రాజకీయ గురువు కృష్ణబాబు బాటలో నడిచా: వనిత

హైదరాబాద్:

పార్టీ కోసం ఓ మహిళా ఎమ్మల్యేగా పార్టీ కోసం మూడున్నరేళ్లుగా కష్టపడి పని చేస్తుంటే ఎలాంటి కారణం లేకుండా టీడీపీ నుంచి బహిష్కరించడాన్ని జీర్ణించుకోలేక పోయానని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ నివాసంలో ఆదివారంనాడు పార్టీలో చేరిన సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తన నియోజకవర్గంలో కొందరు ఒక వర్గంగా ఏర్పడి నిత్యం తనను వేధించడమే పనిగా పెట్టుకున్నారనీ, ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర నాయకత్వాలకు చెప్పినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు.  వైయస్ఆర్ కాంగ్రెస్‌లో తనకు ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతో తన రాజకీయ గురువు కృష్ణబాబు బాటలోనే పార్టీలో చేరానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ తులసీ వరప్రసాద్ మాట్లాడుతూ.. తాను 1960 నుంచీ రాజకీయాల్లో ఉన్నాననీ, వైయస్ వంటి నాయకుడిని ఎపుడూ చూడలేదనీ స్పష్టంచేశారు. ఎమ్మెల్యే  టి. బాలరాజు మాట్లాడుతూ.. కృష్ణబాబు ఆయన అనుచరుల చేరికతో తమ జిల్లాలో పార్టీ మరింత బలపడిందనీ,  వచ్చే ఎన్నికల్లో 15 శాసనసభా స్థానాలను గెల్చుకుని తీరతామనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, దెందులూరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కొటారు రామచంద్రరావు, చింతలపూడి టీడీపీ ఇంచార్జి కర్రా రాజారావు, కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ కోడూరి పార్వతీకుమారి, కొవ్వూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఉమామహేశ్వరరావు, చిట్టూరి బాపినీడు కుమారుడు నరేంద్ర, కుమార్తె రాజశ్రీ, మెహర్ శ్రీనివాస్, రాజీవ్‌కృష్ణ (కృష్ణబాబు అల్లుడు), సీడీసీ మాజీ చైర్మన్ ఎండపల్లి రమేష్, కాకర్ల నారాయుడు, బలుసు సుబ్బారావు, ముళ్లపూడి వెంకటకృష్ణారావు, కోట శ్రీదేవి, సిహెచ్.రమ, భావన, ఎం.ఎ. షరీఫ్, తోట వెంకటరమణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై.వి. సుబ్బారెడ్డి, పి.ఎన్.వి.ప్రసాద్, ఎం. ప్రసాదరాజు, హరిరామజోగయ్య, మోషేన్‌రాజు, డి.రవీంద్రనాయక్, రాజ్ ఠాకూర్, పుత్తా ప్రతాపరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, బుచ్చి మహేశ్వరరావు పాల్గొన్నారు.

Back to Top