రాజన్న మరణంతో చట్టుబండలైన సంక్షేమం

చండూరు(నల్గొండ)11 ఫిబ్రవరి 2013:

మహానేత రాజశేఖరరెడ్డి గారి మరణంతో అన్ని పథకాలూ నిలిచిపోయాయని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లా చండూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సభకు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. జనసందోహంతో సభా ప్రాంగణం కిటకిటలాడిపోయింది. శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని సభికులు శ్రద్ధగా ఉన్నారు. రాజశేఖరరెడ్డిగారి హయాంలో పనులు పూర్తయిన గ్రామాలలో కూడా నాలుగైదు రోజులకోసారి ఈ ప్రభుత్వం మంచినీరిస్తోందని ఆమె మండిపడ్డారు. గొంతెండిపోతోందని మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేకపో యిందని తెలిపారు. రాజన్న ఉండిఉంటే పనులు పూర్తయిన 525 గ్రామాలకూ నేడు నీరంది ఉండేదన్నారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ప్రజలకు అవసరమంటారా అని ఆమె ప్రశ్నించినపుడు అవసరం లేదు.. లేదు.. అంటూ ప్రజలు నినదించారు. ఏగ్రామానికి వెళ్ళినా మహిళలు మేడలు, మిద్దెలు, బంగారం అడగటం లేదనీ, కేవలం మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఆ పాపం ఈ సర్కారుది కాదా అని ఆమె ప్రశ్నించారు.

రాజన్న ఉండి ఉంటే కృష్ణ నీళ్ళొచ్చుండేవి
      రాజశేఖరరెడ్డిగారు బతికుంటే ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం గుండా కృష్ణ నీళ్ళు ఈపాటికి వచ్చేసి ఉండేవన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే నాలుగు లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు అది అని ఆమె పేర్కొన్నారు. గతంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పథకాన్ని చేపట్టే సాహసం చేయలేదన్నారు. మహానేత ఈ ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించి 1900 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. ఆయన మరణం తర్వాత ఆ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. నీళ్ళు రాలేదు. పథకం పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో సాగు,తాగు నీరు పుష్కలంగా అంది ఉండేవని చెప్పారు.

చితికిపోతున్న చేనేతలు
     ఇక్కడ చేనేత కార్మికులు కూడా ఎక్కువని శ్రీమతి షర్మిల చెప్పారు. రాజశేఖరరెడ్డిగారు ఎప్పుడూ చక్కని చేనేత దుస్తుల్లో చిక్కని చిరునవ్వుతో కనిపించేవారన్నారు. చేనేతన్నంటే రాజన్నకి ఎంతో మక్కువనీ, అందుకే ఆయన చేనేతల రుణ మాఫీకి ఎంతో కృషిచేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో 75 సంఘాలకు 106 కోట్ల రూపాయలను ఆయన మంజూరు చేశారని చెప్పారు. తరవాత చేనేతలకు రుణమాఫీ ఒక్కసారి కూడా చేయలేదని తెలిపారు. ఖర్చులు పెరిగాయి.. డిమాండ్ పెరిగింది. డెబ్బై శాతం మంది చేనేతలు కూలికో... ఇంకా ఇతరత్రా పనులకో వెళ్ళిపోతున్నారనీ, దీన్నిబట్టే ప్రభుత్వానికి వీరిపై ఎంత ప్రేమ ఉన్నదీ అర్థమవుతుందనీ చెప్పారు. అమెరికన్ వైట్ హౌస్ లో కూడా ఇక్కడ నేసిన చేనేత ఉందనీ, ఇది రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వ కారణమనీ ఆమె చెప్పారు. చేనేత రంగంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె మండిపడ్డారు.

విలవిలలాడుతున్న కల్లు గీత కార్మికులు
     ఈ ప్రాంతంలో కల్లు గీత కార్మికులు కూడా ఎక్కువనీ, చంద్రబాబు పాలనలో వేసిన నానారకాల పన్నుల నుంచి తప్పించి, రాజన్న కేవలం 25 రూపాయలు మాత్రం పన్ను వేశారనీ శ్రీమతి షర్మిల చెప్పారు. వీరికి యాబై ఏళ్ళకే పింఛను ఇవ్వాలని ఆలోచించింది ఒక్క రాజన్న మాత్రమేనన్నారు. చెట్టు నుంచి పడి గీత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించిందీ రాజన్నేనని తెలిపారు. ఈ ప్రభుత్వం పింఛను ఇవ్వడం లేదు సరికదా.. పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు.

గిట్టుబాటు కరవై పత్తి రైతు చిత్తు
     పత్తి రైతులను చూస్తే చాలా బాధేస్తోందన్నారు. గిట్టుబాటు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది మద్దతు ధర కేవలం 3900 రూపాయలు. రాజన్న హయాంలో ఏడు వేలు కూడా పలికిందన్నారు. ఎకరం పత్తి సాగు చేయడానికి 5000 ఖర్చవుతుందనీ, అంటే రైతు నష్టానికి సాగు చేయాల్సి వస్తోందనీ వివరించారు. ఈ ఏడాది సీసీఐ 93 కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ అవి తెరిచి ఉండేది వారానికి రెండు మూడు రోజులేనని తెలిపారు. కొన్నవారికి నెలలు గడిచినా బిల్లులు చెల్లించడం లేదన్నారు. రైతులు కొనుగోలు కూపన్ల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. దాదాపు యాబై లక్షల పత్తి రైతుల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఈకారణంగా పత్తి అమ్మకానికి ప్రైవేటు వ్యాపారస్థులను  ఆశ్రయించి ఇంకా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసే మోసాల కారణంగా రైతుకు టన్ను పత్తికి దక్కేది 2500 లేక  3000 మాత్రమేనని చెప్పారు. సీసీఐ ఈసారి పది శాతం పత్తిని మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన తొంబై శాతం దళారులే కొన్నారనీ, దీన్నిబట్టే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోందన్నారు. పత్తి రైతు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నష్టపోయాడనీ, ఈ పాపం ఊరికే పోదన్నారు. ఈ పాపం సర్కారుది కాదా అని ప్రశ్నించారు. ముందుచూపు లేకుండా పత్తి రైతును కనీసం ఆదుకుందామన్న జ్ఞానం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

గండ్ర గారూ! నాతో ఎందుకు ప్రజలతో చర్చించండి
     ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని విమర్శిస్తే.. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తనను బహిరంగా చర్చకు రమ్మన్నారని అంటూ ఆయనను షర్మిల సూటిగా ప్రశ్నించారు. జగనన్న జైలులో ఎందుకున్నాడో కూడా నేను చెప్పాలట.. అంటూ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఏరోజూ కరెంటు చార్జీలు, గ్యాస్ ధరలూ పెరగని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆర్టీసీ చార్జీలు పెరగలేదు... పన్నులు వేయలేదు. ఇది రాజన్న ఘనత కాదా అని ఆమె ప్రశ్నించారు. పన్నులు పెంచడం అభివృద్ధిలో భాగమా అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఇవన్నీ సంక్షేమంలో భాగం కాదంటే ప్రజల్లోకి చెప్పాలని ఆమె సవాలు చేశారు. రాజన్న మనసులోంచి పుట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయని చెబుతూ ఫీజు రీయింబర్సుమెంటు..ఆరోగ్యశ్రీ తదితరాలను గుర్తుచేశారు. రాజన్న జీవించి ఉంటే ఈ పాటికి తొమ్మిది గంటల కరెంటు ఇచ్చిఉండేవారు కాదా అని ప్రశ్నించారు. తామెన్ని గంటలు ఇస్తున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలని కోరారు. రాజన్న రాష్ట్రంలో 47లక్షల ఇళ్ళు కట్టించారు.. ఈ ప్రభుత్వం ఎన్ని ఇళ్ళు కట్టించిందో వెల్లడించాలని శ్రీమతి షర్మిల అడిగారు. చంద్రబాబు 17 లక్షల మందికి పింఛన్లిస్తే మహానేత 71 లక్షల మందికి పింఛన్లిచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వం పింఛన్లలో ముపై శాతం కత్తిరించలేదా అని ప్రశ్నించారు. రేషను కార్డుల తగ్గించలేదా అని అడిగారు. 132 వ్యాధులను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించలేదా అని నిలదీశారు. ఈ వ్యాధులు వస్తే ప్రభుత్వాస్పత్రికే వెళ్ళాలని కూడా కోరలేదా అని ప్రభుత్వాన్ని అడిగారు. స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రే ఆరోగ్యశ్రీ అమలుపై అసంతృప్తి వ్యక్తంచేయడాన్ని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గండ్రగారూ! ఇదేనా సంక్షేమం!
     రాజశేఖరరెడ్డి గారు తండ్రిగా   ఆలోచించి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మహానేత తన హయాంలో మొత్తం ఫీజు చెల్లిస్తే.. ఈ ప్రభుత్వం ఫీజులో రెండు వంతులు తల్లితండ్రులే భరించాలని చెప్పడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయితే కరెంటు చార్జీలు పెంచబోనన్న మహానేత వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. చార్జీలమీద చార్జీలు వేసి వినియోగదారుల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. 32వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. చంద్రబాబు హయాంలో 140 రూపాయలున్న గ్యాస్ ధర ఆయన దిగిపోయే సరికి 305 రూపాయలైందన్నారు. రాజన్న హయాంలో ఆ మొత్తం అలాగే ఉంది తప్ప పైసా పెరగలేదన్నారు. ప్రస్తుతం.. తొమ్మిది సిలిండర్లే ఇస్తామంటోంది. ఆపైనా 1050 రూపాయల చొప్పున సిలిండరుకు చెల్లించాలట అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంలో సభ్యులైన గండ్ర చర్చలు నాతో కాకుండా నియోజకవర్గంలోని ప్రజల వద్దకు వెడితే వారు చర్చిస్తారు అంటూ సమాధానం చెప్పారు. జగనన్న ప్రజల మధ్యలో ఉంటే తమ పీఠాలు కదిలిపోతాయని ఆయన్ని జైలులో పెట్టించింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. సర్కారు ఎడాపెడా పన్నులతో ప్రజలను  బాదేస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై మంత్రులకే నమ్మకం లేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

Back to Top