ప్రపంచంలో ఏం జరిగినా మహానేతకు ముడిపెడతారా!

హైదరాబాద్ 15 ఫిబ్రవరి 2013:

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఎ మ్మెల్యే రేవంత్‌రెడ్డిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. హెలికాప్టర్ కుంభకోణానికీ, దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారికీ ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ వైయస్ ప్రయాణించిన బెల్ 430 హెలికాప్టరును కొన్నది చంద్రబాబునాయుడేననీ, అది కూలిపోయింది కాబట్టి అవినీతి జరిగినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై చంద్రబాబుపై న్యాయవిచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరతారా అని సవాలు చేశారు. బాబు బూతులను ప్రచారం చేయడానికి చెంబు బ్యాచ్ ప్రారంభమైందనీ, దీనికి ఎల్లో బ్యాచ్ వంతపాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నోరు అదుపులో ఉంచుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. మీడియా సమావేశం పూర్తి పాఠం..
 ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అధికారం పిచ్చి ముదిరిపోతోందని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.  తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అత్యధిక కాలం పనిచేసిన రికార్డు సృష్టించారన్నారు. ప్రతిపక్ష నేత హోదాను పోగొట్టుకుని తన పార్టీని సర్వ నాశనం చేసుకునే రికార్డు కూడా సొంతం చేసుకునే రోజు కూడా దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబుకు తనేం ఏంమాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదనీ, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షింపజేస్తే మంచిదని టీడీపీ నేతలకు గట్టు సూచించారు. బయటకు కాంగ్రెస్ పార్టీనీ, కిరణ్‌కుమార్ రెడ్డిని విమర్శిస్తూ లోపల మాత్రం ఆ పార్టీయే అధికారంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా మారిపోయిన చంద్రబాబు నోరు తెరిస్తే రాజశేఖరరెడ్డిగారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిగారిపై విమర్శలు గుప్పిస్తుంటారన్నారు. ప్రపంచంలో ఏం జరిగినా వారికి అంటగట్టకుండా జీవించే పరిస్థితి చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడం, తన పార్టీని నాశనం చేసుకోవడం, తప్ప కాంగ్రెస్ చేసే అరాచకాల్ని చంద్రబాబు ఖండించడన్నారు. ప్రజా సంక్షేమ పథకాల్ని తీసేస్తున్నా ఆయన నోరు విప్పడన్నారు. మహానేత డాక్టర్ వైయస్ దెబ్బకు 2004లో మెదడు మోచేతిలోకీ, 2009లో మోకాలిలోకి వచ్చిన చంద్రబాబు మాటలు ఆయన వెంట తిరిగే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి చూసి ఆయన తాబేదార్లు కొందరు ఆ పార్టీకే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్నారన్నారు.


బాబు మాటలకు చెంబు బ్యాచ్ ప్రచారం

     చంద్రబాబు మాట్లాడే బూతు మాటలను ప్రచారం చేయడానికి చెంబు బ్యాచ్ తయారైంది. ఈ బ్యాచ్‌లో ఉన్న రేవంత్ రెడ్డి మాటలు వింటే రాజకీయ నాయకుడు మాట్లాడేవేనా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అగస్టా కుంభకోణాన్ని రాజశేఖరరెడ్డి గారి కుటుంబానికి లింకు కలపడం ఇలాంటిదేనన్నారు. ఎక్కడేం జరిగినా జగన్మోహన్ రెడ్డిగారికి సంబంధం కలుపుతారు. తన మటుకు తను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతూ ప్రజాభిమానం సంపాదించుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి అంటగట్టడమేమిటని అడిగారు. అధికారం ఉన్నవారిని వదిలి లేనివారికి ఆపాదించమేమిటని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఆయనకు సలహా ఇచ్చారు. మాట్లాడిన మాటలకు విశ్వసనీయత ఉండేలా చూసుకోవాలని సూచించారు. రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన హెలికాప్టరు అవినీతితో కొన్నదైతే దానిమీద విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తానని గట్టు స్పష్టంచేశారు. ఎందుకంటే చనిపోయినపుడు ఆయన ప్రయాణించిన బెల్ 430 హెలికాప్టరును చంద్రబాబు హయాంలో కొన్నదేనన్నారు. అలాంటి హెలికాప్టరు కొనుగోలుపై విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరతారా అని ఆయన సవాలు విసిరారు.


జైపాల్ రెడ్డి కోవర్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారా

     ఇటలీలో జరిగిన 12 హెలికాప్టర్ల కుంభకోణాన్ని వైయస్ఆర్ కుటుంబానికి ముడిపెట్టడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి రేవంత్ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కోవర్టుగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం వస్తోందన్నారు. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రయి ఉంటే ఆయనకు అల్లుడయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉండేవారన్నారు. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిత్వం వహించిన కంపెనీకీ ఎమ్మార్ సంస్థ డైరెక్టరుకూ సంబంధం ఉందనీ అందుకని ఈ కుంభకోణంలో మహానేత కుటుంబానికి లంకె పెట్టేశారని ఆయన రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఆ హెలికాప్టర్ల కుంభకోణంలో అయితే గియితే కేంద్ర ప్రభుత్వంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేయడం పోయి ఇలా మాట్లాడడమేటని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఆయన రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు వేశారు. ఎమ్మార్ కంపెనీని ఎ వరు తీసుకొచ్చారు.. అది ఎక్కడినుంచి వచ్చింది.. ఎవరు భూములిచ్చారు.. ఆ ఒప్పందం కుదిరేముందు చంద్రబాబు దుబాయ్ లోని ఎమ్మార్ అధిపతి ఇంట్లో మూడు రోజులు ఉన్నారన్నారు. ఈ వ్యవహారంలో ఆ అధిపతికి భూములు చూపించి పనులు చేసి పెట్టిన కోనేరు ప్రసాద్ టీడీపీ అధినేతకు బినామీ కాదా అని ప్రశ్నించారు. కోనేరు ప్రసాద్ అంటేనే చంద్రబాబు నాయుడన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి 530 ఎకరాలను ఎమ్మార్‌కు కట్టబెట్టింది కూడా చంద్రబాబునాయుడేనన్నారు. ఏపీఐఐసీతో సంబంధం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నది ఆయనేనన్నారు. ఇదే నిజమైతే హెలికాప్టర్ల కుంభకోణంతో చంద్రబాబుకే సంబంధం ఉంటుందని గట్టు స్పష్టంచేశారు. కోనేరు ప్రసాద్, ఎమ్మార్ డైరెక్టరుకు హెలికాప్టరు కొనుగోలులో సంబంధం ఉండి ఉంటే ఆ కుంభకోణంలో చంద్రబాబు నిష్ణాతుడై ఉండి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్న వాళ్ళకి కుంభకోణంతో సంబంధం ఉందని చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. చెంబు గ్యాంగు, ఎల్లో గ్యాంగులను పెట్టుకుని రాజకీయాలను చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న సమస్యలను విడిచిపెట్టి ఎక్కడివో విషయాలను మాట్లాడడం తగదన్నారు. రెండువేల కిలోమీటర్లు పాయాత్ర చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబుకు రాజశేఖరరెడ్డిగారు పాదయాత్ర చేసినపుడు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని నిలదీశారు.


మహానేత పాదయాత్రతో బాబు యాత్రకు పోలికా!

     అధికారంలో లేనపుడు మహానేత ప్రజలు తమకెందుకు దూరమయ్యారు.. వారి సమస్యలేమిటి.. వారినెలా దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం చేశారన్నారు. ఆ పాదయాత్రతో తన పాదయాత్రను బాబు పోల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ళు పరిపాలించి, ప్రజలను దూరం చేసుకున్నాడు. వారు వేసిన శిక్షను చంద్రబాబు అనుభవిస్తున్నాడు. ఇంత జరిగినా ఇప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళి వారి చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను తెస్తానని చెబుతున్నారు తప్ప.. తన తొమ్మిది సంవత్సరాల పాలన తెస్తానన చెప్పడం లేదు... ఎందుకంటే అది అంత దరిద్రంగా ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నావన్నారు. తెలుగు దేశం పార్టీలో సీనియర్లు, ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో  గమనించుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఈ దేశంలో ఏ కుంభకోణం జరిగినా చంద్రబాబు చేయి ఉంటుందని పేరుందన్నారు. నోరుందికదాని నీ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే నీ చంద్రబాబును, ఆయన చెంబు గాళ్ళను తరిమే రోజులు ముందున్నాయని గట్టు రామచంద్రరావు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

Back to Top