కేటాయింపులు నామమాత్రం.. బాబు తీరు ఘోరం

అమృతలూరు, 19 మార్చి 2013: 

ఎలాగు తామూ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని శ్రీమతి వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా అమృతలూరులో ఏర్పాటుచేసిన పెద్ద బహిరంగ సభలో రాష్ట్ర బడ్జెట్ తీరుపై విమర్శలు కురిపించారు. ఆమె ప్రతి మాటకు ప్రజలు కేరింతలు కొట్టారు. ఒకానొక సమయంలో ఆమెకు రెండు నిముషాలపాటు మాట్లాడేందుకు అవకాశమీయకుండా హర్షాతిరేకాలను చప్పట్లుర ఈలలతో వ్యక్తం చేశారు. రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ అని ఊరించి  చివరకు కేవలం 100 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి మాత్రమే ఇచ్చారని తెలిపారు. జగనన్న రైతులకు 3 వేల కోట్ల రూపాయలతో నిధులు ఏర్పాటు చేస్తాననన్న విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న ఆలోచనకు, ఈ ప్రభుత్వ ఆలోచనకు చాలా తేడా ఉందని ఆమె వివరించారు. వ్యాట్ పేరుతో 10 వేల కోట్ల రూపాయల పన్నులను ప్రజలపై రుద్దేందుకు ఈ సర్కారు  సిద్ధమయిందని మండిపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాగు నీరు, విద్యుత్తు రంగాలకు నిధులను నామమాత్రంగా కేటాయించారని విమర్శించారు.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ రెక్కల కష్టంపై ఏర్పడిన ఈ ప్రభుత్వం కనీసం చివరి బడ్జెట్లోనైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తారనుకున్నామని ఆశించామన్నారు. 2009లో మహానేత ఇచ్చిన హామీలను చివరి బడ్జెట్లోనూ మరిచారని విమర్శించారు. ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఆ పాపం చంద్రబాబుదేనన్నారు.  రాష్ట్ర ప్రజలంతా ఈ తుగ్లక్ ప్రభుత్వం వద్దనుకుంటున్నారని చెప్పారు. 3 గంటలకంటే ఎక్కువగా విద్యుత్తు సరఫరా చేయడంలేదన్నారు. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఎరువుల ధరలను వైయస్ఆర్ పెంచలేదనీ, ఆయన హయాంలో పావలా వడ్డీకే రుణాలిచ్చారనీ గుర్తు చేశారు.  మంచినీటిని కూడా కొనుక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.
నీళ్ళు రాకపోతే ఎలా బతకాలని రైతులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారనీ, ఈ పరిస్థితికి చాలా బాధగా ఉందనీ ఆమె చెప్పారు. ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న శ్రద్ధ తెలియపరచడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలనీ ఆమె ప్రశ్నించారు.

తొమ్మిది గంటల విద్యుత్తు ఇస్తామనీ, చార్జీలు పెంచమనీ, ముప్పై కిలోలు బియ్యం ఇస్తామనీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2009 ఎన్నికలలో మహానేత వాగ్దానం చేశారన్నారు. ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం చివరి బడ్జెట్లోనైనా ఆయన వాగ్దానాలకు విలువనీయలేదన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చివరి బడ్జెట్ అని శ్రీమతి షర్మిల స్పష్టం చేశారు. మహానేత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన వాగ్దానాలను మరిచిన వీరిని నాయకులంటారా లేక అవకాశవాదులంటారా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో రైతులకు గానీ, ఏ వర్గానికి గానీ ఏలాభమూ ఒనగూరలేదన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన వ్యవసాయ దిగుబడులు 107 లక్షల టన్నులుంటే, మహానేత అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల 204 లక్షల టన్నులకు తీసుకెళ్ళారని శ్రీమతి షర్మిల వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల అది 170 లక్షల టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం  చేశారు. దీనిని బట్టే రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ వెల్లడవుతోందన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నీటి వనరుల కోసం ఇంకుడు గుంతలు తవ్విస్తే, మహానేత తన హయాంలో భారీ నీటి ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు నీరందేలా యత్నాలు మొదలుపెట్టారనీ, అది వారిద్దరి మధ్య తేడాయని ఆమె చెప్పారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వ్యవసాయ ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని జగనన్న చెబితే కిరణ్ కుమార్ రెడ్డి తన బడ్జెట్లో పక్కన పెట్టింది వంద కోట్లనీ అదీ జగనన్నకూ , కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య తేడా అని విశ్లేషించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎరువుల ధరను పది సార్లు పెంచిందనీ, గ్యాస్, తదితరాల పరిస్థితీ ఇంతేనని చెప్పారు. ప్రజల రక్తం పిండి విద్యుత్తు సర్చార్జీ వసూలు చేయాలని అనుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు, 108, తదితరాలపై ఈ బడ్జెట్ భరోసా కల్పించడం లేదరన్నారు. ముఖ్యమంత్రిగారు సొంత తెలివితేటలు ఉపయోగించి కొత్త పథకాలు పెట్టనక్కరలేదనీ, కేవలం రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేస్తే చాలనీ శ్రీమతి షర్మిల సూచించారు.

స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను సర్కారుకు తాకట్టుపెట్టిన చంద్రబాబును నాయకుడంటారా దుర్మార్గుడంటారా అని ఆమె ప్రశ్నించారు. సొంత మామని వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రజాస్వామ్యం సాక్షిగా ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచి చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. ఈ ప్రజా ప్రతివ్యతిరేక ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడినందుకు ప్రజలు చంద్రబాబును ఎన్నటికీ క్షమించరని స్పష్టంచేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 15మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలు నిర్వహించే ధైర్యముందా అని ఆమె సవాలు విసిరారు. కిందటి ఉప ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు జగనన్న నిర్దోషని తీర్పిస్తారేమోనని వారికి భయమని వ్యాఖ్యానించారు. జగనన్నే తమకు ముఖ్యమంత్రి కావాలని ముక్తకంఠంతో తీర్పిస్తారని కూడా భీతిల్లుతున్నారన్నారు. అందుకే వీరు ఎన్నికలకు వెళ్ళరన్నారు. ఎక్కడా లేనివిధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒక్కటయ్యారంటే వారి కుమ్మక్కు ఎంత బలంగా ఉందో అర్థమవుతోందన్నారు. తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని  ఆ రెండు పార్టీలు కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారని ధ్వజమెత్తారు.
తొలుత వేమూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర మంగళవారం సాయంత్రం తురుమెళ్ల చేరుకుంది.  శ్రీమతి షర్మిలకు అభిమానులు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తురుమెళ్లలో మహానేత  వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు. అక్కడి నుంచి అమృతలూరుకు బయలుదేరారు.

బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల 97వ రోజు పాదయాత్ర ముగించి రాత్రి బసకు చేరుకున్నారు. మంగళవారం ఆమె 14.1 కి.మీ నడిచారు. ఇంతవరకూ 1307 కిలోమీటర్లు నడిచారు.

Back to Top