ప్రజా సమస్యలపై ఉద్యమానికి నిర్ణయం

హైదరాబాద్, 11 మే  2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం సమావేశమైంది. స్థానిక  సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు తదితర అంశాలపై  చర్చించింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ దీనికి అధ్యక్షత వహించారు.  తాజా రాజకీయ పరిణామాలతోపాటు మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయాత్తం చేసి, రానున్న సాధారణ ఎన్నికలకు సన్నద్ధం  కావాలనే అంజెండాతో త్వరలోనే పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రాంతాల వారీగా ప్రజల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. సమావేశంలో నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంతరం పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ రకమైన ఆందోళనలు చేపట్టాలనే అంశాన్ని చర్చించామన్నారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనతోపాటు పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడానికి  కమిటీల ఏర్పాటును కూడా చర్చించినట్లు కొణతాల వెల్లడించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకపోయినా పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కొల్పోకుండా మరింత ఉత్తేజంతో పనిచేసేందుకు అనువుగా కార్యక్రమాలను రూపొందించామనీ, వాటి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామనీ చెప్పారు.

తెలంగాణలో ఓదార్పు యాత్రపై చర్చ: బాజిరెడ్డి
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కలల ప్రాజెక్టు ‘ప్రాణహిత-చేవేళ్ల’కు జాతీయ హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో త్వరలో ఆందోళన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో అసంపూర్తిగా మిగిలిన ఓదార్పు యాత్రను శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో నిర్వహించాలనే అంశాన్ని కూడా చర్చించామన్నారు.

Back to Top