హత్యాయత్నం వెనుక బాబు హస్తం ఉంది

  • అభిమాని ముసుగులో ఉన్న కిరాయి హంతకుడు శ్రీనివాసరావు
  • వైయస్‌ జగన్‌ను అంతం చేయడానికి పెద్ద పథకం వేశారు
  • త్వరలో హంతక ముఠా గుట్టురట్టు కానుంది
  • నీ ప్రమేయం లేకపోతే సీబీఐ అంటే భయమెందుకు బాబూ?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత మహ్మద్‌ ఇక్బాల్‌
విజయవాడ: అభిమాని ముసుగులో ఉన్న కిరాయి హంతకుడు శ్రీనివాసరావు చేత ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేయాలని చూశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ మండిపడ్డారు. హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. బాబు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహ్మద్‌ ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ క్రియాశీలక నాయకుడు హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరికి సంబంధించిన ప్యూజన్‌ రెస్టారెంట్‌లో నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్నాడని, వైయస్‌ జగన్‌ను హత్య చేసేందుకు రెండు కత్తులు తీసుకొచ్చాడని ఎఫ్‌ఐఆర్‌లో క్లియర్‌గా ఉందన్నారు. డాక్టర్లు శస్త్ర చికిత్సలకు ఉపయోగించే సర్జికల్‌ బ్లేడ్స్‌ ఉన్నాయని, మొదట పందెం కోడి కత్తితో దాడి చేసిన నిందితుడికి రెండవ కత్తి ఉపయోగించడానికి సమయం దొరకలేదని రిపోర్టులో స్పష్టంగా ఉందన్నారు.  

త్వరలోనే హంతక ముఠా గుట్టు రట్టు కానుందని మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రులు, ముఖ్యమంత్రి డ్రామాగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లో హత్యాయత్నం విఫలం కాకుండా భారీ ఎత్తున పథకం పన్నారని, అదృష్టవశాత్తు వైయస్‌ జగన్‌ తప్పించుకోవడంతో భుజానికి బలమైన గాయమైందన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు. పథకం ఎవరు రచించారు అనేది త్వరలో బయటపడుతుందన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసిన చంద్రబాబు హత్యాయత్నం ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే మీరు నిప్పో, బొగ్గో తేలుతుందన్నారు. న్యాయస్థానంలో ప్రతిసారి షర్టు ఇవ్వలేదు, ఆస్పత్రికి వెళ్లలేదు, వైయస్‌ జగన్‌ ఇంటికి వెళ్లి ఆస్పత్రికి వచ్చారని అబద్ధాలు చెబుతున్నారన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబు హస్తం ఉందని వైయస్‌ జగన్‌ చెప్పారని, సీబీఐ ఎంక్వైరీకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

కేంద్రం ఇచ్చిన నిధుల్లో అవినీతి, ఫోన్ల కొనుగోలులో అవినీతి, రాజధాని భూముల్లో అవినీతి, ఒక ప్రెస్‌కు రూ. 700 కోట్ల కేటాయింపు ఇలాంటి అవినీతి భాగోతాలను ఎవరు తేల్చాలని మహ్మద్‌ ఇక్బాల్‌ చంద్రబాబును ప్రశ్నించారు. సీబీఐని రానివ్వకుండా జీఓ జారీ చేసిన చంద్రబాబు ఇంటర్‌పోల్‌కు ఇస్తారా..? అని నిలదీశారు. ఆరు నెలల పాటు ఈడీ సోదాలు, ఐటీ సోదాలు ఆపేయాలంటే జీఓ జారీ చేశాడని మండిపడ్డారు. అవినీతి సంపాదన అంతా ఎన్నికల్లో ఖర్చు చేయడానికి మరో కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రూ. 500 కోట్లు ఇస్తారంటేనే చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని కథనాలు వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తన పార్టీ నేతలతో తగలబెట్టించిన చంద్రబాబు ప్రతిపక్షంపై నెపం మోపి నేటికీ విచారణ చేయకుండానే కేసు క్లోజ్‌ చేయించారన్నారు. అదే విధంగా తునిలో రైలు దహనం చేయించి ప్రతిపక్షంపై నెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడన్నారు. 

పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటూ డాంబికాలు పలుకుతున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా రాజ్యాంగ విలువలను ఖూనీ చేశాడని మండిపడ్డారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ అభిమాని చేశాడని తప్పుడు సంకేతాలు ఇచ్చాడన్నారు. చంద్రబాబు కూడా తప్పుడు స్టేట్‌మెంట్లతో విచారణ పక్కదోవపట్టించేలా జడ్జిమెంట్‌ ఇచ్చారన్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. టీడీపీ నేత కళా వెంకట్రావు పవన్‌ కల్యాణ్‌ వట్టి రవి ఇంట్లో కూర్చొని సీట్ల పంపకం గురించి మాట్లాడుతున్నారని చెప్పారని, ఇది ఎవరు చెప్పారు.. మరీ కళా వెంకట్రావును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టు ఆధారంగా ప్రెస్‌మీట్‌లో ప్రసంగించిన జోగి రమేష్‌పై అక్రమంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ పరిణితి చెందిన నాయకుడిలా మాట్లాడడం లేదని, కులాల ప్రస్తావన వద్దంటూనే కుల రాజకీయాలు చేస్తున్నాడని ఇక్బాల్‌ మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ కులాల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. అన్ని కులాలను వైయస్‌ జగన్‌ గౌరవిస్తారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో కులాలు, మతాల ప్రస్తావనే ఉండదన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ పోకడ ఉందని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా పవన్‌ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 
 
Back to Top