సోనియా చేసిన అన్యాయం దేశమంతా చూడాలి

న్యూఢిల్లీ‌, 11 డిసెంబర్ 2013:

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ‌లు తమ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపైనే అవిశ్వాసం ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ తాము కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియా గాంధీ చేసిన అన్యాయాన్ని ఈ దేశం మొత్తం చూడాలని, వీలైతే ప్రపంచం కూడా చూడాలని శ్రీ వైయస్ జగ‌న్ అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానానికి తాము పట్టుబడతామని ఆయన వివరించారు.

అవిశ్వాసం పెట్టడం తెలుగు ప్రజల నిరసనకు నిదర్శనమని, సమైక్య ఆంధ్రప్రదేశ్ మినహా మ‌రొకటి మాకు అంగీకారం కాదని వైయస్ జగ‌న్ అన్నారు. సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టారంటే సోనియా తమ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో అర్థమవుతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. 70 రోజుల్లో సార్వత్రిక ఎన్నిక‌లు వస్తాయని అందరికీ తెలుసని, అయినా అవిశ్వాసం పెట్టామంటే అది తమ ఆవేదనకు నిదర్శనమని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా సోనియాపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నామని ఆయన అన్నారు.

అవిశ్వాసం విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాన్ని శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. టీడీపీలో సొంత పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ కూడా అవిశ్వాసానికి మద్దతు పలకలేదని, అసలు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు పార్లమెంటులోనే లేరని విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వమంటే చంద్రబాబు ఇవ్వలేదని, అలాగే అవిశ్వాసానికి మద్దతు చెబుతామంటూ పార్టీ తరఫున అధికారికంగా కూడా లేఖ ఇవ్వలేదని శ్రీ జగన్ అన్నారు. కానీ తాను దానిపై వ్యాఖ్యానించబోనని, ఆ పార్టీ సభ్యులంతా అవిశ్వాసాన్ని బలపరచాలని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top