మంత్రులు తప్పుచేయలేదంటే జగన్ దోషెలా అవుతారు

హైదరాబాద్ 18 జూన్ 2013:

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. మేమంతా మద్దతిస్తాం అవిశ్వాసం పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇప్పుడు అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందని ఆమె నిలదీశారు. అవిశ్వాసం మాత్రం పెట్టరట.. ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకపక్క ప్రభుత్వాన్ని కాపాడుతూనే.. మరో పక్క కళంకిత మంత్రులంటూ నాటకాలాడుతున్నారని ఆమె టీడీపీ అధ్యక్షుడిపై మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ, కాంగ్రెస్ నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నేతల తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుందన్నారు. క్విడ్ ప్రోకోనే చోటు చేసుకోకపోతే తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఆయనను ఉచ్చులో బిగించేందుకే ప్రభుత్వం మౌనం వహిస్తోందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఐఎంజీ కేసుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. మంత్రులు తప్పు చేయకపోతే కోర్టులో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులు దోషులు కాకపోతే శ్రీ జగన్మోహన్ రెడ్డి దోషి ఎలా అవుతారన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన మంత్రులు తప్పుచేయలేదంటే.. అభియోగాలున్నంత మాత్రాన శ్రీ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లెలా అవుతుందని శోభా నాగిరెడ్డి అడిగారు.

తాము కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయినట్లు టీడీపీ వారు ఆరోపిస్తున్నారనీ.. అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డిగారు ఏడాది పాటు జైలులో ఎందుకుంటారని ప్రశ్నించారు. జీవోల్లో ఎటువంటి అవకతవకలూ జరగలేదనీ, బిజినెస్ రూల్సు ప్రకారం చట్టబద్ధంగా అవి జారీ అయ్యాయనీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో స్వయంగా చెప్పారన్నారు. మంత్రులు తప్పుచేయలేదనీ, అవన్నీ ఆరోపణలు మాత్రమేననీ ఆయన చెప్పారన్నారు. క్విడ్ ప్రోకో జరగనప్పుడు.. అన్నీ బిజినెస్ రూల్సు ప్రకారమే జరిగినప్పుడు ఏం తప్పు చేశారని శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఏడాది పాటు జైలులో ఉంచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నానన్నారు. రాజకీయ కక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే అంశం దీనివల్ల రుజువైందన్నారు. తమ మంత్రుల పీకమీదకి వచ్చింది కాబట్టి జీవోల్లో అవకతవకలు లేవని ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. 26 జీవోల మీద శంకరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసినప్పుడు గానీ, టీడీపీ దానికి జతకూడినప్పుడు గానీ దానిమీద కోర్టులో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదన్నారు. ఈ మంత్రులంతా ఇరుక్కుంటారని ఆరోజు తెలీదా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డిగారిని వేధించాలనే రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆరోజు కౌంటర్ ఫైల్ చేయలేదని ఆమె ఆరోపించారు. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలే శ్రీ జగన్మోహన్ రెడ్డి నిర్దోషనే అంశాన్ని బహిర్గతం చేశాయని శ్రీమతి శోభా నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఆరోపణలు రుజువుచేయలేకనే ఆయనను జైలులో ఉంచారన్న విషయం ప్రజలకు అవగతమైందన్నారు.

ధర్మాన ప్రసాదరావు ఐఎమ్‌జీ అంశాన్ని ప్రస్తావించారన్నారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా వేల కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని ఐఎమ్‌జీకి కట్టబెట్టిన అంశంపై సీబీఐ విచారణ చేయాలని కోరగా సిబ్బంది లేరని సాకు చూపారని తెలిపారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఒక మంత్రి అసెంబ్లీలో చెప్పినప్పుడు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు డిమాండ్ చేయలేదని ఆమె అడిగారు. అప్పట్లో చీఫ్ విప్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ ఈ అంశంపై విచారణ కోరారు. ఆయన ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదన్నారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారు కనకనే ఆ పని చేయడం లేదన్నారు. టీడీపీ వారు తామంతా నిజాయితీపరులమంటూ మాట్లాడుతున్నారనీ, విజయమ్మగారు మామీద వేసిన కేసులేవీ నిలబడటం లేదని చెబుతున్నారనీ ఈ సందర్భంగా వారినో విషయం అడుగుతున్నానన్నారు. నిజాయితీపరుణ్ణని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు అవకాశం లేకుండా స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. మీ నాయకుడు తనను కలిశారని పార్లమెంటులో చిదంబరమే స్వయంగా ప్రకటించిన విషయాన్ని పురస్కరించుకుని సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతానన్న నామా నాగేశ్వరరావు ఇంతవరకూ ఆ పని ఎందుకు చేయలేదని శోభా నాగిరెడ్డి నిలదీశారు. తాను కలవలేదని చంద్రబాబు కూడా ఖండించలేదన్నారు. వీటన్నిటి బట్టి కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యింది టీడీపీనా.. తామా అని ప్రశ్నించారు.

రామ్‌కీ భూముల అంశంపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు హయాంలో జరగిందని చెప్పారనీ, కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించారని.. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదనీ తెలిపారన్నారు. ఇదే అంశాన్ని మీరు సీబీఐకి ఎందుకు చెప్పలేదని ఆమె అడిగారు. దీనిమీద విచారణ చేయమని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.

Back to Top