కాంగ్రెస్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు

న్యూఢిల్లీ‌ :

‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత అయినా కాంగ్రెస్‌కు బుద్ధి రావాలి. ఆ పార్టీ ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయడం కోసం ఆరాటపడుతుందని కోరుకుంటున్నా. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిందే.. రేపు దేశమంతా జరుగుతుంది’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ప్రజలు, దేవుడు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి జరుగుతున్న యత్నాలకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3ని సవరించేందుకు కృషి చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతున్న శ్రీ జగన్ అందులో భాగంగా సోమవార‌ం ఇక్కడ సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్‌ (ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు.

సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ములాయంతో పార్లమెంట్‌లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ‌ఈ భేటీలో ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, పార్టీ నాయకులు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన నివాసంలో శ్రీ జగన్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ‌ఈ సమావేశంలో జేడీ(ఎస్) నేతలు డానిష్ అలీ, ఓవీ రమణ కూడా పాల్గొన్నారు. ఈ భేటీల్లో ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకత, ఆంధ్రప్రదే‌శ్ విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న‌ అడ్డగోలు తీరు, విభజనకు అసెంబ్లీ సమ్మతి లేని వైనం తదితర అంశాలను శ్రీ వైయస్‌ జగన్ సవివరంగా వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఏ రాష్ట్రాన్నైనా విభజించాలంటే అసెంబ్లీతో‌ పాటు పార్లమెంట్‌లోనూ 2/3 వంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని సవరిస్తేనే భవిష్యత్తులో ఢిల్లీ పాలకులు తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించే వీలుండదని, ఈ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పినదంతా సావధానంగా ఆలకించిన ములాయం, దేవెగౌడ ఈ సవరణకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. భేటీ అనంతరం శ్రీ జగన్, దేవెగౌడ మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరూ మౌనంగా ఉండటం మంచిదికాదు. ఎవరూ మాట్లాడకుంటే.. వారి రాష్ట్రాలు కూడా విభజనకు ఎంతో దూరం లేవనే విషయాన్ని గుర్తించాలి. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం దేశ చరిత్రలో ఇంత వరకు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సంప్రదాయాలకు భిన్నంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది’ అని‌ శ్రీ జగన్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేంద్రం విభజన నిర్ణయాన్ని తీసుకుందని, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

‌ఢిల్లీలో 272 స్థానాలున్న ఎవరికైనా రాష్ట్రాలను విభజించే అధికారం ఇస్తే.. అసెంబ్లీ తీర్మానంతో పనిలేకుండా, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్రాలను విభజించుకుంటూ పోయే ప్రమాదం ఉందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డగోలు విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ని సవరించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందుకు దేవెగౌడకు కృతజ్ఞతలు తెలిపారు.

విభజనపై తుది వరకూ పోరాటం చేస్తాం :
రాష్ట్ర విభజనను అడ్డుకోగలనన్న విశ్వాసం మీకుందా అని విలేకరులు అడిగినప్పుడు. ‘రాష్ట్ర విభజనను ఆపడానికి, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి తుది వరకు పోరాడతాం’ అని శ్రీ జగన్‌ జవాబు ఇచ్చారు. ‘మాది చిన్న పార్టీ. నేను సామాన్యుడిని. మా పార్టీకి నాతో కలిపి ముగ్గురు ఎంపీల బలమే ఉంది. ముగ్గురు ఎంపీల బలంతో మొత్తం పరిస్థితిని మార్చలేం. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటానికి మాత్రం వెనకాడం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారంతా.. గొంతెత్తాల్సిన సమయం ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నవారంతా కలసిరావాలి. జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతోంది. రేపు మరో రాష్ట్రానికి జరగవచ్చు. అందుకే అందరూ కలసిరావాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. అన్యాయానికి వ్యతిరేకంగా మీడియా కూడా నినదించాల్సిన అవసరం ఉందని శ్రీ జగన్ పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా, ప్రతి పాత్రికేయుడు కూడా అన్యాయాన్ని అడ్డుకోవడానికి గొంతెత్తి నినదించాలని కోరారు.

‌ఆర్టికల్ 3 సవరణ కోసం పాటుపడతా- దేవెగౌడ:
ఇష్టారాజ్యంగా రాష్ట్రాల విభజన జరగకుండా చూడటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిందేనని, ఈ సవరణ కోసం తాను పాటుపడతానని జేడీ(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ చెప్పారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి సవరణ ఆవశ్యకతపై శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాతో చర్చించారు. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్‌లో 2/3 వంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ ఆర్టికల్ 3కి రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరంపై మాట్లాడారు. అలాంటి సవరణ కోసం వాయిదా తీర్మానం రూపంలో ఆయన పార్లమెంట్‌లో ప్రయత్నించనున్నారు. ఈ తీర్మానం పెట్టడానికి లెఫ్టు అంగీకరించింది. నేను సహజంగానే లెఫ్టు పార్టీల మిత్రుడిని. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వారి మిత్రపక్షంగా మేమున్నాం. అందువల్ల వారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడతాను. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం’ అని దేవెగౌడ అన్నారు.

తెలంగాణ విషయంలో ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. తెలంగాణపై మీ వైఖరి ఏమిటి? అని మీడియా ప్రశ్నించగా.. ‘తెలంగాణ విషయంలో కేంద్రం నిబంధనలను ఉల్లంఘించి వెళ్తున్నది. రాష్ట్రాన్ని ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు’ అని పేర్కొన్నారు. ‘తొమ్మిదిన్నరేళ్లు వారు ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు? తమ హయాం ముగింపుకొచ్చిన సమయంలోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే మరెందు కోసం? భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించారు. ఇప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రం ఏమైంది? తెలంగాణలో తెలుగు కాకుండా మరేదన్నా భాషను మాట్లాడుతున్నారా? కోస్తాంధ్రలో మాట్లాడుతున్నది కూడా అదే భాష కదా... మరి ఇలాంటి డిమాండ్‌తో ముందుకెళ్తే మనం ఎక్కడికి పోతాం? ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆందోళనకర పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారు?’ అని కేంద్రాన్ని దేవెగౌడ నిలదీశారు.

విభజన బిల్లును అడ్డుకుంటాం- ములాయం :
సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతం రీత్యా రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్‌ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర విభజననైనా సరే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఆంధ్రప్రదేశ్ విభజనను సైతం అదే తరహాలో వ్యతిరేకిస్తామని ఆయన‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితో భేటీ సందర్భంగా అన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తమ పార్టీ పార్లమెంటులో అడ్డుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 3 సవరణ కోసం జరిపే పోరాటంలో కలసిరావడానికి ఇప్పటికే  సిద్ధమైన పలు పార్టీలతో కలిసి తాము కూడా పోరాడతామని ములాయం హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top