హైదరాబాద్ :
సమైక్యతపై అభిప్రాయం వెల్లడించాలని అడిగితే తన భండారం బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవకుండా తప్పించుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా రెండు నాల్కల ధోరణి విడిచిపెట్టి తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ఈ మేరకు సుచరిత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘రాష్ట్ర ప్రజల మనోభావాలు, రాజ్యాంగ సంప్రదాయాలన్నింటినీ కేంద్రం తుంగలో తొక్కుతోందంటూ ఇటీవల రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా మన రాష్ట్రానికి వచ్చినా చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ కూడా స్వయంగా కలసి వివరణ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలి’ అని సుచరిత డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలక బిల్లులు రాష్ట్రపతి ద్వారానే వెళ్తాయనే విషయం తెలిసినా చంద్రబాబు ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు. ప్రధాని, రాష్ట్రపతి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదంటూ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారంనాడు ప్రణబ్‌ను కలిసినప్పడు చంద్రబాబు ఎందుకు వారితో పాటు వెళ్లలేదని సుచరిత నిలదీశారు. సమైక్యాంధ్ర విషయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే ఆ పార్టీకి, ప్రజాప్రతినిధులకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని మేకతోటి హెచ్చరించారు.