ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా నిలబెడుతోంది బాబే

భీమవరం (ప.గో.జిల్లా),

25 మే 2013: కేవలం చంద్రబాబు నాయుడి వల్లే ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికింకా ప్రభుత్వం కొనసాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి, మరో ప్రజాప్రస్థానం పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిల దుమ్మెత్తిపోశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కాల్చుకు తింటోందని విచారం వ్యక్తంచేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలో వే‌లాది పరిశ్రమలు మూతపడి, లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా కరెంట్ చార్జీలు పెంచిందన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారం వేసి రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలకుండా చంద్రబాబు కాపాడుతున్నారని‌ శ్రీమతి షర్మిల ఆరోపించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. మన దురదృష్టం కొద్దీ ఆ మహానేత మన మధ్య నుంచి వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ఎప్పుడో కూలిపోయి ఉండేదన్నారు. ఈ ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు భారం పడేది కారన్నారు. చంద్రబాబుకు పదవీకాంక్ష లేకుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేవారా? అని నిలదీశారు. అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు లక్షల కోట్లు విలువైన భూములను చంద్రబాబునాయుడు తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని‌ శ్రీమతి షర్మిల అన్నారు.

మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేశారని గుర్తు చేశారు.‌ ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని మహానేత వైయస్‌ తపించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించారన్నారు. విద్యార్థులకు కన్న తండ్రి స్థానంలో నిలబడి వారికి ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశారు. ఆయన ఇచ్చిన చేయూతతో ఎందరో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. 108, ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. అయినప్పటికీ ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచలేదన్నారు. ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండానే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.

ప్రస్తుత సీఎం కిరణ్‌  హయాంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. కిరణ్‌ ప్రభుత్వానికి మానవత్వం లేదు.‌ కిరణ్‌ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ కొరత వచ్చిపడిందని దుయ్యబట్టారు. విద్యుత్‌ లేక వేలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. తద్వారా 20 లక్షల మంది కార్మికులు వీధినపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. జనం నుంచి వచ్చిన సిఎం అయితే,  కిరణ్‌కు ప్రజల బాధలు తెలిసేవన్నారు. ఢిల్లీ నుంచి ఊడిపడిన సిఎం కిరణ్‌ అని ఎద్దేవా చేశారు. కరెంటు చార్జీల పెంపుతో రూ. 32 వేల కోట్లు భారం వేసి ప్రజల రక్తం పిండి మరీ వసూలు చేస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రక్షణగా నిలిచి కాపాడారని విమర్శించారు. మైనార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉండడానికి చంద్రబాబు మద్దతే కారణమన్నారు. రాబందులు రాజ్యం ఏలుతుంటే గుంటనక్కలు తాళం వేసిన చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్‌రెడ్డి ఇంత ఘోరంగా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు చప్పట్లు కొట్టి మరీ కాపాడుతున్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

ఐఎంజీ లాంటి భూముల కుంభకోణంపై విచారణ జరగకుండా చీకట్లో చిదంబరాన్ని కలిసి చంద్రబాబు మేనేజ్‌ చేసుకుంటున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. చంద్రబాబు ఇటీవల చెబతున్న మాటలను యధావిధిగా శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. 'నాకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు. స్వార్థం అంతకన్నా లేదు. పదవీ వ్యామోహమూ లేదు. లోకకల్యాణానికి నేను పనిచేస్తున్నాను. ధర్మపోరాటం చేస్తున్నాను. అవినీతి మీద పోరాటం చేస్తున్నాను. నాకు ప్రజా సేవే ముఖ్యం' అంటూ చంద్రబాబు డైలాగులు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబుకు పదవీ కాంక్ష లేకపోతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాగేసుకునేవారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన పార్టీలో హోదా ఇచ్చారని, మంత్రి పదవి కూడా ఇచ్చారన్నారు. అయినా చంద్రబాబుకు అవి సరిపోలేదని పిల్లనిచ్చిన మామకు అంత నీచంగా వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ఆయన కుర్చీని, అధికారాన్ని చంద్రబాబు లాగేసుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ పెట్టుకున్న టిడిపి నుంచీ ఆయనను చంద్రబాబు వెలివేశారని ఆరోపించారు. సిఎం పదవిపై చంద్రబాబుకు వ్యామోహం లేకపోతే ఎన్టీఆర్‌ కొడుకులను ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశారు.

సిఎం కుర్చీలో కూర్చున్న తరువాత చంద్రబాబు చేసిందేమిటంటే వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే సోమరిపోతులవుతారని అవహేళన చేశారన్నారు. స్కాలర్‌షిప్పులు ఇమ్మని కోరిన విద్యార్థులను చంద్రబాబు నాయుడు లాఠీలతో కొట్టించిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. చంద్రబాబుకు ప్రజాసేవే ముఖ్యమైతే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోయి, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరన్నారు. చంద్రబాబు దృష్టిలో వినేవాళ్ళంతా వెర్రివాళ్ళట అన్నారు. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయి, ప్రజలను గాలికి వదిలేసి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారన్నారు.

జగనన్న బయట ఉంటే తమకు మనుగడ ఉండదని, అబద్ధపు కేసులు పెట్టి కాంగ్రెస్‌, టిడిపి నాయకులు అన్యాయంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారని భరోసా ఇచ్చారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను బడికి పంపించిన అమ్మకు ఆమె ఖాతాలోనే డబ్బులు జమ చేస్తారని హామీ ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు కలను జగనన్న నెరవేరుస్తారని అన్నారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యంలో బెల్టు షాపులు మూతపడతాయని చెప్పారు. జైలులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్నను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి హామీ నెరవేరుతుందన్నారు. అందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. ఆ రోజు వచ్చే వరకు జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు.

Back to Top