అమ్మ హస్తం.. ఇదీ బండారం

నర్సీపట్నం 26 జూన్ 2013:

అమ్మ హస్తం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సరకుల బండారాన్ని కృష్ణాపురం  గ్రామస్థులు బయటపెట్టారు. బుధవారంనాడు ఉదయం శ్రీమతి వైయస్ షర్మిల తన 192వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇక్కడినుంచే ప్రారంభించారు. రాత్రి బస నుంచి బయటకు వచ్చిన ఆమెకు గ్రామస్థులు అమ్మ హస్తం సంచితో ఎదురేగారు. ఆ సంచితో ఇస్తున్న సరకుల నాణ్యత అస్సలు బాగోలేదనే విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. కారంలో కల్తీ ఉన్న విషయాన్ని వారు దానిని నీళ్ళలో వేసి చూపించారు. అలాగే ఉప్పు, పసుపు నాసిరకంగా ఉన్న విషయాన్ని కూడా తెలిపారు. శ్రీమతి షర్మిల ఆయా సరకులను చేతితో ముట్టుకుని పరిశీలించారు. ప్రభుత్వం తీరును ఆమె విమర్శించారు. రాయితీ ఇస్తున్నామని చెప్పగానే సరికాదనీ, సరకులను నాణ్యంగా ఇవ్వలేకపోతే అది ఇచ్చీ ఉపయోగం ఉండదనీ ఆమె మండిపడ్డారు. ఎదురైన వారందరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ కష్టాలు తెలుసుకుంటూ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించారు.

Back to Top