కిరణ్‌ పాలనలో రాష్ట్రంలో అన్నీ బంద్!

నిడదవోలు (ప.గో.జిల్లా),

2  జూన్‌ 2013: కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో మన రాష్ట్రంలో అన్నీ బంద్‌ అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు నీళ్ళు బంద్. విద్యార్థులకు చదువులు బంద్. ఇళ్ళు, పరిశ్రమలకు కరెంటు బంద్. కార్మికులకు ఉపాధి బంద్. రాష్ట్రానికి అభివృద్ధి బంద్‌. రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి బంద్‌. ఇదీ మన రాష్ట్రంలో ఉన్న దుస్థితి  అని శ్రీమతి షర్మిల కిరణ్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కరెంటు నిల్... బిల్లు ఫుల్‌ అన్న రీతిలో ఈ ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆదివారంనాడు శ్రీమతి షర్మిల పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడో మానేశారని శ్రీమతి షర్మిల విమర్శించారు. అందుకే ఆయన వసూల్‌ రాజాగా మారారని ఆరోపించారు. ఆర్టీసీ చార్జీలను ఇప్పటికే మూడుసార్లు పెంచారని, ఎరువుల ధరలను పదిసార్లు పెంచారని, వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.305 నుంచి రూ. 440 చేశారని దుయ్యబట్టారు. అది కూడా సబ్సిడీ ఉంటేనే అని లేకపోతే ఒక్కో సిలిండర్‌ను ఏకంగా వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు బిల్లులైతే మూడింతలు, నాలుగింతలు వస్తున్నాయని రాష్ట్ర ప్రజలంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. సంపాదించుకున్న సొమ్మంతా ఇలా చార్జీలకే సరిపోతే ఇక ఏం తినాలని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారన్నారు. అన్నింటికీ పన్నులు వేస్తున్న ఈ ప్రభుత్వం ఇక తల మీద ఉన్న జుట్టుకు కూడా పన్ను వేస్తుందేమో అని ఒక మహిళ ఆందోళన వ్యక్తంచేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటే ఇప్పుడు 9 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేవారన్నారు. కిరణ్‌ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా కరెంటు ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. వేలాది పరిశ్రమలు మూతపడిపోయి లక్షలాది మంది కార్మికులు కుటుంబాలతో వీధినపడ్డారని విచారం వ్యక్తంచేశారు. ఈ పాపం కిరణ్‌రెడ్డి ప్రభుత్వానికి కాదా అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్షాలూ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన నిలబడకుండా ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఇప్పుడు మనకు కరెంటు చార్జీల భారం, చార్జీల మోత ఉండేదే కాదన్నారు. కాంగ్రెస్‌ది తుగ్లక్‌ పాలన అంటూనే ఒక్క రోజు కూడా అది అధికారంలో కొనసాగే అర్హత లేదంటూనే... కత్తులు, గొడ్డళ్ళతో ఈ ప్రభుత్వాన్ని చంపేయండి అంటూ దానితో నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. అలాంటి చంద్రబాబును నాయకుడంటారా? లేక ఊసరవెల్లి అంటారా? అని వ్యాఖ్యానించారు.

ప్రతి సంవత్సరం కరెంటు చార్జీలు పెంచుతామని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని సంతకం పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడని శ్రీమతి షర్మిల విమర్శించారు. స్కాలర్‌షిప్‌లు అడిగిన విద్యార్థులపై లాఠీలు ఝళిపించింది చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ చార్జీలు కట్టలేకపోయిన రైతులను అరెస్టులు చేయించారన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు చెల్లించలేక రైతులు అల్లాడిపోతున్నారని, చార్జీలు తగ్గించాలంటూ దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి దీక్ష చేస్తే ఆఖరి రోజున రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించి చంపించింది చంద్రబాబు నాయుడని దుమ్మెత్తిపోశారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరినీ చంద్రబాబు నాయుడు పురుగుల్లా చూశారన్నారు.

మహానేత వైయస్‌ ప్రతి ఒక్కరూ బాగుపడాలని ఆలోచించారని శ్రీమతి షర్మిల తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చేసి ఉన్నత చదువులు చదువుకోవడానికి సహాయపడ్డారన్నారు. ధనవంతులు మాత్రమే వెళ్ళగలిగే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వారితో సమానంగా పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు, పన్నులు పెంచకుండానే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా మహానేత వైయస్‌ పేరు పొందారన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మానవత్వం లేదు. ఈ జూన్‌ నెలలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభం అవుతుంది. కానీ ఇంత వరకూ వ్యవసాయానికి నీళ్ళివ్వడంలేదు. ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకురాలేదు. దీనితో మార్కెట్‌లో నకిలీ విత్తనాలు నాట్యం చేస్తున్నాయి. దిక్కులేని స్థితిలో రైతులు ఆ నకిలీ విత్తనాలనే కొని నిలువెల్లా మోసపోతున్నారన్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ ఉండదని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజారాజ్యం పార్టీకి ఓటు వేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్ళను చేసి చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా అమ్ముడుబోయారన్నారు. అలాగే టిడిపికి ఓటు వేసిన కోట్లాది మందిని కూడా అలాగే మోసగించి తెరచాటున అమ్ముడుపోయారని విమర్శించారు. చిరంజీవికి, చంద్రబాబుకు ఎలాంటి తేడా లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయిన చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత, న్యాయం, ధర్మం అనే వాటికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు, కాంగ్రెస్‌ నాయకులకూ లేదని తూర్పారపట్టారు. అందుకే జగనన్నను అణగివేయాలని సిబిఐని ప్రయోగించి, దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్నను ఎవరూ ఆపలేరన్నారు.

చంద్రబాబు నాయుడు రోజు రోజుకూ విశ్వసనీయత కోల్పోతున్న కారణంగానే టిడిపిలో విశ్వసనీయ ఉన్న నాయకులు దానిలో ఇమడలేక, చంద్రబాబుపై నమ్మకం చచ్చిపోయి, తమ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక ఆ పార్టీని విడిచిపెడుతున్నారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. కృష్ణబాబు, బొడ్డు భాస్కర రామారావు లాంటి పలువులు నాయకులు అలా టిడిపిని వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినవారే అన్నారు. చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోవడం, జగనన్న విశ్వసనీయతను రుజువు చేసుకోవడమే వారి నిర్ణయానికి కారణం అని శ్రీమతి షర్మిల విశ్లేషించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా టిడిపిని ఎన్టీఆర్‌ స్థాపించారో అదే పార్టీతో చంద్రబాబు ప్రతిసారీ కుమ్మక్కయ్యారని దుమ్మెత్తిపోశారు. విశ్వసనీయత లేని చంద్రబాబుకు విలువల గురించి ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు.

జగనన్న సిఎం అయిన వెంటనే గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులను చేపడతారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు డెల్టా ఆధునికీకరణకు రూ. 15 వందల కోట్లు మంజూరు చేసి, పనులు కూడా ప్రారంభించారని శ్రీమతి షర్మిల తెలిపారు. డెల్టాను ఆధునికీకరిస్తే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షలాది మంది రైతులు బాగుపడతారని మహానేత వైయస్‌ పనులు ప్రారంభించారన్నారు. అయితే, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన పాలకులు డెల్టా ఆధునికీకరణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించి పనులు పూర్తిచేయమని కోరినా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు.

జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను స్థిరీకరించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్‌ ఇస్తారని భరోసా ఇచ్చారు. రాజన్న రూపొందించిన ప్రతి పథకాన్నీ జగనన్న అమలు చేస్తారని హామీ ఇచ్చారు. రాజన్న అమలు చేసిన పథకాలనే తానూ అమలు చేస్తానంటూ చెబుతున్న చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని నిలదీశారు. మహానేత రాజన్న రుణాలు మాఫీ చేసి చూనిస్తే.. ఇప్పుడు తానూ చేస్తానని చంద్రబాబు చెప్పడాన్ని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. తన హయాంలో రుణ మాఫీ కాదు కదా కనీసం రుణాలపై వడ్డీ మాఫీ గురించి కూడా చంద్రబాబు ఆలోచన చేయని వైనాన్ని ఆమె గుర్తుచేశారు.

Back to Top