జగనన్నపైనా అదే విశ్వసనీయత

ఎర్రగుంట (ఖమ్మం జిల్లా), 8 మే 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న విశ్వసనీయతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపైన ప్రజలకు ఉందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలలో ఎవరు మంచివారో, ఎవరు ప్రజల గురించి మంచి ఆలోచన చేశారో అని అడిగితే చిన్నపిల్లలు కూడా చెబుతారన్నారు. మన రాష్ట్ర ప్రజలు మళ్ళీ రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారంటే.. దానికి కారణం రాజశేఖరరెడ్డి చేసిన మంచిపనులే అన్నారు. దానికి కారణం మహానేత రాజశేఖరరెడ్డి సంపాదించుకున్న విశ్వసనీయత అన్నారు. అదే విశ్వసనీయత, అవే విలువలు మళ్ళీ జగనన్నలో చూశారు గనుకనే రాజన్న రాజ్యం తెచ్చే సత్తా శ్రీ జగన్మోహన్‌రెడ్డికే ఉందని ప్రజలు నమ్మారన్నారు. అందుకే జగనన్నను రాజన్న వారసుడిగా వారంతా చూస్తున్నారన్నారు. ఈ విషయం కాంగ్రెస్‌, టిడిపి నాయకులు, చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎర్రగుంటలో బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

బ్యాంకు ముఖం కూడా చూడని మహిళలు రాజన్న హయాంలో బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. విద్యార్థులను మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలా చూశారన్నారు. విద్యార్థులు కూడా ఆయనను కన్నతండ్రి స్థానంలో చూశారన్నారు. పేదరికం, డబ్బులేని కారణంగా ఏ ఒక్కరి చదువూ ఆగిపోకూడదని ఆ మహానేత ఫీజు రీయింబర్సుమెంటు చేశారన్నారు. నిరుపేదలు కూడా ధనవంతులతో సమానంగా కార్పొరేట్‌ ఆస్పత్రులలో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించాలని అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ఎంతో మంది పేదలకు జీవం పోసిందన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాలకు కుయ్.. కుయ్... అంటూ 108 వాహనం వచ్చేసేదన్నారు. ఉపాధి హామీ, అభయ హస్తం, 104 లాంటి ఎన్నో పథకాలను మహానేత వైయస్‌ అమలు చేశారన్నారు. ఎన్ని పథకాలు అమలు చేసినా ఒక్క రూపాయి కూడా చార్జీలు గాని, పన్నులు కాని పెంచకుండా జనరంజకమైన పరిపాలనను ఆయన అందించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. మహానేత వైయస్‌ ఉన్నప్పుడు కరెంటు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచని వైనాన్ని ఆమె తెలిపారు. చార్జీలు గాని, పన్నులు గాని పెంచకుండానే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారు అని చెప్పారు.

ప్రజా సంక్షేమం అంటే చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికీ పట్టదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు, తన పదవిని కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నారే గాని ప్రజల కష్టాల గురించి వారు అస్సలు పట్టించుకోవడంలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి చంద్రబాబు కంటే ఏ విధంగానూ తీసిపోని విధంగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వ్యవసాయానికి కరెంటు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంటలకు మద్దతు ధర అంతకంటే ఇవ్వరని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు లేక చేసిన అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకుంటున్న రోజులివి అని ఆమె విచారం వ్యక్తంచేశారు. అన్ని చార్జీలు, అన్ని ధరలూ పెంచేస్తే కుటుంబ జీవనం ఎలా గడుస్తుందని శ్రీమతి షర్మిల నిలదీశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులను అటకెక్కించారని ఆరోపించారు. ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడిందన్నారు. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందన్నారు. కిరణ్‌ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదని నిప్పులు చెరిగారు.

మహానేత వైయస్‌ బతికే ఉంటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ తప్పకుండా ఇచ్చేవారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అయితే, కిరణ్‌ ప్రభుత్వం కనీసం మూడు గంటలు కూడా ఇవ్వలేకపోతోందని దుయ్యబట్టారు. కరెంటు లేక, నీరు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. గ్రామాల్లో నాలుగైదు గంటల కంటే కరెంటు ఉండని దుస్థితి దాపురించిందన్నారు. పరిశ్రమలకైతే నెలలో సగం రోజులు కరెంటు ఉండదని విచారం వ్యక్తంచేశారు. కరెంటు లేక వేలాది పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు ఇవ్వకపోయినా కిరణ్‌ కుమార్‌రెడ్డి బిల్లులను మాత్రం మూడింతలు వేసి వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎరువుల ధరలను ఆయన ఇప్పటికి పదిసార్లు పెంచారని ఆరోపించారు. కరెంటు బిల్లుల రూపంలో రూ. 32 వేల కోట్లను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల నెత్తిన మోపారన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతగా విర్రవీగడానికి కారణం చంద్రబాబు నాయుడని శ్రీమతి షర్మిల ఆరోపించారు. దుర్మార్గంగా అన్ని చార్జీలు పెంచిన పాపం కిరణ్‌కుమార్‌రెడ్డిది అయితే.. దానికి మద్దతు పలికింది చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలు కలిపి అవిశ్వాసం పెడితే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు నిలబడ్డారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రైతులను పురుగుల్లా చూశారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. మహానేత వైయస్‌ సిఎం అయ్యాక రైతన్న రాజులా బతికాడని ఆమె చెప్పారు. వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరే అని తప్పుపట్టారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలు చెప్పి నీరుగార్చిన సిఎం కూడా చంద్రబాబే అని దుయ్యబట్టారు.

ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2 లక్షల అటవీ భూములపై గిరిజనులకు హక్కు కల్పించింది మహానేత వైయస్‌ ఒక్కరే అన్నారు. ఆయన బతికి ఉంటే మరో 6 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కు కల్పించి ఉండేవారన్నారు. జగనన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకూ మనుగడ ఉండదని కుట్రచేసి, సిబిఐని వాడుకుని అన్యాయంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.
Back to Top