రైతు అవసరం పట్టని సర్కారు ఇది : షర్మిల

కిర్లంపూడి 18 జూన్ 2013:

తనకున్న పెద్ద మనసు కారణంగానే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఇప్పటికీ ప్రజల హృదయల్లో కొలువుతీరి ఉన్నారని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రైతుల కోసం ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. ఉచిత విద్యుత్తు ఇచ్చారు.. అవసరమైనప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ, రుణాలు..ఇచ్చారన్నారు. వేల కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేసిన అంశాన్ని ఆమె గుర్తుచేశారు. అవసరమైనపుడు నష్ట పరిహారం అందించారన్నారు. రైతన్న ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యంగా ఆయన సాగారన్నారు. ఆయన ముఖ్యమంత్రయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలిచ్చిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. బ్యాంకంటే ఎరగని మహిళలు బ్యాంకు రుణాలు తీసుకునేలా చేశారు. విద్యార్థుల విషయంలో మహానేత తండ్రిలా ఆలోచించారు. పెద్ద చదువులను వారి ముంగిటకు తెచ్చారు. ఏం కావాలంటే అది చదువుకోండని భరోసానిచ్చారన్నారు. అందుకే లక్షలమంది చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం చేయించుకునేలా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 108, 104 సర్వీసులను ప్రవేశపెట్టి గ్రామీణుల ముంగిటకు ఆరోగ్యాన్ని చేర్చిన మహా వ్యక్తి డాక్టర్ వైయస్ఆర్ అని పేర్కొన్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 50 లక్షల పక్కా ఇళ్ళు కడితే.. ఒక్క మన రాష్ట్రంలోనే మహానేత 50 లక్షల ఇళ్ళు కట్టి చూపించారన్నారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లిస్తే రాజశేఖరరెడ్డిగారు 75 లక్షల మందికి ఇచ్చారన్నారు. రాజశేఖరరరెడ్డిగారిది ఎంత పెద్ద మనసో నేను చెప్పనక్కర లేదన్నారు. భారం పేదవారి పడుతుందని భావించడం వల్లే ఆయన ఏనాడు ఒక్క రూపాయి చార్జీని కానీ పన్ను కానీ పెంచలేదన్నారు. అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు.

ఏలేరు ప్రాజెక్టును పట్టించుకోని ప్రభుత్వం
ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధలేదన్నారు. పేదలంటే మానవత్వం కూడా చూపించడం లేదన్నారు. ప్రతి పంట నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి గారున్నప్పుడు ఈ ప్రాంతంలో ఏలేరు ఆధునికీకరణకు ప్రయత్నించారని చెప్పారు. 138 కోట్ల రూపాయల ఖర్చు కాగల పథకానికి శంకుస్థాపన కూడా చేశారని తెలిపారు. ఉంటే కరవు లేదా వరద నెలకొంటాయన్న వాస్తవాన్ని గ్రహించిన రాజన్న ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నడుంబిగించారన్నారు. ఆయన వెళ్ళిపోయాక ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందనీ, దీనికోసం ఇక్కడి నాయకులు పాదయాత్ర చేసిన ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.


విత్తనాలు అందుబాటులో ఉంచాలనే ఇంగితం కూడా కరవు

జూన్ నెల వచ్చిందంటే రైతులకు ఎరువులు, విత్తనాలు ఎంతో అవసరమనే ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోయిందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలు దొరకడం లేదని ఎక్కడికెళ్లినా రైతులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నెల సగం గడిచిపోయినా కూడా రైతులు ఇంకా వీటికోసం క్యూలలో నిలబడి ఉండాల్సి వస్తోందన్నారు. లేకపోతే బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాయితీని పెంచకుండా ఆ  భారాన్ని రైతుల మీదే మోపాయని చెప్పారు. ధరలు తగ్గితే ఆ మొత్తాన్ని రైతులకివ్వకుండా కేంద్రం రాయితీలో సర్దుబాటు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంత రాక్షసంగా ఉందో దీన్నిబట్టే అర్థమవుతోందని ఆమె విశ్లేషించారు.

అన్ని విత్తనాల ధరలూ పెరిగిపోయాయనీ, రాజన్న ఉన్నప్పుడు ఎరువులు, విత్తనాల ధరలు పెరగలేదనీ చెప్పారు. ఇప్పటికే ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతం పెరిగాయని తెలిపారు. రాజన్న ఉన్నప్పుడు బీటీ విత్తనం 1850 ఉందనీ, తగ్గించి అమ్మితే అమ్మండి లేదా వెళ్ళిపోండని ఆయన చెప్పడంతో 650 రూపాయలకు తగ్గించి అమ్మిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డిగారికి రైతుల మీద ఉన్న శ్రద్ధ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలన్నారు. ఆయన ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించడమే కాకుండా మద్దతు ధరలు పెరిగేలా చూశారన్నారు. ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు అంత పెద్ద మనసు లేదన్నారు. ఖర్చు పెరిగింది.. ఆదాయం తగ్గిపోయిందన్నారు.  సర్కారు నిర్లక్ష్యం వల్ల నీరు, కరెంటు లేక దిగుబడి కూడా తగ్గిపోయిందన్నారు. ఎన్ని విధాల చేతనైతే రైతును అన్ని విధాలుగా హింసింస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉపాధి హామీ పని రోజులు పెంచకపోగా తక్కువ కూలీ ఇస్తున్నారన్నారు. రెండుమూడు నెలలుగా కూలీ ఇవ్వడం లేదని ఎక్కడికెళ్లినా చెబుతున్నారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందనీ, 108కి డీజిలు లేదు.. ఫీజు రీయింబర్సుమెంటు కుంటుబడింది.. పక్కా ఇళ్ళకి పాడె కట్టింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని అటకెక్కించింది. కిరణ్ కుమార్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడా కరెంటు లేదు. కనీసం మూడు గంటలు కూడా రైతులకు కరెంటు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియడం లేదన్నారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వంపై శాసన సభలో అవిశ్వాసం పెడితే.. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారు. ఆరోజు చంద్రబాబు మద్దతిచ్చి ఉంటే ప్రజలకు ఈ బాధలు ఉండేవి కావు. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి ప్రభుత్వాన్ని కాపాడిన బాబును నాయకుడనాలా.. ఊసరవెల్లి అనాలా అని ప్రశ్నించారు.

చిరంజీవి తనకు ఓటేసిన 70 లక్షల మందిని ఒక్క మంత్రి పదవి కోసం పిచ్చోళ్ళను చేశారన్నారు. చంద్రబాబుకూడా అలాగే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారనీ ఇద్దరికీ పెద్దగా తేడాలేదనీ వివరించారు. ఆయన ఒకప్పడు మామని, ఇప్పుడు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారన్నారు. పార్టీ నుంచే ఆయన వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ను వెలేశారన్నారు. వ్యవసాయం దండగ అన్నారు. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే సోమరిపోతులవుతారన్నారు. విద్యార్థులు ఉపకార వేతనాలు అడిగితే లాఠీలతో కొట్టించారు. పేదలనుంచి ప్రభుత్వ ఆస్పత్రులలలో యూజర్ చార్జీలను వసూలు చేసిన ఘనుడు చంద్రబాబని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్తు ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఎవరూ ఎప్పటికీ మరిచిపోరని శ్రీమతి షర్మిల చెప్పారు. ఆమె ఇంకా ఇలా అన్నారు..' రైతుల మీద చంద్రబాబు కరెంటు బకాయిల కోసం కేసులు పెట్టి.. ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేశాడు. అవమానం తట్టుకోలేక వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసకున్నారు. రెండెకరాలతో మొదలైన చంద్రబాబుకు ఇప్పుడు దేశవిదేశాలలో ఆస్థులున్నాయి. చంద్రబాబు అవినీతి మీద 'చంద్రబాబు జమానా అవినీతి ఖజానా' అనే పేరుతో కమ్యూనిస్టులు పుస్తకం రాశారు. అధికారమిస్తే అంతా సరిదిద్దుతానంటున్నారు.  చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే అంతా అధోగతే.  ఆయనకు అధికార కాంక్ష లేకపోతే ఎన్టీఆర్ కుర్చీని ఎందుకు లాక్కున్నారు.  ఎన్టీఆర్ కుమారులకు ఎందుకు అప్పగించలేదు. ఆయనకు స్వార్థం లేదంటే ఆ పార్టీ వారు కూడా నమ్మరు. ఆయనకు ప్రజా సేవే ముఖ్యమైతే తొమ్మిదేళ్ళలో ఎందుకు చేయలేదు. ధర్మపోరాటం చేస్తానని బాబు చెబుతున్నారు. విచారణ జరగకుండా చేయడానికి చిదంబరాన్ని కలిసిన విషయం మరిచిపోయారా.'

వినేవాడు వెర్రివాడైతే.. చెప్పేవాడు వేదాంతంట... ఇది చంద్రబాబు సరిగ్గా సరిపోతుంది. చంద్రబాబు విలువలను విడిచి మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి జగనన్నను జైలు పాలుచేశారు. ఆయన ప్రజల్లో ఉంటే రెండు పార్టీలకూ మనుగడ ఉండదనీ, దుకాణాలు మూసేయాల్సి వస్తుందని అబద్ధపు కేసులు పెట్టి. హింసిస్తున్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచి వారిని కాపాడతాడన్నది అంతే నిజం. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. ఏదో ఒక రోజు జగనన్న బయటకు వస్తాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. అప్పటివరకూ మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాజన్న అన్ని కలలనూ జగనన్న నెరవేరుస్తాడు. రైతన్నలను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. వడ్డీ లేకుండా మహిళలకూ, రైతులకు రుణాలు ఇస్తారు. చదువుకోడానికి అమ్మ అకౌంట్లో నేరుగా సొమ్ము జమవుతుంది. వృద్ధులకీ, వితంతవులకీ 700, వికలాంగులకి 1000 పింఛను లభిస్తుంది. బెల్టు షాపులుండవు. నియోజకవర్గానికి ఒకే మద్యం షాపుంటుంది... అని వివరిస్తూ  జగనన్నను ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు.

Back to Top