జగనన్నను సిఎం చేస్తే 9 గంటల విద్యుత్

గంగారం (ఖమ్మం జిల్లా), 12 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తారని ఆయన సోదరి శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం గంగారంలోని మామిడితోటలో పెద్ద ఎత్తున రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ రచ్చబండ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, స్థానికులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల  మాట్లాడారు.

జగనన్న సిఎం అయితే.. అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు రూ.500, ఇంటర్ విద్యార్థులకు రూ.700, డిగ్రీ విద్యార్థులకు రూ.1000 ‌లు వారిని బడికి పంపించిన తల్లి బ్యాంకు ఖాతాలోకి నెలనెలా జమ చేస్తామని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న బెల్టు షాపులను గ్రామాల్లో లేకుండా చేస్తామని ప్రకటించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేదని, రైతులన్నా, మహిళలన్నా కిరణ్‌రెడ్డికి ఏమాత్రం ప్రేమ లేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

చంద్రబాబునాయుడు తన పరిపాలనా కాలంలో 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి 75 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వెన్నుపోటుతో చంద్రబాబు పుట్టి.. మోసం చేస్తూ బతుకుతున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.‌ ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే చంద్రబాబు అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. మైనింగ్‌లో గిరిజనులు ఇళ్లు కోల్పోకుండా కలెక్టర్‌ను కలుస్తామని ఆమె తెలిపారు. ఇందు కోసం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.
Back to Top