ఏపీని అడుక్కునే రాష్ట్రంగా మార్చాడు

  • బాబు పాలనలో కరువు కాటకాలతో రైతన్న అవస్థలు
  • అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి వైయస్ఆర్ పరిపాలన
  • బాబు దిగిపోతే తప్ప కరువు పోదు
  • వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
గుంటూరు: దేశానికే అన్నం పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడుక్కునే రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన చేశాడని కొనియాడారు. ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి ఉన్నాడులే అని వైయస్‌ఆర్‌ భరోసా ఇవ్వగలిగాడన్నారు. అందుకనే వైయస్‌ఆర్‌ ప్రజల మనస్సులో చిరంజీవిగా మిగిలిపోయాడని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతుందన్నారు. బాబు దిగితే తప్ప రాష్ట్రంలో కరువుపోదని స్పష్టం చేశారు. బాబు హయాంలో రాష్ట్రంలో 107 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు పడిపోయాయన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రికార్డులు సృష్టిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. గత సంవత్సరం 359 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి 12 శాతం వృద్ధి రేటు సాధించానని, ఈ ఏడు 301 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి 14 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆహార, పప్పు ధాన్యాల ఉత్పత్తులు రికార్డు స్థాయిలో పడిపోయాయని లెక్కలతో సహా వివరించారు. వరి పంట సరిగా పండక పశుగ్రాసం దొరక్క పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏ జిల్లాకు అయితే చంద్రబాబు వస్తారో ఆ జిల్లా కరువు కాటకాల్లోకి వెళ్లిపోతుందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నా ప్రభుత్వం కళ్లు తెరవకుండా నిద్రపోతున్నట్లు నటిస్తోందన్నారు. పంటలు పండక అన్నదాత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నాడన్నారు. దినసరి కూలీలుగా ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారన్నారు. కూలి దొరక్క కొంత మంది రైతులు బిక్షాటన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను పట్టించుకోకుండా గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుందని మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top