ప్రతి మహిళలో తల్లి, చెల్లిని చూడాలి

అనిగండ్లపాడు, (కృష్ణా జిల్లా), 20 ఏప్రిల్‌ 2013: దేశంలో నిత్యం ఏదో ఒకచోట మహిళాలోకంపై జరుగుతూనే ఉన్న లైంగికదాడులను వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయ్మ‌ తీవ్రంగా ఖండించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన దేశానికి 65 ఏళ్ళ క్రితం స్వాతంత్ర్యం వచ్చింది. అయినా ఇంత వరకూ మహిళలకు స్వాతంత్ర్యం రాలేదు. వయసుతో నిమిత్తం లేకుండా పసిపిల్లలు, వృద్ధుల మీద కూడా లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ సంఘటన మరిచిపోక ముందే దేశ రాజధాని ఢిల్లీలోనే ఐదేళ్ల పసిపాపపై పాశవికంగా అత్యాచారం జరిగింది. ఇది ఎంతో జుగుప్సాకరం. క్రూరమైన సంఘటన’ అని శ్రీమతి వైయస్ విజయమ్మ ‌ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి నీచులకు కఠినమైన శిక్షలు పడేలా కేంద్రం కృషి చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. చట్టాలు తేవడంతో సరిపెట్టకుండా వాటిని కచ్చితంగా అమలు చేస్తేనే మృగాళ్లలో మార్పు వస్తుందన్నారు. ఇలాంటి దురాగతాలు పాల్పడాలంటేనే వణుకు పుట్టేలా కఠిన చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. బాధిత చిన్నారి ఆరోగ్యం బాగుపడాలని, త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు.

పురుషుల ఆలోచనల్లోనూ మార్పు రావాలని, అందరిలోనూ తల్లి, చెల్లి, బిడ్డను చూసే విధంగా ఆలోచనా దృష్టి మారాలని శ్రీమతి విజయమ్మ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ చిన్నారిపై లైంగికదాడికి నిరసగా అందరం మౌనం పాటించి నిరసన తెలపాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని‌ ఆమె, శ్రీమతి షర్మిల, పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ, ఇతర నాయకులు నిరసన తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో మహిళలకు రక్షణ లేదు : శ్రీమతి షర్మిల :
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె ‌చేస్తున్నపాదయాత్ర శనివారం అనిగండ్లపాడు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, చిన్నారిపై లైంగిక దాడికి నిరసనగా నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మౌనదీక్ష చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల అనిగండ్లపాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై షీలా దీక్షిత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉ‌న్నా మహిళలకు మాత్రం రక్షణ లేదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. నిర్భయ ఘటనను మరిచిపోక ముందే న్యూఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరగడం ఘోరమని అన్నారు. మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆకతాయిల చేష్టల వల్ల ఓ ఆడబిడ్డ తల్లి బలైపోయింది, అయి‌నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నదని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

ఇలాంటి ఘటనలకు మద్యం దుకాణాలే కారణమని శ్రీమతి షర్మిల తెలిపారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా మద్యం అమ్మకాలు యధేచ్ఛగా పెరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రతి నెలా మద్యం అమ్మకాలను 15 శాతం పెంచాలని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి లక్ష్యం నిర్దేశిస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. అందువల్లే మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో చంద్రబాబు పాలనలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అన్నారు. చంద్రబాబు హయాంలో రంగారెడ్డి జిల్లాలో అనురాధ అనే యువతిపై యాసిడ్ దాడి జరిగితే కనీసం ఆర్థికసాయం కూడా చేయలేదని‌ శ్రీమతి షర్మిల ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఆమెకు ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. నిరుపేద అయిన ఆమె ఆర్థిక సాయం చేయాలని అప్పటి సిఎం చంద్రబాబును కోరింది. అయితే చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. నీ మీద దాడి జరిగితే ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఆమె కోర్టుకు వెళ్లింది.

బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా చంద్రబాబుకు అందుకు మనసు రాలేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన త‌ర్వాత ఆ యువతిని ఆదుకున్నారని తెలిపారు. ఆమెకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. ఈ రోజున అనురాధ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా పని చేస్తోంది అని షర్మిల గతాన్ని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి ‌సిఎంగా ఉన్నప్పుడు మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత ఉండేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆయన తన అక్కగా, చెల్లెలిగా భావించారని వెల్లడించారు. ‌జగనన్న సిఎం అయ్యాక మహిళలకు రక్షణ కల్పిస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అత్యాచారాల విషయంలో అయితే మహానేత వైయస్ చాలా కఠినంగా ఉండేవా‌రన్నారు. ఎవరైనా మళ్లీ అలాంటి తప్పు చేయాలంటేనే భయపడే విధంగా చర్యలు తీసుకునే వారని గుర్తుచేశారు.
Back to Top