కష్టాలు తీర్చే తీరిక ప్రభుత్వానికి లేదు: నాని

ఏలూరు:

పేదల కష్టాల గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వానికి లేదని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని విమర్శించారు. జగన్ సీఎం అయితేనే ప్రజల కష్టాలు తీరతాయని ఆయన స్పష్టంచేశారు. ప్రజా సమస్యలపై నాని చేపట్టిన పాదయాత్ర మూడోరోజున పోణంగి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ తర్వాత ప్రజల కష్టాలు పట్టించుకునే వారే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించే శక్తి సామర్థ్యాలు కలిగిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆళ్ల నాని పాదయాత్ర ప్రారంభించారు. ఏలూరు మండలంలోని చొదిమెళ్ల, కొమడవోలు గ్రామాల్లో బుధ,గురువారాల్లో పర్యటించారు. చొదిమెళ్ల గ్రామ కూడలిలో నిర్మించిన వైయస్ఆర్ విగ్రహాన్నినాని ఆవిష్కరించారు.  ఏలూరు అసెంబ్లీ పరిధిలోని 10 వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని అప్పట్లో మహనేత వైయస్ రాజశేఖరరెడ్డిని కోరిందే తడవుగా కోట్లాది రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 8 వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడాది నుంచి కోరుతున్నా, ఇప్పటి వరకూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి కనీస స్పందనలేదని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇవ్వలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు తమ పదవులు కాపాడుకునేందుకు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా త్వరలో బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  నాని పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగున ప్రజలు వైఎస్సార్‌సీపీ జెండాలను చేతబూని వైయస్‌ఆర్ జోహార్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

తాజా వీడియోలు

Back to Top