- ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు సుజనాతో కాళ్ల బేరం
- వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా బుక్ అయ్యిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు రూ.500 కోట్ల ముడుపులు అందజేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భుమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి..ఈ రోజు గవర్నర్ నరసింహన్‌తో అత్యవసర సమావేశం కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును బయటపడేసేందుకు సుజనా కాళ్ల బేరానికి వెళ్లాడని ఆరోపించారు. అందరికీ రాజకీయ పాఠాలు నేర్పుతానని ప్రగల్భాలు పలికే రాజకీయ పిఠాధిపతి చంద్రబాబు అడ్డదారిలో ఎమ్మెల్సీ సీటు గెలుపొందేందుకు తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ పట్టుపడటం సిగ్గుచేటన్నారు. ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్లు బాబు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. న్యాయవ్యవస్థ అంటే ఆయనకు గౌరవం లేదని ఆక్షేపించారు. అప్పట్లో చంద్రబాబును ఎవరు కాపాడలేరని బీరాలు పలికిన అగ్నిహోతుడిని అని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.