామని ఆమె స్పష్టంచేశారు. అవి కాంగ్రెస్‌ పథకాలు కావని, రాజశేఖరరెడ్డి పథకాలే అని స్పష్టంచేశారు. ఆ పథకాల మీద తమకే హక్కుంది గనుక తమ పార్టీ జెండాలో పెట్టుకున్నామని సమాధానం ఇచ్చారు.

రాజశేఖరరెడ్డి తమకు ఆదర్శం అని, ఆయన ఆలోచన మార్గదర్శకం అని, ఆయన పథకాలు తమకు స్ఫూర్తి కనుక ఆయన పథకాలను తమ పార్టీ జెండాలో పెట్టుకున్నామని శ్రీమతి షర్మిల తెలిపారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర  157వ రోజు గురువారంనాడు ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కిరణ్‌రెడ్డి చెప్పిన కొత్త పథకాన్నీ ఎన్నికల పథకాలే అని ఆమె విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖరరెడ్డి గారి పాత పథకాలనే అమలు చేస్తుందా? అని సిఎం కిరణ్‌రెడ్డి నిన్నవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న పింఛన్లను కూడా తొలగిస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంలో నుంచి 133 వ్యాధులను తొలగించిన మాట వాస్తవం కాదా? కిరణ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని శ్రీమతి షర్మిల అన్నారు. పది వేల ర్యాంకు వరకే ఫీజు రీయింబర్సుమెంటును పరిమితం చేయడం ఎంతవరకూ సమంజసం అని నిలదీశారు. మహానేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు లబ్ధిపొంది, ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికే ఉంటే ఈ రోజు ప్రతి పేద కుటుంబానికి 20కి బదులు 30 కేజీల బియ్యం వచ్చావన్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ అమలు చేసిన పథకాలు కాంగ్రెస్‌ పార్టీవని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అంటున్నారని, అయితే ఆ పథకాలను మిగతా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదో వివరించాలని శ్రీమతి షర్మిల ప్రవ్నించారు.

పక్కా ఇళ్ళకు పాడె కట్టిన కిరణ్‌ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు 17 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. డాక్టర్‌ వైయస్‌ సిఎం అయ్యాక 71 లక్షల మందికి పెంచారన్నారు. మహానేత వైయస్‌ది అంత పెద్ద మనసు అన్నారు. రాజశేఖరరెడ్డిగారి ప్రతి పథకానికీ తూట్లు పెట్టారు కిరణ్‌రెడ్డి అని శ్రీమతి షర్మిల దుమ్మెత్తిపోశారు. కానీ చార్జీల పెంపును మాత్రం కిరణ్‌రెడ్డి బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళు సిఎంగా ఉన్న వైయస్‌ ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచని వైనాన్ని ఆమె గుర్తు చేశారు. అయినా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి మహానేత వైయస్‌ అన్నారు.

కిరణ్‌రెడ్డి అయితే ఇప్పటికే ఎరువుల ధరలు పదిసార్లు పెంచారన్నారు. ఆరోగ్య సమస్యలున్న 12 లోపు చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని డాక్టర్‌ వైయస్‌ సంకల్పించారన్నారు. అయితే, కిరణ్‌ ప్రభుత్వం ఆ వయస్సు పరిమితిని రెండేళ్ళకే ఎందుకు తగ్గించిందని నిలదీశారు. గ్యాస్‌ ధరను విపరీతంగా పెంచేశారన్నారు. విద్యుత్‌ బిల్లులు సామాన్యులు, నిరుపేదలకు షాక్‌ తినిపిస్తున్నాయన్నారు. కరెంటు బిల్లుల పేరుతో రూ. 32 వేల కోట్లు ప్రజల నెత్తిన భారం వేసిందన్నారు.

‌పథకాలను అమలుచేసే చిత్తశుద్ధి తమకు ఉందని శ్రీమతి షర్మిల చెప్పారు. చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం లేదు కనుకే కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు ప్రకటనలకు కిరణ్‌రెడ్డి ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మన ఖర్మ కొద్దీ పనికిమాలిన ముఖ్యమంత్రి ఉంటే మరో పక్కన అంతే పనికిరాని ప్రతిపక్ష నాయకుడు ఉన్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.
మామ నుంచి అధికారాన్ని లాగేసుకున్న చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు చూపించారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని, సోమరిపోతులవుతారన్నారన్నారు. ఉచిత విద్యుత్‌ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవడం తప్ప దేనికీ పనికిరాదని అవహేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు తానూ ఇస్తానంటూ ఊళ్ళమ్మట తిరుగుతూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కరెంటు చార్జీలు పెంచుతామని ప్రపంచ బ్యాంకుకు సంతకాలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్‌, టిడిపిల కుట్రలు ఎంతో కాలం నిలబడవని శ్రీమతి షర్మిల అన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, అందుకే ధైర్యంగా ఉన్నారని శ్రీమతి షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం‌ స్థాపించే దిశగా మనలను జగనన్న తప్పకుండా నడిపిస్తారని భరోసా ఇచ్చారు. అంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. శ్రీమతి షర్మిల మాట్లాడిన ప్రతి మాటకూ ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. చప్పట్లు, ఈలలు, కేకలతో స్థానికులు శ్రీమతి షర్మిల ప్రసంగానికి మరింత హుషారు జోడించారు.

Back to Top