కాకరాపల్లి విద్యుత్‌ ప్రాజెక్టును రద్దుచేస్తా

టెక్కలి (శ్రీకాకుళం జిల్లా),

3 ఏప్రిల్ 2014: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్‌ ‌ప్రాజెక్టును రద్దు చేస్తానని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండవ రోజునే ఈ ఫైలుపై సంతకం చేస్తానని ఆయన ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో శ్రీ జగన్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. శ్రీ జగన్‌ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. శ్రీ జగన్‌ చెప్పిన ఒక్కొక్క మాటకు వారు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మత్యకారులు, బోయ, వడ్డెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని మరో హామీ ఇచ్చారు. ఇంతకు ముందే ఈ హామీ తాను ఇచ్చానని తప్పకుండా నెరవేరుస్తానన్నారు.

రామరాజ్యాన్ని తాను చూడలేదు కాని, వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే తప్పని సరిగా ఆ సువర్ణ పాలనను అందిస్తానని శ్రీ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రానున్న 35 రోజుల్లో జరగననున్న ఎంపీటీసీ, జెడ్‌పిటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మన తల రాతలు మార్చేస్తాయన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి మన బాగు  కోసం ఎవరు కట్టుబడి పనిచేస్తారో, చనిపోయిన తరువాత కూడా మన గుండెల్లో మంచిగా నిలిచిపోవాలన్న లక్ష్యంతో పనిచేస్తారో వారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి ఇన్నేళ్ళయినా ప్రజల కోసమే నిరంతరం కృషి చేసిన ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. మన గుండె చప్పుడు వినే నాయకుడినే సీఎంగా ఎన్నుకోవాలన్నారు.

చంద్రబాబు నాయుడిచ్చే అబద్ధపు హామీలు విని మోసపోవద్దని ఓటర్లకు శ్రీ జగన్‌ హెచ్చరించారు. చంద్రబాబు భయానక పాలన చూస్తే.. ఇప్పటికీ భయమేస్తుందన్నారు. తమ పిల్లల చదువు కోసం పేదలు ఎన్ని కష్టాలు పడుతున్నారో చంద్రబాబుకు తెలియదన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్య, వైద్య సదుపాయాల విషయంలో కష్టాలు వచ్చాయన్నారు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా చంద్రబాబు వెనుకాడరని దుమ్మెత్తిపోశారు. కొద్ది మందికి మేలు చేసినా ఈనాడులో చంద్రబాబు సొంత డబ్బా కొట్టించుకునేవారని విమర్శించారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మరిచిపోయారన్నారు. ఎన్నికలు అయిన తరువాత తాను కానీ, టీడీపీ గాని ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు.

చంద్రబాబులా తాను అబద్ధపు, అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని శ్రీ జగన్‌ చెప్పారు. అమలు చేయగల హామీలు మాత్రమే తాను ఇస్తానన్నారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలిస్తానంటూ చంద్రబాబు చేస్తున్న బూటకపు వాగ్దానాన్ని శ్రీ జగన్‌ తిప్పికొట్టారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి సృష్టిస్తారని ఆయన నిలదీశారు.

రాష్ట్ర బడ్జెట్టే 125 వేల కోట్లైతే చంద్రబాబు నాయుడు ఏకంగా 150 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటూ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందొక మాట వెనకొక మాట చంద్రబాబు చెబుతారని అన్నారు. చంద్రబాబు రోజుకో దొంగ హామీ ఇస్తున్నారన్నారు.

ప్రజల మంచి కోసం ఆలోచించే, వారి సంక్షేమాన్ని కోరుకునే, ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడే వారిని, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచే వారిని మాత్రమే ఎన్నుకోవాలని ఓటర్లకు శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు. తాను ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తానని ఆయన చెప్పారు.

ఇద్దరు పిల్లలను బడికి పంపించే తల్లుల బ్యాంకు ఖాతాలో రూ. 1000 జమ చేసేందుకు ఉద్దేశించిన అమ్మ ఒడి పథకం ఫైలుపై అధికారంలోకి వచ్చిన తక్షణమే తాను మొదటి సంతకం చేస్తానని శ్రీ జగన్‌ ప్రకటించారు. అవ్వా తాతలకు పింఛన్‌ను రూ. 700కు పెంచే ఫైలుపై రెండో సంతకం చేస్తానన్నారు. రూ. 3 వేల కోట్లతో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడానికి మూడో సంతకం చేస్తానని శ్రీ జగన్‌ స్పష్టంచేశారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని, ప్రభుత్వ పాలనను గ్రామీణుల చెంతకే తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు.  నిరుపేదల కోసం వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రంలో 50 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తానని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించి, ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తానన్నారు. వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని బెల్టుషాపులను రద్దు చేస్తానన్నారు. గ్రామాల్లో మహిళా పోలీసులను నియమిస్తానన్నారు. పేదల ఇళ్ళకు నెలకు 150 యూనిట్ల విద్యుత్‌ను కేవలం రూ. 100కే సరఫరా చేస్తానని చెప్పారు. ప్రతి యువతీ యువకులకు ఉద్యోగం కల్పిస్తానన్నారు.

Back to Top