3,000 కిలోమీటర్లు.. ఓ మైలురాయి

ధనుపురం(శ్రీకాకుళం జిల్లా) 29 జూలై 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు సమాధి కట్టి, దానిమీద కాంగ్రెస్ పాలకులు నిద్రపోతున్నారని శ్రీమతి వైయస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ధనుపురంలో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె ఆవేశపూరితంగా ప్రసంగించారు. తొలుత.. అక్కడ ఏర్పాటుచేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ నిలువెత్తు చిత్రపటానికి ఆమె పూలతో నివాళులర్పించారు. శ్రీకాకుళం తాజా మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ఆయన భార్య, పార్టీ జిల్లా కన్వీనర్ అయిన శ్రీమతి పద్మప్రియ. తదితరులు ఆమె వెంట పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, దాని అధినేత చంద్రబాబుపై శ్రీమతి షర్మిల విమర్శల వర్షం కురిపించారు.  వెన్నుపోటుదారులు ఏకమై ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ పదేళ్ళ క్రితం చేసిన ప్రజా ప్రస్థానం నుంచి అన్ని అంశాలనూ ఆమె తన ప్రసంగంలో స్పృశించారు. శ్రీమతి షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే...

'సరిగ్గా పదేళ్ళ క్రితం డాక్టర్ రాజశేఖరరెడ్డిగారు ప్రజా ప్రస్థానం కార్యక్రమాన్ని చేపట్టారు. మండుటెండల్లో ఆయన తన పాదయాత్రను ఒక మహాయజ్ఞంలా సాగించారు. రోజుకు ఇరవై కిలోమీటర్లకు పైగా నడిచిన ఆ పాదయాత్రలో ఆయన ప్రజలతో మమైకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు. ప్రజల అవసరాలను గమనించారు. వారి బాధలను అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రయిన మరుక్షణం నుంచి ప్రజల గురించే ఆలోచించారు. వారికి మేలు చేయాలని తపించారు. కులాలకు,మతాలకూ, ప్రాంతాలకూ అతీతంగా ఆలోచించి మన రాష్ట్రంలో ప్రతి కుటుంబమూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అటువంటి తపనలోంచి పుట్టినవే రాజశేఖరరెడ్డిగారి అద్భుతమైన పథకాలు. ప్రతి ఎకరాకీ నీరివ్వాలనీ, ప్రతి రైతుకూ అండగా నిలబడాలనీ ఆయనాశించారు. ఇందులో పుట్టిందే జలయజ్ఞం. రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి, మద్దతు ధర కల్పించారు.  ఇన్‌పుట్ సబ్సిడీయే కాక అవసరమైనప్పుడు నష్ట పరిహారాన్ని చెల్లించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు బకాయిలు మాఫీ చేశారు. రుణాలపై వడ్డీ భారాన్నీ తొలగించారు. అనంతరం 12వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా రాజశేఖరరెడ్డిగారు మాఫీ చేశారు. అంతకు ముందు రైతులకు రూపాయి వడ్డీకి రుణాలిస్తూ మహిళలకు పావలా వడ్డీకి అప్పులిచ్చారు. మహిళలు బ్యాంకులకు వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల గురించి తండ్రిలా ఆలోచించి, ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రవేశ పెట్టారు. లక్షలాది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా బాటలు వేశారు. పేదరికమనే ఊబిలోంచి కుటుంబాలు బయటపడటానికి చదువే శాశ్వత పరిష్కారమని రాజన్న ప్రగాఢంగా నమ్మారు. అందుకనే లక్షలాదిమంది విద్యార్థులు ఉచితంగా చదువుకుని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి అనారోగ్యం చేస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళారు. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారు. వాళ్ళలాగే పేదవాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఖర్చయ్యే వైద్యాన్ని పొందేందుకు వీలుగా రాజన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 108, 104 అంబులెన్సులు ఫోను చేసిన ఇరవై నిముషాల్లో అవసరమైన చోటికి వచ్చేవి. ఉపాధి హామీ అయితేనేమి, అభయహస్తమైతేనేమీ, ఇలా ఏ పథకాన్నమయినా రాజశేఖరరెడ్డిగారు అద్భుతంగాచేసి చూపెట్టారు.

చంద్రబాబుగారు 16లక్షల మందికి పింఛన్లిస్తే, రాజశేఖరరెడ్డిగారు 71 లక్షలమందికి ఇచ్చారు. కేంద్రం దేశవ్యాప్తంగా 40లక్షల పక్కా ఇళ్ళు కడితే ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా ఆయన ఏ ఒక్క రోజూ ఏ ఒక్క చార్జీని పెంచలేదు. నేను ఏ చార్జీని పెంచినా ఆ భారం పేదవాడిమీద పడుతుందనీ, నా అక్కచెల్లెళ్ళ మీదే పడుతుందనీ, అందుకే తనకిష్టం లేదనీ రాజశేఖరరెడ్డిగారు భావించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్యాస్ ధర 306 రూపాయలు కూడా కాలేదు. మున్సిపల్ పన్నులు కానీ, ఆర్టీసీ చార్జీలు కానీ పెరగలేదు. కరెంటు చార్జీని కూడా రూపాయి కూడా పెంచలేదు. పెంచారని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేదు. ఏ ఒక్క చార్జీ పెంచకుండానే.. ఏ పన్ను పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేసిచూపించారు రాజశేఖరరెడ్డిగారు. ముఖ్యంత్రంటే ఇలా ఉండాలి.. ఇలా పనిచేయాలి.. తన ప్రజలను ఇలా ప్రేమించాలి.. ఇలాంటి పథకాలను రూపొందించాలని భావితరాలకు ఒక ఆదర్శంగా నిలిచారు.

పాలకుల కుంభకర్ణ నిద్ర
రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళూ ఒక సువర్ణయుగంలా సాగింది. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలకూ తూట్లు పొడిచింది. ఆయన ఆశయాలకు భిన్నంగా అన్ని చార్జీలనూ పెంచేసింది. ఈ కాంగ్రెస్ పాలకులకి రైతులంటే శ్రద్ధ లేదు.. పేదలంటే కనికరం లేదు. మనసు, మమత లేవు. పగబట్టినట్లుగా రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. సంక్షేమ పథకాలకు సమాధి కట్టి దానిమీదే కుంభకర్ణ నిద్ర పోతున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు. ప్రజలు మీకెందుకు ఓటేయాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఉచిత విద్యుత్తుని మూడు గంటలకు తగ్గించినందుకా.. ఎరువుల ధరలను 800శాతం పెంచినందుకా.. రైతులకు మద్దతు ధరలు పెంచేసి, వారి కడుపుమీద తన్నినందుకా..ఎందుకు మీకు ఓటెయ్యాలి అని ప్రశ్నిస్తున్నాం. కరెంటు లేక వేలాది పరిశ్రమలు మూతపడి.. లక్షలాది కార్మికులు రోడ్డున పడినందుకు మీకు ఓటేయాలా? ఫీజు రీయింబర్సుమెంటు అమలుకు బేరమాడుతూ వారికి బిక్షమేసినట్లు ఇస్తున్నందుకు మీకు ఓటేయాలా? ఆరోగ్యశ్రీ నుంచి 137 వ్యాధులను తొలగించి, 97 ఆస్పత్రులను తీసేసి.. మళ్లీ మీరు ప్రభుత్వాస్పత్రికే పొండని పేదవాడిని శాసించినందుకు మీకు ఓటేయాలా? 104 కనబడనందుకు, 108 కనుమరుగైపోతున్నందుకూ మీకు ఓటేయాలా? ఆ ఉద్యోగులకు జీతాలివ్వకుండా.. వాహనాలకు డీజిల్ డబ్బులివ్వకుండా చేస్తున్నందుకు మీకు ఓటేయాలా? ఒక పక్కా ఇల్లు కట్టనందుకు, ఒక రేషన్ లేదా పింఛను కార్డు కొత్తగా ఇవ్వనందుకు ఓటేయాలా? ఈ ప్రభుత్వం బతికున్నట్లా? చచ్చినట్టా? ఎందుకు మీకు ఓటేయాలి? 30 కిలోల బియ్యం, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ళుగా తీర్చనందుకు మీకు ఓటేయాలా? ఏ విశ్వసనీయత ఉందని ఓటేయాలని కాంగ్రెస్ వాళ్లని అడుగుతున్నా. అన్ని ప్రాజెక్టులనూ గాలికొదిలేసినందుకు మీకు ఓటేయాలా? కరెంటు చార్జీల కింద 32 వేల కోట్ల రూపాయలను ప్రజల రక్తం పిండి వసూలు చేసినందుకు మీకు ఓటేయాలా? అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైంది. ఎవరికీ ఈ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోయింది.

చంద్రబాబు నాయుడు మీద మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసా ఉంది. ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే, దానిపై ఈగ కూడా వాలడానికి వీల్లేదని చంద్రబాబు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ చేశారు. ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది.. ప్రజలకు ఈ కష్టాలుండేవి కావు. రాబందులు రాజ్యమేలుతుంటే గుంట నక్కలు తాళమేసినట్లు.. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత దారుణంగా పాలిస్తుంటే చంద్రబాబు పక్కనే నిలబడి చప్పట్లు కొడుతున్నారు. చిరంజీవిగారు ఒక్క కేంద్ర మంత్రి పదవి కోసం హోల్‌సేల్‌గా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతే చంద్రబాబు గారు కొద్దికొద్దిగా రిటెయిల్‌గా అమ్ముడుపోయారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమొస్తుందన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనీ, అలా చేస్తే సోమరిపోతులవుతారనీ చంద్రబాబు చెప్పారు. ఉపకార వేతనాలు ఇవ్వమంటే విద్యార్థులను లాఠీలతో కొట్టించారు. కనీసం వారికి మెస్ చార్జీలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాస్పత్రికి వెళ్ళే పేదలకు ఉచితంగా మందులివ్వాలి, వైద్యం అందించాలి అనే ఆలోచన రాలేదు సరికదా... వాటిలో యూజర్ చార్జీలు వసూలు చేశారు చంద్రబాబు. ఎవరైనా వచ్చి నా భర్త చనిపోయాడు పింఛనిమ్మంటే... ఇప్పటికే పింఛన్లు అందుకుంటున్న వారిలో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో ఇస్తానని చెప్పారు చంద్రబాబు. 145 రూపాయలున్న గ్యాస్ దరని రెట్టింపు చేసి వదిలారాయన. ఆర్టీసీ చార్జీలను పెంచారు. హెచ్‌పీ ధర పెంచారు.

ప్రతి సంవత్సరమూ కరెంటు చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకుని, సంతకాలు పెట్టింది చంద్రబాబుగారు. ఉచిత విద్యుత్‌ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసినవాడు చంద్రబాబుగారు. ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను పెంచి, పాపం రైతుల నడ్డి విరిచాడు చంద్రబాబుగారు. అసలే కరువుంది మహాప్రభో ఈ కరెంటు చార్జీలు కట్టుకోలేము అంటే.. చంద్రబాబుగారు ఏ రోజూ వాళ్ళ గోడు వినలేదు. ప్రత్యేకమైన పోలీసు స్టేషన్లు, కోర్టులు పెట్టారు. పాపం అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. రాజశేఖరరెడ్డిగారు అందుకు నిరసనగా అప్పడు 17 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజుల ఆందోళన జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరిననుకున్నారు! చనిపోయిన రైతు కుటుంబాలను కాదు.. వాళ్ళను కాల్చిన పోలీసోళ్ళను పరామర్శించాడు చంద్రబాబుగారు. అంతటి నీచుడు చంద్రబాబుగారు.

ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు... నాకు గనక పగ్గాలిస్తే.. తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తెస్తే.. రాష్ట్రాన్నే కాదు కేంద్రాన్ని కూడా గాడిలో పెడతానని చెబుతున్నాడు చంద్రబాబుగారు. ఒక సామెత ఉంది.. పేనుకు పెత్తనం ఇస్తే.. అంతా గొరిగేసిందంట! చంద్రబాబుగారికి పెత్తనం ఇస్తే.. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. కన్నార్పకుండానే చంద్రబాబుగారు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరు. ఉచిత విద్యుత్‌ తానే ఇవ్వాలనుకున్నాను అన్నాడు చంద్రబాబుగారు. ఫీజు రీయింబర్సుమెంటు తానే చేశానని చెప్పాడు చంద్రబాబుగారు. ప్రాజెక్టులు తానే కట్టాలనుకున్నాను అన్నాడు చంద్రబాబుగారు. పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి.. పంచాయతీలకు అధికారాలు ఇచ్చింది కూడా నేనే అని అబద్ధాలు చెప్పాడు చంద్రబాబుగారు. నిజానికి... పంచాయతీలను సర్వనాశనం చేసి.. నోడల్‌ ఆఫీసర్లను పెట్టి ఏళ్ళ తరబడి పంచాయతీ ఎన్నికలు జరగకుండా చేసింది చంద్రబాబుగారు. ఇంకొంచెం ఉంటే చార్మినార్‌ కూడా నేనే కట్టాను.. విశాఖపట్నంలో సముద్రాన్ని కూడా నేనే వేయించానని చెప్పగలరు.

చంద్రబాబు అబద్ధాల గురించి రాజశేఖరరెడ్డిగారు ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడి శాపం ఉందట. చంద్రబాబుగారు ఏ రోజైతే నిజం చెబుతారో.. ఆ రోజు చంద్రబాబు తలకాయి వెయ్యి ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబుగారు ఎప్పుడూ నిజం చెప్పరు పాపం. ఇదీ చంద్రబాబుగారి చరిత్ర.‌ చంద్రబాబుగారు ఎన్టీఆర్‌కు బ్రతికుండగానే వెన్నుపోటు పొడిస్తే.. ఈ కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన తరువాత ఆయనకు వెన్నుపోటు పొడిచింది. ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.. ఆయన కుటుంబాన్ని వేధించింది. ఈ వెన్నుపోటుదారులందరూ కలిసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా పాలకపక్షమూ, ప్రతిపక్షమూ ఒక్కటయ్యాయి. ప్రతి విషయంలోనూ పాలక పక్షము, ప్రతిపక్షము కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు. ఎఫ్‌డిఐ విషయంలో కుమ్మక్కయ్యారు... అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పడు కుమ్మక్కయ్యారు.. రెండవసారి పెట్టినప్పుడు కూడా కుమ్మక్కయ్యారు. ఆఖరికి జగనన్న విషయంలో కూడా ఈ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యారు, కుట్రలు పన్నారు. వీరి ఉద్దేశం ఒక్కటే.. మన రాష్ట్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఉండాలట లేదంటే తెలుగుదేశం ఉండాలట. కాంగ్రెస్‌పై విసుగొచ్చినప్పుడు ప్రజలు తెలుగుదేశానికి ఓటెయ్యాలట.. తెలుగుదేశంపై విసుగొస్తే.. కాంగ్రెస్‌కు వెయ్యాలట. మూడో పార్టీ గాని, మూడో వ్యక్తి గాని మన రాష్ట్రంలో ఉండకూడదని కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారు.

జగన్మోహన్‌రెడ్డిగారు జననేతగా ఎదుగుతుంటే.. ఇంక జగన్మోహన్‌రెడ్డిగారు బయటే ఉంటే.. ఆ రెండు పార్టీలకూ మనుగడ ఉండదు.. దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి జగన్మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా పతనం చేయాలనుకున్నారు. కుట్రలు పన్నారు.. సిబిఐని ఉసిగొల్పారు. సిబిఐ ఏమో కేంద్రం చేతిలో ఉన్న కీలుబొమ్మ. కేంద్రం ఎలా చెబితే అలా ఆడే కీలుబొమ్మ గనుక వందల మందిని రంగంలోకి దింపింది.. వేల కొద్దీ ఫోన్‌ కాల్సును ట్యాప్‌ చేసింది.. రైడ్ల మీద రైడ్లు చేసింది.. చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేసింది.. అరెస్టుల మీద అరెస్టులు చేసింది.

ఈనాడు వంద రూపాయల షేరును ఐదు లక్షల 30 వేల రూపాయలకు అమ్ముకుంటే సిబిఐకి ఏ అభ్యంతరకూ లేదు. అందులో సిబిఐకి ఏ అక్రమమూ కనిపించలేదు. కానీ, పది రూపాయల సాక్షి షేరును కేవలం 350 రూపాయలకు అమ్ముకుంటే.. దాన్ని క్విడ్‌ ప్రో కో అంది సిబిఐ. జగన్మోహన్‌రెడ్డి గారు సాక్షి షేర్లను అక్రమంగా అమ్ముకున్నారన్నది సిబిఐ. దుర్మార్గమేమిటంటే.. ఎన్నో ఆరోపణలు చేసి.. అభియోగాలు మోపి.. ఒక్కదాని కంటే ఒక్కదానికీ ఆధారం చూపించకుండా ఇప్పటికి జగన్మోహన్‌రెడ్డిగారిని 14  నెలలుగా జైలుపాలు చేశారు.

చంద్రబాబుగారు ఐఎంజి కేసులో తన బినామీ సంస్థకు, కేవలం లక్ష రూపాయలతో ఏర్పాటైన కంపెనీకి, ఏర్పాటైన మూడు రోజుల్లోనే.. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2,500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఈ రోజుల్లో 12,500 కోట్ల విలువైన భూమిని కేవలం మూడున్నర కోట్ల రూపాయలకు రాసిచ్చేశారు. చంద్రబాబు గారి మీద ఒక సాధారణ ఎస్ఐతో అయినా ఒక్క రోజు నిజాయితీగా విచారణ చేయించి ఉన్నా..  ఈ పాటికి చంద్రబాబుగారు జైలులో ఉండేవారు. కానీ, సిబిఐ విచారణ చేయలేదు. ఎందుకు అని అడిగితే.. చంద్రబాబుగారిని విచారణ చేయడానికి మా దగ్గర సిబ్బంది లేదని కుంటిసాకులు చెప్పింది సిబిఐ. ఎమ్మార్‌ విషయంలో 550 ఎకరాలను ఇచ్చేశాడు చంద్రబాబుగారు. కానీ, సిబిఐ ఏమో ఎవరెవరి మీదో కేసులు పెట్టి.. ఎవరెవరినో అరెస్టు చేసింది కానీ, కారు చౌకగా భూమినిచ్చేసిన చంద్రబాబుగారిని మాత్రం కనీసం విచారణకు కూడా పిలవలేదు. ఐఎంజి, ఎమ్మార్‌ కేసులు లాంటి కేసుల్లో వందల ఎకరాలను చంద్రబాబుగారు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అయినా చంద్రబాబుగారి మీద విచారణ జరగదు. ఎందుకని!

కాకినాడ పోర్టు, కృష్ణపట్నం ఇలాంటి పోర్టులను చంద్రబాబుగారు వాళ్ళ అనుకూలస్థు ఇచ్చేస్తే.. చంద్రబాబు మీద ఎందుకు విచారణ జరగటం లేదు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు ప్రజల సొమ్మును చంద్రబాబుగారు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల్లా తన అనకూలస్థులకు ఇచ్చేస్తే చంద్రబాబు మీద ఎందుకు విచారణ జరగటం లేదు? చంద్రబాబుగారి మీద ఒక పుస్తకమే రాశారు కమ్యూనిస్టు వారు. 'చంద్రబాబు జమానా అవినీతి ఖజానా' అని దానికి పేరు. చంద్రబాబుగారి మీద ఇన్ని అవినీతి ఆరోపణలుంటే.. చంద్రబాబుగారి మీద ఏ విచారణా జరగదు.. ఏ కేసూ ఉండదు. ఎందుకని!
ఎందుకంటే.. చంద్రబాబుగారు చీకట్లోనే చిదంబరంగార్ని కలుస్తారు.. గొప్పగా మేనేజ్‌ చేసుకుంటారు. ఎందుకంటే.. చంద్రబాబుగారు కాంగ్రెస్‌ పార్టీని తన భుజాల మీద మోసి కాపాడతారు. కాంగ్రెస్‌ పార్టీని కాపాడినందుకు ప్రతిఫలంగా.. సిబిఐ అనే కాంగ్రెస్‌ పార్టీ పెరట్లో ఉన్న కుక్కను చంద్రబాబుగారి మీదకు ఉసిగొల్పరు. అందుకనే చంద్రబాబుగారి మీద ఏ విచారణలూ జరగవు.. ఏ కేసులూ ఉండవు. ఒకవైపేమో అన్ని వ్యవస్థలనీ మేనేజ్‌ చేసుకుంటూనే.. ఇంకోవైపేమో అవినీతిపై పోరాటం అంటున్న ఈ చంద్రబాబుగారిని ఏమనాలి?

జగన్మోహన్‌రెడ్డిగారు విలువలకూ, విశ్వసనీయతకూ కట్టుబడే మనిషి. ఒక మాటిచ్చారంటే.. ఊపిరి ఉన్నంత వరకూ తప్పకూడదు.. మడమ తిప్పకూడదు అని నమ్మి.. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మీద నమ్మకంతో.. గుండె నిబ్బరంతో ముందడుగు వేశారు జగన్మోహన్‌రెడ్డిగారు. కానీ.. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ ధైర్యం ఈ కాంగ్రెస్, టిడిపిలకు లేవు. నిజానికి జగన్మోహన్‌రెడ్డిగారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం కూడా కాంగ్రెస్, టిడిపిలకు లేవు. అందుకనే సిబిఐ వెనకాల దాక్కుని మరీ దాడి చేస్తున్నారు. వీళ్ళకు నిజంగా ఏమాత్రం పౌరుషం ఉన్నా.. ప్రజా కోర్టులో తీర్పు తేల్చుకుందాం అని ఏనాడో చెప్పేవారు ఈ కాంగ్రెస్, టిడిపి నాయకులు. వీళ్ళ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితాన్ని బలిపెట్టడానికి కూడా వెనుకాడలేదు ఈ దుర్మార్గులు.
కానీ.. దేవుడు వీళ్ళ పాపాలను లెక్కబెడుతున్నాడు. ఒక రోజు వీళ్ళ పాపాలపుట్ట పగులుతుంది.. వీరి పాపం పండిన రోజున ఆ పాపాలపుట్టలో నుంచి వచ్చిన విష సర్పాలని ప్రజలు ఓటు అనే ఆయుధంతో వేటాడే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడున్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. అందుకనే జగన్మోహన్‌రెడ్డిగారు ధైర్యంగా ఉన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే! ఉదయించే సూర్యుడ్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్‌రెడ్డిగారిని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది.. ఆ రోజున జగనన్న వచ్చి మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తారు. ఆ రోజు వచ్చేంత వరకూ మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని ప్రార్థన.

మీ పనులు మానుకుని.. మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు.. అమ్మా! మీకు అండగా ఉన్నామని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు.. మీ అభిమానానికి.. మీ ఆప్యాయతకూ.. మీ అనురాగానికి.. శిరసు వంచి.. చేతులు జోడించి.. మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ' అని ప్రసంగాన్ని ముగించారు. అనంతరం, శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కలిసి శ్రీమతి షర్మిలను సత్కరించారు.

తాజా వీడియోలు

Back to Top