అవినీతిని ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు

బాబు పాలన రౌడీయిజం
వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు

రేపల్లె: టీడీపీ ప్రభుత్వం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై దుష్పచారం చేస్తుండటం తగదని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలంలోని బొబ్బర్లంక గ్రామంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో లోటుపాట్లుపై విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిందన్నారు. అభివృద్ధికి ఎవరూ అడ్డుకాదని, లోటుపాట్లపై విమర్శిస్తున్న ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ గ్లోబల్‌ ప్రచారాలు నిర్వహించడం తగదన్నారు. అవినీతిపై విమర్శించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురిచేయడం, వారి గొంతునొక్కేయడం, రౌడీయిజం చేయడం పరిపాటిగా మారిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలో వచ్చే కమీషన్ల కోసమే ప్రత్యేకహోదా తిరస్కరిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను కేంద్ర ప్రభుత్వం కాళ్ళవద్ద తాకట్టుపెడుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖపట్నంలో శాంతియుతంగా చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమానాశ్రయంలో నిర్భందం చేయించడం చంద్రబాబు రౌడీయిజానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం తప్పులుమీద తప్పులు చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. అభివృద్ధి చేసేవారు ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయాందోళనకు గురిచేయడం తగదన్నారు. ఇకనైనా వ్యక్తిగత స్వార్థాల కోసం పని చేయడం మానుకొని రాష్ట్ర భవిష్యత్‌ కోసం, రాష్ట్ర ప్రజల కోసం బాబు సర్కార్‌ పని చేయాలని సూచించారు.

ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు
ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్‌ ముడిపడి ఉందని మోపిదేవి వెంకట రమణారావు స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డీ అనే కుగ్రామం కేవలం 500ల జనాభాను మాత్రమే కలిగి ఉండేదని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడంతో ఎకనామిక్‌ జోన్‌గా మారిందన్నారు. అనేక పరిశ్రమలు నెలకొల్పబడి అనేక మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. కొంత మంది టీడీపీ నాయకులు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

జర్నలిస్ట్‌లపై దాడులు హేయనీయం
ప్రభుత్వానికి, సమాజానికి వారధిగా ఉంటూ, సమాజంలో అవినీతిని వెలికితీస్తూ, ప్రభుత్వ ఉన్నతిని చాటిచెప్పే పత్రికా విలేకరులపై టీడీపీ నాయకులు రౌడీయిజం చేయడం శోచనీయమని మోపిదేవి వెంకట రమణారావు మండిపడ్డారు. ఎక్కడైనా తమకు కావాల్సిన సమాచారం పొందే హక్కు విలేకర్లకు ఉంటుందని, అటువంటి వారిపై దాడులకు దిగటం శోచనీయమన్నారు. మహిళలపై, పేదలపై టీడీపీ నాయకులు దాడులు చేయడం మానుకుని అభివృద్ధి దిశగా పయనించాలని సూచించారు. లేనిపక్షంలో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరించారు.
Back to Top