యానిమేటర్ల ఆందోళనపై వెటకారమా?

హైదరాబాద్, నవంబర్15: ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) యానిమేటర్లు గత రెండు నెలలుగా తమ కోర్కెల సాధనకు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. యానిమేటర్ల ఆందోళనను సానుభూతితో అర్ధం చేసుకుని పరిష్కరించాల్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. పద్మ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభల్లో ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే 'కొన్ని పనికిమాలిన పార్టీలు వారిని రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నాయి' అని సీఎం వ్యాఖ్యానించడం, వెటకారం చేయడం దారుణమని విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'సెర్ప్'ను ప్రభుత్వ సంస్థగా గుర్తించడంతోపాటుగా యానిమేటర్లందరినీ ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని మాట్లాడిన విషయం మరిచారా? అని ఆమె ప్రశ్నించారు.

రూ. 2 వేల గౌరవ వేతనమూ ఇవ్వరా?

డ్వాక్రా గ్రూపులను సమన్వయపర్చడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో 17 రకాల విధులను నిర్వర్తిస్తూ గొడ్డు చాకిరీ చేస్తున్న యానిమేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని పద్మ ప్రశ్నించారు. కేవలం 2 వేల రూపాయల గౌరవ వేతనానికే విధి నిర్వహణ చేస్తున్న వారికి ఆ మొత్తాన్ని కూడా ఇవ్వకపోవడం మంచిది కాదన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తారా? లేక జలసమాధి చేసుకోమంటారా? అని మహిళా యానిమేటర్లు మూకుమ్మడిగా విశాఖపట్టణంలోని సముద్రంలో మునగడానికి ప్రయత్నిస్తే వారిని పోలీసులు అడ్డుకున్నారని, హృదయవిదారకంగా ఉన్న వారి ఆవేదన, ఆక్రోశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టదా? అని ఆమె అన్నారు.

'జాబు కావాలంటే బాబు రావాలి' అని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకున్నారని, తీరా ఆయన వచ్చాక ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని పద్మ అన్నారు. ఇంటింటికీ ఉద్యోగం, లేకుంటే 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారని, ఇప్పటివరకూ ఆ ఊసే లేదని ఆమె అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా పెద్ద మనసుతో రాష్ట్రంలోని 30 వేల మంది యానిమేటర్లకు వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో వారికి అండగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు.

కాళ్లు పట్టుకున్న వారికి విలువ ఉంటుందా?

పాలెం  వద్ద బస్సు దుర్ఘటనలో 40 మంది సజీవ దహనం అయిన కేసు నుంచి తప్పించుకోవడానికి అధికారపక్షం కాళ్లు పట్టుకున్న అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు..శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని వాసిరెడ్డి పద్మ అన్నారు. పాతికేళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల ముందు టీడీపీ పంచన చేరిన నాయకుడికి వేరే పనేమీ లేనట్లు శ్రీ వైఎస్ జగన్ జైలుకెళ్లక తప్పదని వ్యాఖ్యానిస్తున్నారని ఆమె విమర్శించారు. శ్రీ వైఎస్ జగన్ జైలు కెళ్లాలనే చంద్రబాబు కోరికను పదే పదే ఈ నాయకుడు వెల్లడిస్తూ ఆయన ప్రాపకం పొందాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top