లోకేష్‌ స్థిరీకరణ నిధికి పోలవరాన్ని కొల్లగొడుతున్న బాబునామినేషన్‌ల ద్వారా సీఎం అనుచరులకు కాంట్రాక్ట్‌లు
కమీషన్లు ఇవ్వడం లేదని ప్రస్తుత కాంట్రాక్టర్ల తొలగింపు
నామా నాగేశ్వర్‌రావు కంపెనీని ఎందుకు తొలగించలేదు బాబూ
ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా
చంద్రబాబుకు సవాలు విసిరిన ఎంవీఎస్‌ నాగిరెడ్డి
2018లో గ్రావిటీతో నీరిస్తానని మళ్లీ పురుషోత్తపట్నం ఎందుకు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు తన కొడుకుకు రాజకీయ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి కొల్లగొడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పటి వరకు ఉన్న కాంట్రక్టర్‌లను తొలగించి చంద్రబాబు తనకు అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్‌లను నామినేషన్‌ పద్ధతిలో ఇస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయే నాటికి పోలవరం రైట్‌ కెనాల్‌ 80 శాతం పూర్తి చేశారని, అదే విధంగా లెఫ్ట్‌ కెనాల్‌ నిర్మాణ పనులను రూ. 1471 కోట్లతో మొదలు పెట్టారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2016 డిసెంబర్‌ 6న లెఫ్ట్‌ కెనాల్‌ అంచెనాలను రూ.3645 కోట్లకు పెంచారన్నారు. అది చాలదన్నట్లు మళ్లీ రూ. 4960.8 కోట్లకు పెంచారన్నారు. ఎగ్జిస్టింగ్‌ కాంట్రాక్ట్‌లందరినీ 60సీ నిబంధన కింద తొలగించేస్తున్నారని, వారి స్థానాల్లో టీడీపీ నేతలను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను కాంట్రాక్టర్‌గా నియమించారని, పుట్టా సుధాకర్‌కు, యనమలకు తెలుగుదేశం పార్టీ కాదని ప్రకటిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. 

టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకు నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్ట్‌లు ఇస్తూ ఎంత దోపడీ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. ఇప్పటి వరకు ఉన్నవారంతా కమీషన్లు ఇవ్వలేదని తొలగించారా చంద్రబాబూ అని నిలదీశారు. నామా నాగేశ్వర్‌ కంపెనీని తొలగించిన కాంట్రాక్టర్‌ల జాబితా నుంచి ఎందుకు తీసివేయలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే విధంగా చేశారని, రూ. 8 కోట్లతో నిర్మించాల్సిన పనులకు రూ. 80 కోట్ల నుంచి 90 కోట్లుకు పెంచి నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ వారికి కట్టబెట్టారని ఆరోపించారు. 

రాష్ట్రంలో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టులను నామినేషన్‌ పద్ధతిలో ఇస్తూ కోట్ల డబ్బును దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. శ్వేతపత్రం అడిగిన వారు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ప్రజలు, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు పబ్లిక్‌ చర్చ అడిగితే.. ధైర్యంగా వైయస్‌ఆర్‌ చర్చ పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి మారుతి, కాంగ్రెస్‌ నుంచి సీతాపతిరావు రిటైర్డ్‌ ఇంజినీర్‌ను పంపించి వైయస్‌ఆర్‌ చర్చ జరిపించారన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి, పారదర్శకత ఉన్నా.. బహిరంగ చర్చ నిర్వహించాలని నాగిరెడ్డి సవాలు విసిరారు. మా పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు.. మీ పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులను పంపించాలని డిమాండ్‌ చేశారు. దీనికి చంద్రబాబు మాత్రమే సమాధానం చెప్పాలి కానీ, ఆయన తాబేదారులు కాదన్నారు. ఛాలెంజ్‌ను అంగీకరిస్తున్నానని మీకు ఇష్టమైన ప్రాంతంలో చర్చ పెట్టాలన్నారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును దోపిడీ ప్రాజెక్టుగా మార్చేశారని, మీరు దోపిడీ దారులు కాదని చర్చకు వచ్చి నిరూపించుకోవాలని సూచించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఇస్తున్న అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

పోలవరం ప్రాజెక్టు కేంద్రం డబ్బులతో యుద్ధ ప్రాతిపదికన జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ అన్నారు. అంతే కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసి ప్రజలపై భారం మోపొద్దు అని హెచ్చరించారు. 25.72 మీటర్ల ఎత్తు క్రస్ట్‌ నిర్మాణం జరగాలి. దాంట్లో రోజుకు అర్ధ మీటర్‌ ఎత్తు కాంక్రీట్‌ మాత్రమే వేయాలి. కానీ ఒక మీటర్‌ వేస్తున్నారు. దీంతో నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందని రిటైర్డ్‌ ఇంజినీర్లు చెబుతున్నారని ప్రభుత్వానికి సూచించారు. రాజధానిలో నుంచే నంద్యాలలో వీధి దీపాలు వెలుగుతున్నాయా.. లేదా.. అని చెప్పే చంద్రబాబు.. సోమవారాన్ని పోలవరంగా మార్చకున్న సీఎం ప్రాజెక్టు నిర్మాణంలో వాస్తవాలు దాచిపెట్టి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. పోలవరంలో ఇప్పుడు జరిగిన పని ఎంత..? జరగాల్సిన పని ఎంతో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2018 నాటికి గ్రావిటీతో నీళ్లు ఇస్తానని చెప్పి మళ్లీ ఇప్పుడు రూ. 2 వేల కోట్లతో పురుషోత్తపట్నం ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. 

ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వకపోవడంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు, ఉత్పత్తులు, మద్దతు ధర అన్ని పడిపోయాయన్నారు. వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ వంక చూడకుండా తన కొడుకు కోసం రూ. 58 కోట్ల పోలవరాన్ని కొల్లగొట్టి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top